లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలనాలకు, వివాదాలకు మారు పేరుగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల యూపీ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వివాహ వేడుకలను నిషేధిస్తూ యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ నిర్ణయం రాష్ట్రం మొత్తం కాదు.. కేవలం ప్రయాగ్ రాజ్ (అలహాబాద్) సిటీలో మాత్రమే. ఆ సమయంలో కుంభమేళా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వివరించింది. కుంభమేళా జరిగే మూడు నెలల కాలంలో ప్రయాగ్ రాజ్ లో ఎటువంటి పెళ్లి వేడుకలు పెట్టుకోరాదని యోగి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఒకవేళ ఇప్పటికే పెళ్లి తేదీలను - ఫంక్షన్ హాళ్లను మాట్లాడుకున్న వారు వాటిని రద్దు చేసుకోవాలని కూడా ఆదేశించింది. దీంతో ఇప్పటికే ఫంక్షన్ హాళ్లను బుక్ చేసుకున్న వాళ్లు మరో చోటు వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరికొందరు ఈ సీజన్ లో పెళ్లి తేదీలను రద్దు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వెడ్డింగ్ బిజినెస్ కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని వాటి నిర్వాహకులు వాపోతున్నారు. కుంభమేళా ముగిసే వరకు ప్రయాగ్ రాజ్ లో ఎటువంటి పెళ్లి వేడుకలు నిర్వహించరాదు అని ఆదేశాల్లో స్పష్టంగా తెలియజేసింది.
జనవరిలో మకర సంక్రాంతి, పుష్య పూర్ణిమ రోజుల్లో. ఫిబ్రవరిలో మౌని అమావాస్య, బసంత్ పంచమి, మాఘ పూర్ణిమ రోజుల్లో. మార్చిలో మహాశివరాత్రి పర్వదినాలలో జరిగే స్నానాల సమయంలో భారీ ఎత్తున భక్తులు వస్తారని అందుకే ఆ రోజుల్లో వివాహా వేడుకలు ఉంటే ఇబ్బందులు ఎదురయితాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది
Comments
Please login to add a commentAdd a comment