గవర్నర్‌కు ఘనంగా వీడ్కోలు | grand farewell to k.shankar narayan | Sakshi
Sakshi News home page

గవర్నర్‌కు ఘనంగా వీడ్కోలు

Published Wed, Aug 27 2014 10:26 PM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM

మహారాష్ట్ర గవర్నర్ పదవి నుంచి వైదొలగిన కె.శంకరనారాయణన్‌కు రాష్ట్ర మంత్రివర్గం బుధవారం ఘనంగా వీడ్కోలు పలికింది.

ముంబై : మహారాష్ట్ర గవర్నర్ పదవి నుంచి వైదొలగిన కె.శంకరనారాయణన్‌కు రాష్ట్ర మంత్రివర్గం బుధవారం ఘనంగా వీడ్కోలు పలికింది.  ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ నాయకత్వంలో మంత్రివర్గ సభ్యులు వరుసగా శంకరనారాయణన్, ఆయన సతీమణి రాధలకు పుష్పగుచ్ఛాలు అందించి, అభినందనలు తెలిపారు. మలబార్ హిల్‌లోని సహ్యాద్రి గెస్ట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ శంకరనారాయణన్ వీడ్కోలు ప్రసంగం చేశారు. తన పదవిలో ఉన్న గత నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్ర మంత్రివర్గం వందకన్నా అధిక శాతం మద్దతునిచ్చిందని, అందుకు తాను ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.

తనపట్ల ప్రేమాప్యాయతలు చూపిన మహారాష్ట్ర ప్రజలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చవాన్ మాట్లాడుతూ, వెనుకబడిన తరగతుల ప్రజల సంక్షేమం, ఉన్నత విద్య, అభివృద్ధి వంటి రంగాల్లో గవర్నర్ చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. తనకు, తన కేబినెట్ సహచరులకు, ముఖ్యంగా ఇబ్బందులెదురైన సమయంలో శంకరనారాయణన్ ఇచ్చిన ఉచితమైన సలహాల వల్ల తాము, ప్రభుత్వం ఎంతో లబ్ధి పొందామని పేర్కొన్నారు. ఇకపై వ్యక్తిగతంగా తాను శంకరనారాయణన్ సలహాలు, సూచనలను కోల్పోనున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 శంకరనారాయణన్ భావి జీవితంలో సమాజానికి సేవచేస్తూ, ఆరోగ్యకరమైన జీవితం గడపాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముంబై పోలీసులు శంకరనారాయణన్‌కు గౌరవ వందనం సమర్పించారు. వీడ్కోలు కార్యక్రమం ముగిసిన వెంటనే శంకరనారాయణన్ తన సతీమణితో కలిసి కేరళలోని తమ స్వస్థలమైన పాల్ఘట్‌కు బయల్దేరారు. తెలంగాణకు చెందిన సీహెచ్ విద్యాసాగరరావును మహారాష్ట్ర నూతన గవర్నర్‌గా ప్రకటించిన సంగతి తెల్సిందే. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టే వరకు గుజరాత్ గవర్నర్ ఓం ప్రకాశ్ కోహ్లీ ప్రస్తుతం మహారాష్ట్ర బాధ్యతలు కూడా మోస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement