రాష్ట్ర నూతన మంత్రివర్గం కొలువుదీరింది. ఆదివారం ఉదయం 11.45 గంటలకు మంత్రిమండలి సభ్యులతో గవర్నర్ ప్రొఫెసర్ గణేషీలాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. స్థానిక లోక్‌సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. నవీన్ కొలువులో 13మంది కేబినెట్ మంత్రులుగా 8మంది సహాయ మంత్రులుగా(ఇండిపెండెంట్) స్థానం దక్కించుకోగా.. వీరిలో ఐదుగురు మహిళలు ఉండటం విశేషం.
ఎప్పటి నుంచో వేచి చూస్తున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యింది. 2019లో ఐదోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నవీన్ పట్నాయక్.. తాజాగా నూతన మంత్రిమండలిని ఏర్పాటు చేశారు. ఇందులో పలువురు మాజీలకు మరోదఫా అవకాశం ఇచ్చారు. అలాగే ఐదుగురు మహిళలకు మంత్రి పదవులు కేటాయించారు. వీరిలో ముగ్గురికి క్యాబినేట్, ఇద్దరు సహాయ మంత్రి పదవులు లభించాయి. ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన ప్రమీల మల్లిక్‌కు క్యాబినేట్ ర్యాంకు కల్పించారు. కొత్త కొలువులో పాత ప్రముఖులకు పట్టం గట్టారు. వీరిలో నిరంజన పూజారి, రణేంద్రప్రతాప్ స్వొయి, ఉషాదేవి, ప్రఫుల్లకుమార్ మల్లిక్, ప్రతాప్‌కేశరి దేవ్, అతున్ సవ్యసాచి నాయక్, ప్రదీప్‌కుమార్ ఆమత్, నవకిషోర్ దాస్, అశోక్‌చంద్ర పండా, టుకుని సాహు, సమీర్‌రంజన దాస్, ప్రీతిరంజన్ ఘొడై, తుషార్‌కాంతి బెహరా, రోహిత్ పూజారి ఉన్నారు. వీరిలో 10 మందికి క్యాబినేట్, 4 మందికి సహాయ మంత్రి పదవులు లభించాయి.
అతివలకు వందనం..
నూతన మంత్రిమండలిలో నవీన్ పట్నాయక్ మహిళలకు పెద్దపీట వేశారు. శాసనసభలో 15 మంది మహిళా సభ్యులు ఉండగా.. వీరిలో ఐదుగురికి మంత్రి పదవులు కేటాయించారు. వీరిలో ముగ్గురు క్యాబినేట్, ఇద్దరికి సహాయ మంత్రి పదవులు వరించాచాయి. ఈ లెక్కన మూడో వంతు పదవులు అతివలకు పదవులు కట్టబెట్టారు. ఎస్పీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కో ఇందులో ఉండటం గమనార్హం. బర్‌గడ్ జిల్లా బిజేపూర్ నియోజకవర్గం నుంచి రీతా సాహు, మయూర్‌భంజ్ జిల్లా కరంజియా నియోజకవర్గం బాసంతి హేంబ్రమ్‌కు తొలిసారిగా మంత్రి బాధ్యతలు చేపట్టడం విశేషం. ఉషాదేవి, ప్రమీల మల్లిక్(ఎస్సీ), టుకుని సాహుకు క్యాబినేట్ పదవులు దక్కించుకున్నారు.
మంత్రివర్గంలో విద్యాధికులు
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంత్రిమండలి విద్యాధికులతో రూపుదిద్దుకుంది. కొలువుదీరిన మంత్రుల సగటు వయసు 58 ఏళ్లు కాగా.. 9మంది మంత్రుల వయసు 50 ఏళ్లు లేదా అంత కంటే తక్కువ కావడం విశేషం. 19మంది డిగ్రీ, ఆపై విద్యార్హతలు కలిగి ఉన్నారు. ఆరుగు పోస్ట్రుగాడ్యుయేట్లు, ముగ్గురు ఇంజినీర్లు ఉన్నారు.
పదవులు కోల్పోయిన మాజీలు
నవీన్ పట్నాయక్ మంత్రిమండలిలో ముగ్గురు అగ్ర నాయకులకు స్థానం లేకుండా పోయింది. వీరిలో ప్రతాప్‌జెనా, కెప్టెన్ దివ్యశంకర మిశ్రా, డాక్టర్ అరుణ్‌కుమార్ సాహు ఉన్నారు. ముగ్గురు మంత్రులు ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకున్నారు. దీంతో ప్రభుత్వం తల దించుకోవాల్సిన దయనీయ పరిస్థితులు తాండవించాయి. మహంగ జంటహత్యల కేసులో ప్రతాప్ జెనా, పూరీ హత్యాకాండలో డాక్టర్ అరుణ్‌కుమార్ సాహు, కలహండి జిల్లా ఉపధ్యా యిని మమిత మెహర్ హత్యాకాండలో కెప్టెన్ దివ్యశంకర మిశ్రా వివాదాలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో విపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేప ట్టి, వీరిని మంత్రిమండలి నుంచి బహిష్కరించాలని భారీ ఆందోళనలు చేపట్టారు. ఈ ప్రభావం వారి స్థానాలపై పడిందని సమాచారం. దక్షత లోపం వంటి కారణాలతో మంత్రులు సుశాంతసింఘ్, ప్రేమానంద నాయక్, జ్యోతిప్రకాష్ పాణిగ్రాహి, పద్మినీదియాన్, ప్రతాప్ జెనా, ప ద్మనాభ బెహరా, సుదాం మరాండి, రఘునందన దాస్ కొత్త కొలువులో స్థానం కోల్పోయారు.
గంజాం జిల్లాలో ఇద్దరికి..
బరంపురం: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లా నుంచి ఇద్దరికి మంత్రిమండలిలో స్థానం దక్కింది. అలాగే అసెంబ్లీ స్పీకర్‌గా బంజనగర్ ఎమ్మెల్యే విక్రమ్‌కేశరి ఆరక్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతంలో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే చికిటి ఎమ్మెల్యే ఉషాదేవి, పులసరా ఎమ్మెల్యే శ్రీకాంత్ సాహు మంత్రి పదవులు దక్కించుకున్నారు. ఇదలి ఉండగా గంజాం జిల్లా దిగపండి ఎమ్మెల్యే స్పీకర్‌గా విధులు నిర్వహించిన సూర్జొపాత్రొ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా జిల్లా మంత్రులకు బరంపురం నగర మేయర్ సంఘమిత్ర దొళాయి అభినందనలు తెలియజేశారు.
సరక స్థానం.. పదిలం
రాయగడ: రాష్ట్ర ఆదివాసీ, హరిజన సంక్షేమశాఖ మంత్రిగా జగన్నాథ సరకకు రెండోసారి మంత్రిమండలిలో స్థానం దక్కింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రెండురోజుల క్రితం మంత్రి మండలిని రద్దు చేసి, కొత్త క్యాబినేట్‌కు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో సరక రెండోసారి మంత్రి మండలిలో స్థానం దక్కించుకోవడంతో జిల్లావాసుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1973 జూన్ 10న బిసంకటక్ సమితి జగిడిలో జన్మించిన ఆయన.. 1997లో జిగిడి సమితి సభ్యుడిగా గెలుపొందారు. అనంతరం అదే పంచాయతీకి సర్పంచ్‌గా పనిచేశారు. 2012లో జరిగిన జిల్లా పరిషత్ చైర్మన్‌గా అవకాశం దక్కించుకున్నారు. అనంతరం 2014లో సార్వత్రిక ఎన్నికలోల బిసంకటక్ నియోజకవర్గం నుంచి పోటీచేసి, ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో మరోసారి విజయం సాధించి, సీఎం ఆశీర్వాదంతో రెండోసారి కూడా క్యాబినేట్‌లో స్థానం దక్కించుకున్నారు.
రణేంద్రప్రతాప్ స్వొయి
జననం: 1953 జూలై 1
స్వస్థలం: రాధా గోవిందపూర్, కటక్ జిల్లా
నియోజకవర్గం: అఠొగొడొ
భార్య: మంజుల దాస్
విద్యార్హతలు: ఎం.ఎ, ఎల్‌ఎల్‌బీ
అభిరుచులు: పర్యటన, పఠనం, క్రీడలు, ఆటలు
నవీన్ పట్నాయక్ మంత్రిమండలిలో రణేంద్రప్రతాప్ స్వొయి హ్యాట్రిక్ మంత్రిగా రికార్డు నెలకొలిపారు. రాజా స్వొయిగా సుపరిచితులైన ఆయన.. నవీన్ నేతృత్వంలో ఏర్పాటైన తొలి మంత్రి మండలిలో స్థానం పొందారు. 2019లో ఏర్పాటైన మంత్రివర్గంలో బెర్తు దక్కించుకున్న రణేంద్రప్రతాప్, మంత్రిమండలి మార్పుచేర్పుల ప్రభావం నుంచి విజయవంతంగా బటయట పడగలిగారు. వ్యవసాయం, రైతు సాధికారిత, మత్స్య, పశు వనరుల అభివృద్ధి క్యాబినేట్ మంత్రిగా నియమితులయ్యారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో విశేష అనుభవం కలిగిన వ్యక్తిగా, సౌమ్యశీలిగా పేరొందారు. 1990 నుంచి వరుసగా 7 పర్యాయాలు రాష్ట్ర శాసనసభకు ఎన్నిక కావడం విశేషం.
మూడు జిల్లాలకు మెండి చెయ్యి!
కొరాపుట్: రాష్ట్ర మంతివర్గ విస్తరణలో మూడు జిల్లాలకు మెండి చెయ్యి మిగిలింది. నవీన్ కొలువులో కొరాపుట్, మల్కన్‌గిరి, నవరంగ్‌పూర్ జిల్లాకు అవకాశం లభించలేదు. ఈ 3 జిల్లాలో బీజేడీ తరఫున 9మంది ఎమ్మెల్యేలుగా గొలుపొందారు. ఇప్పటి వరకు ఈ జిల్లాల నుంచి ఏకైక మంత్రిగా ఉన్న పద్మినీదియాన్ తన పదవిని కోల్పోయారు. ఆమె స్థానంలో సోదరుడు మనోహర్ రంధారికి లభిస్తుందని ఊహాగానాలు వ్యాపించినా.. నిరాసే మిగిలింది. పార్టీ అధిష్టానం సమాచారంతో ఆయన కూడా భువనేశ్వర్ చేరుకొని, క్యాబినేట్ అవకాశం కోసం ఎదురు చూసినా, పిలుపు రాలేదు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జికి అవకాశం వస్తుందని ప్రచారం జరిగి ఫలితం లేకపోయింది. దీంతో అధికార పార్టీ శ్రేణులు డీలా పడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment