బరంపురం: వాజ్‌పేయి ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలియజేస్తున్న బీజేపీ నాయకులు
భువనేశ్వర్ : భారత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి గొప్ప నాయకుడు. ఆయనతో మంత్రి మండలిలో పని చేసే అవకాశం లభించడం గొప్ప అవకాశం. ఆయన ఆధ్వర్యంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం విశేష అనుభూతి మిగిల్చిందని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గుర్తు చేసుకున్నారు.
ఢిల్లీకి పయనం
అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ప్రాణ రక్షణ వ్యవస్థ ఆధారంతో ఆయనకు చికిత్స కొనసాగించినట్లు న్యూ ఢిల్లీ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) తాజా ప్రకటన జారీ చేసింది. మాజీ ప్రధాన మంత్రి మృతిచెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురువారం న్యూ ఢిల్లీ బయల్దేరారు. ఆరోగ్యం క్షీణించడంతో గత 9 వారాలుగా అటల్ బిహారీ వాజ్‌పేయి న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందారు.
దేశం కోల్పోయిన ఘనమైన నాయకుడు
భువనేశ్వర్ : భారత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి మరణంతో దేశం ఘనమైన నాయకుని కోల్పోయింది. ఆయన ఆత్మకు సద్గతి ప్రాప్తించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం ప్రకటించారు. వాజ్‌పేయి మరణంతో దిగ్భ్రాంతి చెందినట్లు తెలిపారు. దేశ ప్రజల అభిమాన నాయకునిగా వెలుగొందిన భారత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి రాష్ట్ర ప్రజల ప్రియతమ నాయకునిగా వెలుగొందారని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాప సందేశంలో పేర్కొన్నారు.
మాజీ ప్రధానికి ఘన నివాళి
బరంపురం : మాజీ ప్రధానిమంత్రి అటల్‌బిహారీ వాజ్‌పేయి అనారోగ్యంతో దేశ రాజధాని ఢిల్లీలో గల ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం పరలోకం చెందారు. ఈ సందర్భంగా గంజాం జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ నగర్ మెయిన్ రోడ్‌లో గల గాంధీ విగ్రహం దగ్గర మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆత్మ శాంతి కలగాలని ప్రగాఢ సంతాపం వెలిబచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కన్నుచరణ్ పతి, మహిళా మోర్చా అధ్యక్షురాలు సుభాషిణి పట్నాయక్, కార్యదర్శి రాజేంద్ర సాహు, సునీల్ సాహు, టామన్నా పాఢి, శరత్ సాహు తదితరులు పాల్గొన్నారు.
పర్లాకిమిడిలో సంతాపం
పర్లాకిమిడి : మాజీప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి ఆకస్మిక మృతి పట్ల గజపతి జిల్లా భారతీయ జనతాపార్టీ నాయకులు స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతిని వెలిగించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గద్దె వెంకటరమణ, సిద్ధేశ్వర మిశ్రా, సాధారణ కార్యదర్శి జగన్నాథ మహాపాత్రో, ప్రశాంతకుమార్ పాలో, సత్యవాది పాత్రో, గౌరంగో గౌడ, అరుణ్ పట్నాయిక్, సునీల్ మహాపాత్రో, ముల్లి గోపాలరావు, బారిక్ జెన్నా తదితరులు పాల్గొన్నారు. స్థానిక సి.టి.హైస్కూల్‌లో ట్రైనింగ్ పోందుతున్న టీచర్లు అటల్ బిహారీ వాజ్‌పేయి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అయన చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment