సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 25,000 కేసులకు చేరువగా 24,879 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో మహమ్మారి బారినపడి 487 మంది ప్రాణాలు విడిచారు. తాజా కేసులతో గురువారం నాటికి మొత్తం పాజిటివ్ కేసులు 7,67,296కు చేరగా మరణాల సంఖ్య 21,129కు పెరిగింది. ఇక కరోనా నుంచి కోలుకున్న వారిసంఖ్య 4,76,378కి పెరగడంతో రికవరీ రేటు 62.8 శాతంగా నమోదైంది.
కాగా, 2,17,121 కోవిడ్-19 కేసులతో, 9250 మరణాలతో మహారాష్ట్ర కరోనా హాట్‌స్పాట్‌గా కొనసాగుతోంది.1,18,594 కేసులు, 1636 మరణాలతో తమిళనాడు తర్వాతి స్ధానంలో నిలిచింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకూ 1,02,831 కరోనా కేసులు నమోదవగా మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 3165కు పెరిగింది.
జూలై 7 వరకూ దేశవ్యాప్తంగా 1,04,73,771 శాంపిళ్లను పరిశీలించగా, పాజిటివిటీ రేటు 9.31 శాతంగా ఉందని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 1.28 కోట్లకు చేరగా 5,48,429 మంది మరణించారు. అమెరికాలో బుధవారం ఒక్కరోజే రికార్డు స్ధాయిలో 60,000 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. కోవిడ్-19 తీవ్రతతో అమెరికాలోని పలు రాష్ట్రాలు తిరిగి లాక్‌డౌన్ విధిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment