
తాతను నరికేసిన మనవడు..!
కోటా(రాజస్థాన్): ఓ చిన్నపాటి వివాదం కారణంగా ఓ వృద్ధుడిని అతడి కొడుకు, కోడలు, మనవడు కలిసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన గుమాన్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. కోటారి - గోవర్దన్‌పూర్ ప్రాంతానికి చెందిన దేవీలాల్ ప్రజాపత్(70), అతని కుమారులు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. పెద్ద కొడుకు తన పోర్షనులోకి నీటి పైపు వేయాల్సి వచ్చింది. తన పోర్షన్ నుంచి దానిని వేసేందుకు దేవీలాల్ అభ్యంతరం చెప్పాడు. దీనిపై సోమవారం సాయంత్రం పెద్ద కుమారుడితో గొడవ జరిగింది.
ఆయనకి భార్య, కుమారుడు తోడయ్యారు. అంతా కలిసి వృద్ధుడిని ఇంటి బయటకు లాగేశారు. అనంతరం కుమారుడు, కోడలు ప్రజాపత్ చేతులను పట్టుకోగా మనవడు కత్తితో అతని మెడపై నరికాడు. ఘటన అనంతరం ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న ప్రజాపత్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. ప్రజాపత్ మరో కుమారుడు చేసిన ఫిర్యాదు మేరకు నిందితుల కోసం గాలింపు చేపట్టామని గుమాన్‌పురా ఎస్సై హన్స్‌రాజ్ తెలిపారు.