reshuffle cabinet
-
పొద్దుపోయేదాకా బీజేపీ మేధోమథనం
న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇంట బుధవారం అర్ధరాత్రి ఈ సమావేశం జరగ్గా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ సీనియర్ నేతలు కొందరు హాజరయ్యారు. ప్రధాని మోదీ ఇటీవలె అమెరికా, ఈజిప్ట్ పర్యటన ముగించుకుని వచ్చారు. అప్పటి నుంచి వరుసగా సమావేశాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. తాజాగా బీజేపీ కార్యకర్తలను సైతం ఉద్దేశించి ప్రసంగించారాయన. అదే సమయంలో జులై 17 నుంచి వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కీలక నేతలంతా అర్ధరాత్రి సమావేశమై చర్చించడం గమనార్హం. బీజేపీ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశంలో.. అభ్యర్థుల జాబితా తయారు, బీజేపీ మేనిఫెస్టో రూపకల్పన గురించి ప్రధానంగా చర్చించినట్లు భోగట్టా. ఎన్నికల అంశంతో పాటు ప్రధానంగా వర్షాకాల సమావేశాల్లోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరపాలని కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అందునా తాజాగా ప్రధాని గళం వినిపించిన యూనిఫామ్ సివిల్‌కోడ్‌ను మేనిఫెస్టోలో కొనసాగించే అంశాన్ని సైతం లేవనెత్తినట్లు ఓ బీజేపీ కీలక నేత చెబుతున్నారు. ఈ భేటీ ఆధారంగా.. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం వీలైనంత త్వరలో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.ఔ ఐదు రాష్ట్రాలపై మేదోమధనం సార్వత్రిక ఎన్నికలతో పాటు రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ అగ్రనాయకత్వం మేదో మధనం చేసింది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలలో బిజీగా ఉండడంతో నిర్ణయాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి నుంచి పొద్దు పోయే వరకు ప్రధాని నివాసంలో భేటీలో కీలకంగా చర్చించారు. ప్రధానంగా తెలంగాణ సహా పలు ఎన్నికల రాష్ట్రాలలో పార్టీ నాయకత్వంలో సంస్థాగత మార్పులకు సంబంధించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గత నెల రోజుల నుంచి కొనసాగుతున్న కసరత్తు ఓ కొలిక్కిరాగా.. ఏ క్షణమైనా కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. పార్టీలో, క్యాబినెట్లో మార్పుల చేర్పులపై, విపక్ష కూటమి బలపడుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన కార్యాచరణ పై చర్చించినట్లు సమాచారం. -
ఒరిస్సా కొత్త క్యాబినెట్.. ఎన్నాళ్లో వేచిన ఉదయం..
రాష్ట్ర నూతన మంత్రివర్గం కొలువుదీరింది. ఆదివారం ఉదయం 11.45 గంటలకు మంత్రిమండలి సభ్యులతో గవర్నర్ ప్రొఫెసర్ గణేషీలాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. స్థానిక లోక్‌సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. నవీన్ కొలువులో 13మంది కేబినెట్ మంత్రులుగా 8మంది సహాయ మంత్రులుగా(ఇండిపెండెంట్) స్థానం దక్కించుకోగా.. వీరిలో ఐదుగురు మహిళలు ఉండటం విశేషం. ఎప్పటి నుంచో వేచి చూస్తున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యింది. 2019లో ఐదోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నవీన్ పట్నాయక్.. తాజాగా నూతన మంత్రిమండలిని ఏర్పాటు చేశారు. ఇందులో పలువురు మాజీలకు మరోదఫా అవకాశం ఇచ్చారు. అలాగే ఐదుగురు మహిళలకు మంత్రి పదవులు కేటాయించారు. వీరిలో ముగ్గురికి క్యాబినేట్, ఇద్దరు సహాయ మంత్రి పదవులు లభించాయి. ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన ప్రమీల మల్లిక్‌కు క్యాబినేట్ ర్యాంకు కల్పించారు. కొత్త కొలువులో పాత ప్రముఖులకు పట్టం గట్టారు. వీరిలో నిరంజన పూజారి, రణేంద్రప్రతాప్ స్వొయి, ఉషాదేవి, ప్రఫుల్లకుమార్ మల్లిక్, ప్రతాప్కేశరి దేవ్, అతున్ సవ్యసాచి నాయక్, ప్రదీప్‌కుమార్ ఆమత్, నవకిషోర్ దాస్, అశోక్‌చంద్ర పండా, టుకుని సాహు, సమీర్రంజన దాస్, ప్రీతిరంజన్ ఘొడై, తుషార్‌కాంతి బెహరా, రోహిత్ పూజారి ఉన్నారు. వీరిలో 10 మందికి క్యాబినేట్, 4 మందికి సహాయ మంత్రి పదవులు లభించాయి. అతివలకు వందనం.. నూతన మంత్రిమండలిలో నవీన్ పట్నాయక్ మహిళలకు పెద్దపీట వేశారు. శాసనసభలో 15 మంది మహిళా సభ్యులు ఉండగా.. వీరిలో ఐదుగురికి మంత్రి పదవులు కేటాయించారు. వీరిలో ముగ్గురు క్యాబినేట్, ఇద్దరికి సహాయ మంత్రి పదవులు వరించాచాయి. ఈ లెక్కన మూడో వంతు పదవులు అతివలకు పదవులు కట్టబెట్టారు. ఎస్పీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కో ఇందులో ఉండటం గమనార్హం. బర్గడ్ జిల్లా బిజేపూర్ నియోజకవర్గం నుంచి రీతా సాహు, మయూర్భంజ్ జిల్లా కరంజియా నియోజకవర్గం బాసంతి హేంబ్రమ్కు తొలిసారిగా మంత్రి బాధ్యతలు చేపట్టడం విశేషం. ఉషాదేవి, ప్రమీల మల్లిక్(ఎస్సీ), టుకుని సాహుకు క్యాబినేట్ పదవులు దక్కించుకున్నారు. మంత్రివర్గంలో విద్యాధికులు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంత్రిమండలి విద్యాధికులతో రూపుదిద్దుకుంది. కొలువుదీరిన మంత్రుల సగటు వయసు 58 ఏళ్లు కాగా.. 9మంది మంత్రుల వయసు 50 ఏళ్లు లేదా అంత కంటే తక్కువ కావడం విశేషం. 19మంది డిగ్రీ, ఆపై విద్యార్హతలు కలిగి ఉన్నారు. ఆరుగు పోస్ట్రుగాడ్యుయేట్లు, ముగ్గురు ఇంజినీర్లు ఉన్నారు. పదవులు కోల్పోయిన మాజీలు నవీన్ పట్నాయక్ మంత్రిమండలిలో ముగ్గురు అగ్ర నాయకులకు స్థానం లేకుండా పోయింది. వీరిలో ప్రతాప్జెనా, కెప్టెన్ దివ్యశంకర మిశ్రా, డాక్టర్ అరుణ్‌కుమార్ సాహు ఉన్నారు. ముగ్గురు మంత్రులు ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకున్నారు. దీంతో ప్రభుత్వం తల దించుకోవాల్సిన దయనీయ పరిస్థితులు తాండవించాయి. మహంగ జంటహత్యల కేసులో ప్రతాప్ జెనా, పూరీ హత్యాకాండలో డాక్టర్ అరుణ్‌కుమార్ సాహు, కలహండి జిల్లా ఉపధ్యా యిని మమిత మెహర్ హత్యాకాండలో కెప్టెన్ దివ్యశంకర మిశ్రా వివాదాలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో విపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేప ట్టి, వీరిని మంత్రిమండలి నుంచి బహిష్కరించాలని భారీ ఆందోళనలు చేపట్టారు. ఈ ప్రభావం వారి స్థానాలపై పడిందని సమాచారం. దక్షత లోపం వంటి కారణాలతో మంత్రులు సుశాంతసింఘ్, ప్రేమానంద నాయక్, జ్యోతిప్రకాష్ పాణిగ్రాహి, పద్మినీదియాన్, ప్రతాప్ జెనా, ప ద్మనాభ బెహరా, సుదాం మరాండి, రఘునందన దాస్ కొత్త కొలువులో స్థానం కోల్పోయారు. గంజాం జిల్లాలో ఇద్దరికి.. బరంపురం: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లా నుంచి ఇద్దరికి మంత్రిమండలిలో స్థానం దక్కింది. అలాగే అసెంబ్లీ స్పీకర్‌గా బంజనగర్ ఎమ్మెల్యే విక్రమ్‌కేశరి ఆరక్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతంలో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే చికిటి ఎమ్మెల్యే ఉషాదేవి, పులసరా ఎమ్మెల్యే శ్రీకాంత్ సాహు మంత్రి పదవులు దక్కించుకున్నారు. ఇదలి ఉండగా గంజాం జిల్లా దిగపండి ఎమ్మెల్యే స్పీకర్‌గా విధులు నిర్వహించిన సూర్జొపాత్రొ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా జిల్లా మంత్రులకు బరంపురం నగర మేయర్ సంఘమిత్ర దొళాయి అభినందనలు తెలియజేశారు. సరక స్థానం.. పదిలం రాయగడ: రాష్ట్ర ఆదివాసీ, హరిజన సంక్షేమశాఖ మంత్రిగా జగన్నాథ సరకకు రెండోసారి మంత్రిమండలిలో స్థానం దక్కింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రెండురోజుల క్రితం మంత్రి మండలిని రద్దు చేసి, కొత్త క్యాబినేట్‌కు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో సరక రెండోసారి మంత్రి మండలిలో స్థానం దక్కించుకోవడంతో జిల్లావాసుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1973 జూన్ 10న బిసంకటక్ సమితి జగిడిలో జన్మించిన ఆయన.. 1997లో జిగిడి సమితి సభ్యుడిగా గెలుపొందారు. అనంతరం అదే పంచాయతీకి సర్పంచ్‌గా పనిచేశారు. 2012లో జరిగిన జిల్లా పరిషత్ చైర్మన్‌గా అవకాశం దక్కించుకున్నారు. అనంతరం 2014లో సార్వత్రిక ఎన్నికలోల బిసంకటక్ నియోజకవర్గం నుంచి పోటీచేసి, ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో మరోసారి విజయం సాధించి, సీఎం ఆశీర్వాదంతో రెండోసారి కూడా క్యాబినేట్లో స్థానం దక్కించుకున్నారు. రణేంద్రప్రతాప్ స్వొయి జననం: 1953 జూలై 1 స్వస్థలం: రాధా గోవిందపూర్, కటక్ జిల్లా నియోజకవర్గం: అఠొగొడొ భార్య: మంజుల దాస్ విద్యార్హతలు: ఎం.ఎ, ఎల్ఎల్బీ అభిరుచులు: పర్యటన, పఠనం, క్రీడలు, ఆటలు నవీన్ పట్నాయక్ మంత్రిమండలిలో రణేంద్రప్రతాప్ స్వొయి హ్యాట్రిక్ మంత్రిగా రికార్డు నెలకొలిపారు. రాజా స్వొయిగా సుపరిచితులైన ఆయన.. నవీన్ నేతృత్వంలో ఏర్పాటైన తొలి మంత్రి మండలిలో స్థానం పొందారు. 2019లో ఏర్పాటైన మంత్రివర్గంలో బెర్తు దక్కించుకున్న రణేంద్రప్రతాప్, మంత్రిమండలి మార్పుచేర్పుల ప్రభావం నుంచి విజయవంతంగా బటయట పడగలిగారు. వ్యవసాయం, రైతు సాధికారిత, మత్స్య, పశు వనరుల అభివృద్ధి క్యాబినేట్ మంత్రిగా నియమితులయ్యారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో విశేష అనుభవం కలిగిన వ్యక్తిగా, సౌమ్యశీలిగా పేరొందారు. 1990 నుంచి వరుసగా 7 పర్యాయాలు రాష్ట్ర శాసనసభకు ఎన్నిక కావడం విశేషం. మూడు జిల్లాలకు మెండి చెయ్యి! కొరాపుట్: రాష్ట్ర మంతివర్గ విస్తరణలో మూడు జిల్లాలకు మెండి చెయ్యి మిగిలింది. నవీన్ కొలువులో కొరాపుట్, మల్కన్‌గిరి, నవరంగ్‌పూర్ జిల్లాకు అవకాశం లభించలేదు. ఈ 3 జిల్లాలో బీజేడీ తరఫున 9మంది ఎమ్మెల్యేలుగా గొలుపొందారు. ఇప్పటి వరకు ఈ జిల్లాల నుంచి ఏకైక మంత్రిగా ఉన్న పద్మినీదియాన్ తన పదవిని కోల్పోయారు. ఆమె స్థానంలో సోదరుడు మనోహర్ రంధారికి లభిస్తుందని ఊహాగానాలు వ్యాపించినా.. నిరాసే మిగిలింది. పార్టీ అధిష్టానం సమాచారంతో ఆయన కూడా భువనేశ్వర్ చేరుకొని, క్యాబినేట్ అవకాశం కోసం ఎదురు చూసినా, పిలుపు రాలేదు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జికి అవకాశం వస్తుందని ప్రచారం జరిగి ఫలితం లేకపోయింది. దీంతో అధికార పార్టీ శ్రేణులు డీలా పడిపోయారు. -
ఇదో ‘అనుభూతి’ బాణం!
మంత్రివర్గాల్లో మార్పులు, చేర్పులు సాధారణం. మొన్నటి కేంద్ర మంత్రివర్గ మార్పుచేర్పులు మాత్రం అసాధారణం. గడిచిన డెబ్బయ్యేళ్ల చరిత్రలో ఇంతటి భారీస్థాయి పునర్వ్య వస్థీకరణ దేశంలో ఎప్పుడూ జరగలేదు. పన్నెండుమందిని తొల గించి 36 మందిని కొత్తగా తీసుకున్నారు. కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య ప్రధానితో కలిపి 78కి చేరింది. యూపీఏ-2ను జంబో కేబినెట్‌గా బీజేపీ వాళ్లు ఆనాడు వెక్కిరించారు. ఇప్పుడు వారి మంత్రి మండలిలో అంతకంటే ఒక నెంబర్ పెరిగింది. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు నరేంద్ర మోదీ ‘పరిమిత ప్రభుత్వం-విస్తృత పరిపాలన’ తమ లక్ష్యమని చెప్పే వారు. అందుకు తగినట్టుగానే 2014లో తొలి కేబినెట్ కూర్పును తనతో సహా 46 మందితోనే సరిపెట్టారు. నిబంధనల ప్రకారం మంత్రిమండలి సంఖ్య 81 దాకా ఉండవచ్చు. కనుక ఇప్పటి ఈ జంబో కేబినెట్‌ను తప్పుపట్టవలసిన అవసరం ఏమీలేదు. కానీ ‘పరిమిత ప్రభుత్వం’ అనే సంకల్పం పరిధులు ఎందుకు విస్తరించవలసి వచ్చిందనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీజేపీ లేదా దాని నాయకత్వంలోని కూటమి మరోసారి గెలిచి ఢిల్లీ గద్దెనెక్కితే ఆ పార్టీ సుదీర్ఘ పరిపాలనా ప్రస్థానానికి వీలు చిక్కుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నామమాత్రావశిష్టంగా తయారైంది. మరో ఓటమిని నిభాయించుకోలేదు. పూర్తిగా శిథిలమైపోతుంది. ఆ శిథిలాల మీద మరో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక నిర్మాణానికి సమయం పడుతుంది. ఈలోపల గట్టిగా కుదురుకుంటే, ఏక బిగిన ఐదుసార్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ రికార్డును తిరగ రాయవచ్చన్న ఆశ బీజేపీ నాయకత్వాన్ని సలుపుతున్నది. ఇంకోసారి గెలిస్తే నెహ్రూ తర్వాత హ్యాట్రిక్ విజయాలనందించిన నాయకుడిగా మోదీ మెడలో ఓ వీరతాడు పడుతుంది. ఇందిరమ్మ నాలుగుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మూడు విజయాలనందించారు. కానీ వరుసగా కాదు. ఈ నేపథ్యంలో బీజేపీ, వ్యక్తిగతంగా నరేంద్ర మోదీ ఒక అపురూప సన్నివేశపు అంచున నిలబడి ఉన్నారని భావించాలి. నరేంద్ర మోదీ హ్యాట్రిక్ కొడతారా? కాషాయ యుగపు పాంచజన్యం పూరిస్తారా? ఈ లక్ష్యసాధనకు గల అవకాశా లేమిటి? అడ్డంకులేమిటి? అనే విషయాలపై మేధోమథనం జరి గిన తర్వాతనే జంబో కేబినెట్ రంగప్రవేశం చేసిందనే అభి ప్రాయం కలుగుతున్నది. రాజకీయంగా చూస్తే ఇప్పటికీ మోదీకి దీటైన నాయకుడు ప్రతిపక్ష శిబిరంలో కనిపించడం లేదు. రెండేళ్ల కిందటితో పోలిస్తే రేటింగ్ కొంత తగ్గినప్పటికీ మోదీయే అగ్ర స్థానంలో కొనసాగుతున్నారని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఆయ నకు దరిదాపుల్లో కూడా మరో నాయకుడు లేడు. అయితే పరిపాలనాపరంగా ఆయన ప్రభుత్వానికి పడుతున్న మార్కు లెన్ని?. ప్రజల ఆర్థిక - ఆయురారోగ్య పరిస్థితులెట్లా వున్నాయి? రక్షణ-విదేశాంగ విధానాలు దేశ ప్రతిష్ట ఇనుమడించేవిధంగా ఉన్నాయా? ఉద్యోగ ఉపాధి రంగాలు యువతరంగాలతో జత గూడుతున్నాయా? వ్యవసాయం, పరిశ్రమలూ లాభదాయకం గానే ఉన్నాయా? ... ఇత్యాది అంశాలపై అలుముకునే ప్రజాభి ప్రాయమే మోదీ పాలనపై రేపటి తీర్పునకు కీలకం. ప్రజాభిప్రాయం ఎట్లా ఏర్పడుతుంది? ఒకటి ప్రత్యక్ష అనుభవం, రెండోది పరోక్షంగా కలిగే అనుభూతి. కరోనా పీక్ టైమ్‌లో ఇంటిల్లిపాదికీ సోకిందనుకోండి. ఒకరికో ఇద్దరికో సీరి యస్ అయింది. ఆస్పత్రిలో బెడ్ ఆలస్యంగా దొరికింది. ఆక్సిజన్ సిలిండర్ దొరకలేదు. ఒకరు చనిపోయారు. మోదీ ప్రభుత్వం పనితీరుపై ఆ కుటుంబ సభ్యులు అనుభవపూర్వకంగా చెబు తారు. కరోనా సమయంలో వైద్య ఆరోగ్యశాఖ సరిగ్గా పనిచేయ లేదు. ఇటువంటి అలక్ష్యాన్ని మోదీ అస్సలు సహించరు. ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ను పీకిపారేశారు. ఇది అనుభూతి. అనుభవం వ్యక్తిగతం. ఇది కూడిక లెక్కలతో పెరుగుతుంది. అనుభూతి సామూహికం. ఇది హెచ్చవేతలతో పెరుగుతుంది. కనుక చాలా సందర్భాల్లో వ్యక్తిగత అనుభవాల (experiences ) కంటే సామూహిక అనుభూతి (perception)ది పైచేయి అవు తుంది. ‘హర్ దర్ద్కో ఏకీ దవా (సర్వరోగనివారిణి) జిందా తిలి స్మాత్’ అనే మాటను పూర్వకాలం నుంచీ వింటున్నాము. ఆ మందును ఎప్పుడూ వాడకపోయినా, ఆ నినాదాన్నయితే నమ్ముతాము. అదీ అనుభూతి. మోదీ సర్కార్ పాలనలో ప్రజల వ్యక్తిగత దైనందిన జీవితానుభవాలు ఎట్లా ఉన్నా... సామూహి కంగా ఒక పాజిటివ్ అనుభూతిని ఉత్పత్తి చేయడం సంఘ్ పరివార్ మేథోవర్గం ముందున్న తక్షణ కర్తవ్యం. ఆ కార్యక్రమంలో తొలిదశ మొన్న జంబో కేబినెట్ ఏర్పాటుతో పూర్తవుతుంది. కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన వారిలో రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్, రమేశ్ పోఖ్రియాల్, డాక్టర్ హర్ష వర్ధన్, సదానందగౌడ వంటి సీనియర్లు ఉండటం కొంత ఆశ్చ ర్యాన్ని కలిగించింది. కీలక శాఖల్లోని వైఫల్యాలకు కొందరు వ్యక్తులను బాధ్యులుగా చేయడం ద్వారా ప్రభుత్వ ఇమేజ్ను కాపాడుకునే ప్రయత్నంగా ఈ చర్య ఉన్నదనే అభిప్రాయం విన బడుతున్నది. ఈ పునర్వ్యవస్థీకరణ తర్వాత గతంలో వాజ్ పేయి ప్రభుత్వంలో పనిచేసిన వారిలో రాజ్‌నాథ్, నఖ్వీ ఇద్దరే మిగిలారు. ఇది వాజ్‌పేయి నీడ కూడా లేని అచ్చమైన మోదీ కేబినెట్. వైఫల్యాలను కడిగేసుకోవడంతోపాటు సామాజిక మార్పు సంకేతాలను కూడా ఈ పునర్వ్యవస్థీకరణ బలంగా ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ తొలిరోజుల్లో ‘జనసంఘ్’గా ఉన్న ప్పుడు దానిపై బ్రాహ్మణ్-బనియా (వైశ్య) ముద్ర ఉండేది. ఎమర్జెన్సీ సమయంలో జనతా పార్టీలో విలీనం కావడం, అందులో చేరిన నానాజాతి సభ్యుల్లోని తటస్థ వర్గాలను తన గూటికి ఆకర్షించి బీజేపీ పేరుతో పునరుత్థానమవడం వెనుక వాజ్‌పేయి, అడ్వాణీల వ్యూహరచనా చాతుర్యం కనిపిస్తుంది. ఈ వ్యూహం ఆరెస్సెస్ ఆలోచన కూడా కావచ్చు. అనంతర కాలంలో రామ మందిర ఉద్యమం ద్వారా ఉత్తరాదిలోని వెనుకబడిన వర్గాలనూ, గిరిజనులను పెద్దఎత్తున బీజేపీ సమీకరించుకోగలిగింది. పార్టీ సామాజిక పొందికను విస్తృతం చేసే పనిని మోదీ మరింత వేగవంతం చేశారు. ప్రధానితో సహా 78 మంది సభ్యులున్న మంత్రి మండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల సంఖ్య 52. బహుశా స్వతంత్ర భారత చరిత్రలో ఇంత ఎక్కువమంది బలహీనవర్గాల ప్రతినిధులున్న కేంద్ర మంత్రి వర్గం ఇదే కావచ్చు. ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడం ద్వారా ఆయా వర్గాల పాజిటివ్ అనుభూతిని మోదీ ప్రభుత్వం ఆశిస్తున్నదని చెప్ప వచ్చు. కేంద్ర మంత్రిమండళ్లలో సహాయ మంత్రుల పాత్ర నామమాత్రం. అధికారాన్ని చలాయించే కేబినెట్ మంత్రులు ఇప్పుడు ప్రధానితో కలిపి 31 మంది ఉన్నారు. వీరిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలన్నీ కలిపితే 11 మంది. ఇరవైమంది హిందూ అగ్రవర్ణాల వారు. వారిలో ఆరుగురు బ్రాహ్మణులు. ఐదుగురు రాజ్‌పుత్‌లు. ఇద్దరు బనియాలు, ఇద్దరు పాటీదార్లు (పటేల్), ఒకరు రెడ్డి. ఒకరు భూమిహార్, ఒకరు మల్హోత్రా. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా కేబినెట్ కూర్పును ఖరారు చేసినట్టు స్పష్టంగా కనిపి స్తున్నది. ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లకు పెద్దపీట వేశారు. ఈ రెండు రాష్ట్రాలు బీజేపీకి ప్రతిష్టాత్మకం. ఎక్కువ లోక్‌సభ సీట్లున్న యూపీ నుంచి ఏడుగురిని కొత్తగా తీసుకున్నారు. వీరిలో ఎక్కు వమంది యాదవేతర బీసీలు. ఇక్కడ బీజేపీకి ప్రధాన పోటీ దారు అఖిలేశ్ సింగ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీ. ఈ పార్టీ నుంచి నాన్-యాదవ్ బీసీలను దూరం చేయడం ద్వారా యాదవ-ముస్లిం వర్గాలకే సమాజ్‌వాది పార్టీని పరి మితం చేసే లక్ష్యం ఈ వ్యూహంలో కనిపిస్తున్నది. యాదవుల తర్వాత ప్రధాన బీసీ కులమైన కుర్మీ వర్గానికి చెందిన అనుప్రియా పటేల్ (అప్నాదళ్)కు రెండేళ్ల తర్వాత మళ్లీ పదవీయోగం పట్టింది. ఉత్తరాఖండ్‌పై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఐదు ఎంపీ సీట్లున్న చిన్న రాష్ట్రం అది. ఇక్కడ ఒకసారి కాంగ్రెస్ గెలిస్తే మరోసారి బీజేపీ గెలవడం ఆనవాయితీ. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. గుజరాత్ గెలుపు పట్ల బీజేపీలో పెద్దగా అనుమానాల్లేవు. ముఖ్యమంత్రి కంటే ప్రధానమంత్రిని దృష్టిలో పెట్టుకునే జనం ఓట్లేస్తారని ఆ పార్టీ విశ్వాసం. అయినా ఛాన్స్ తీసుకోకుండా రాష్ట్రంలో బలీయమైన సామాజిక వర్గంగా ఉన్న పాటీదార్ల (పటేళ్లు)కు రెండు కేబినెట్ బెర్తులు కేటాయించారు. పంజాబ్‌ను అంతగా పట్టించుకోలేదు. రైతుల ఆందోళన తర్వాత పంజాబ్ మీద బీజేపీ పూర్తిగా ఆశలు వదులుకున్నది. పంజాబ్ నుంచి ఒక్క జాట్ సిక్కుకూ స్థానం దొరకని మొట్టమొదటి కేంద్ర మంత్రిమండలి ఇదే. ఈ రాష్ట్రానికి చెందిన హర్దీప్సింగ్ పూరీ అనే ఖత్రీ కులానికి చెందిన సిక్కు కేబినెట్లో ఉన్నారు. రాష్ట్రంలో జాట్ సిక్కుల జనాభా 30 శాతం దాకా ఉంటుంది. దళితుల జనాభా మరో 30 శాతం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కూ, లెఫ్ట్, బీఎస్పీలతో కూడిన అకాలీదళ్ కూటమికీ మధ్యనే ప్రధానంగా పోటీ జరగబోతున్నది. పటియాలా రాజవంశస్థు డైన కెప్టెన్ అమరీందర్‌సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గానే ఉందన్న అభిప్రాయం ఉన్నది. యువకులు, విద్యావంతుల అనుభూతిని కూడా ప్రభా వితం చేసే అంశాలకు కేబినెట్ పొందికలో వీలు కల్పించారు. కేంద్ర మంత్రుల సగటు వయసు 58కి తగ్గింది. రాజకీయ రంగంలో ఇది యూత్ కిందే లెక్క. అట్లాగే మాజీ ఐఏఎస్ అధికారులకు, టెక్నోక్రాట్లకు, డాక్టర్లకు, లాయర్లకు అవకాశం లభించింది. అశ్వినీ కుమార్ వైష్ణవ్ మాజీ ఐఏఎస్ అధికారి. ఆయనకిప్పుడు కేబినెట్ హోదా వచ్చింది. వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ చేశారు. కాన్పూర్ ఐఐటీలో ఎమ్‌టెక్ చేశారు. అక్కడ ఆయన స్పెషలైజేషన్ పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్ షిప్ మీద. ఆయనకిప్పుడు రైల్వే శాఖ లభించడం వెనుక లక్ష్యం సుస్పష్టమే. భారతీయ రైల్వేలు ఇక పీపీపీ పట్టాలెక్కబోతు న్నాయి. మరో ఐఏఎస్ అధికారి రాజ్‌కుమార్‌సింగ్‌కు ప్రమోషన్ లభించి కేబినెట్ మంత్రయ్యారు. బీజేపీ ప్రజా పునాదులను విస్తృతం చేసిన అడ్వాణీ రథయాత్ర జరుగుతున్నప్పుడు రాజ్ కుమార్‌సింగ్ బిహార్ కో-ఆపరేటివ్ రిజిస్ట్రార్. అప్పుడు ముఖ్య మంత్రిగా ఉన్న లాలూయాదవ్ జిల్లా కలెక్టర్‌కూ, ఎస్పీకి చెప్ప కుండా రాజ్‌కుమార్‌కు అదనపు మేజిస్ట్రేట్ హోదా కల్పిస్తూ ప్రత్యేక ఆదేశాలిచ్చి ఈయన ద్వారానే అడ్వాణీని అరెస్ట్ చేయిం చారని చెబుతారు. అడ్వాణీని అరెస్ట్ చేసిన అధికారి అదే బీజేపీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి కావడం విధివిలాసమేమో! కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన రాజీవ్ చంద్రశేఖర్ ఇలినాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఎమ్‌టెక్ పట్టా పొందారు. ఆయనకిప్పుడు ఐటీ సహాయమంత్రి పదవి లభించింది. బీపీఎల్ టెలికామ్ కంపెనీని ఈయనే స్థాపించారు. యువతలో నైపుణ్యాభివృద్ధి కార్యక్ర మాన్ని ఈయన పర్యవేక్షించనున్నారు. మంత్రిమండలిలో మహి ళల సంఖ్య కూడా 11కు పెరిగింది. అందుబాటులో ఉన్న వివ రాల మేరకు ఇప్పటివరకు ఇదే పెద్ద సంఖ్య. మంత్రిమండలి కూర్పులోని సానుకూలాంశాలను ప్రచారం చేసుకోవడం ద్వారా లబ్ధిపొందాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఈ పైపూతల వల్ల లోతైన గాయాలు (ఉంటే) ఏమేరకు మాను తాయో చూడాలి. కీలక మంత్రులను తప్పించినంత మాత్రాన వైఫల్యాలను కప్పిపుచ్చుకోగలగడం సాధ్యమేనా? ఈ అంశం మీద ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ ఎమ్మెల్యే, యువ దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీ ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ‘‘ఖరాబీ ఇంజిన్ మే హై, ఔర్ బద్లే డిబ్బే జారహే హై’’. సమస్య ఇంజన్లో ఉంటే డబ్బాలను మారుస్తున్నారట. ఈ రైలు కోరుకున్న గమ్యాన్ని చేరుకుంటే మాత్రం జిగ్నేష్ చేసిన కామెంట్ తప్పవుతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
12 మందికి ఉద్వాసన..
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2019లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కీలక శాఖలు చేపట్టిన వారిలో ఏకంగా ఆరుగురు కేబినెట్ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరితో పాటు ఆరుగురు సహాయమంత్రులు సైతం బుధవారం జరిగిన మంత్రివర్గ విస్తరణకు ముందు రాజీనామాలు సమర్పించారు. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ 12మంది కేంద్ర మంత్రుల రాజీనామాలను ఆమోదించారు. కేంద్ర మంత్రుల రాజీనామాల వెనుక వారి వయస్సు, కరోనా సమయంలో శాఖల పనితీరు, బెంగాల్ ఎన్నికల ప్రభావం స్పష్టంగా కనిíపించింది. ఇందులో కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రిగా ఉన్న తావర్‌చంద్ గెహ్లాట్‌ను వయస్సు రీత్యా మంత్రివర్గం నుంచి తప్పించి కర్ణాటక గవర్నర్‌గా నియమించారు. ఈయనతోపాటు విద్య, వైద్య, పర్యావరణ శాఖలకు చెందిన కేబినెట్ మంత్రితో పాటు సహాయమంత్రులను సైతం పక్కనబెట్టేశారు. కరోనా సెకండ్ వేవ్‌లో దేశంలోని ఆరోగ్య సేవల పేలవమైన పరిస్థితి కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఉద్వాసనకు దారితీసింది. అదే శాఖలోని సహాయమంత్రి అశ్విని చౌబేపై వేటు పడింది. బెంగాల్లో బీజేపీ ఓటమి ప్రభావంతో ఇద్దరు బెంగాల్‌కు చెందిన బాబుల్ సుప్రియో, దేబోశ్రీ చౌదరిలపై వేటు పడింది. వీరితో పాటు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డి.వి.సదానంద గౌడ, కేంద్ర న్యాయ, ఐటీ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్, విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, కార్మిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర) సంతోష్ కుమార్ గంగ్వార్లకు ఉద్వాసన పలికారు. వీరితోపాటు సంజయ్ ధోత్రే, రతన్‌లాల్ కటారియా, ప్రతాప్ సారంగీ తమ పదవులకు రాజీనామా చేశారు. కరోనా కారణంగా హర్షవర్ధన్ ఉద్వాసన కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలు కుప్పకూలి పోయిన కారణంగా వై ద్య శాఖ మంత్రిగా ఉన్న డాక్టర్ హర్షవర్థన్‌పై వేటు పడిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో మోదీ ప్రభుత్వం పైపెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ కారణంగా హర్షవర్ధన్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను కూడా నిర్వహించారు. అటువంటి పరిస్థితిలో హర్షవర్థన్ రాజీనామాతో 2 కీలక శాఖలు ఖాళీ అయ్యాయి. అనారోగ్య కారణాలతో పోఖ్రియాల్ ఔట్ ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రమేష్ పోఖ్రియాల్ కేంద్ర విద్యాశాఖ బాధ్యతలకు రాజీనామా చేశారు. ఆరోగ్య సమస్యల కారణాలతో నిశాంక్‌ను తొలగించినట్లు తెలిసింది. కొన్ని రోజుల క్రితం ఆయన కరోనా బారినపడి ఒక నెల పాటు ఆసుపత్రి పాలయ్యారు. ఆ సమయంలో దేశంలో విద్యారంగంలో పరిస్థితి ఘోరంగా దిగజారిందనే విమర్శలు వచ్చాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల ఒత్తిడి నేపథ్యంలో సీబీఎస్ఈపై నిర్ణయం తీసుకొనే విషయంలో ప్రధాని మోదీ స్వయంగా ముందుకు రావలసి వచ్చింది. ప్రధాని మోదీ ఎంతో కీలకంగా భావించే జాతీయ విద్యావిధానం అమలులో మంత్రిగా చొరవ చూపలేదన్నది కూడా పదవి కోల్పోవడానికి కారణమని తెలిసింది. బెంగాల్ ఎన్నికల కారణంగా.. పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ లోక్‌సభ స్థానానికి చెందిన ఎంపీ బాబుల్ సుప్రియో కేంద్ర పర్యావరణ శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఆయనను బాధ్యుడిగా చేసిన కారణంగా పార్టీపై సుప్రియో ఆగ్రహంగా ఉన్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. సుమారు 50వేల ఓట్ల తేడాతో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. మోడీ ప్రభుత్వ మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఉన్న తావర్‌చంద్ గెహ్లాట్ తన వయస్సు రీత్యా పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది. అయితే, ఆయనను కర్ణాటక గవర్నర్‌గా చేయడం ద్వారా క్రియాశీల రాజకీయాల నుంచి గౌరవప్రదమైన వీడ్కోలు ఇచ్చారు. 3 శాఖలపై కరోనా తీవ్ర ప్రభావం ► ఆరోగ్య శాఖ: సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవటంలో, నిర్వహణలో పూర్తిగా విఫలమైంది. దీంతో ఇద్దరు మంత్రులను తొలగించారు. ► విద్యా శాఖ: నూతన జాతీయ విద్యావిధానాన్ని దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి క్రెడిట్ రాలేదు. దీంతో ఇద్దరు మంత్రులను తొలగించారు. ► కార్మిక శాఖ: కార్మికుల వలస, సుప్రీంకోర్టు మందలించడం, అసంఘటిత రంగ కార్మికుల కోసం పోర్టల్‌ను సృష్టించలేకపోవడం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై మంత్రి రాసిన లేఖ వైరల్ కారణంగా మంత్రిపై వేటు. -
మోదీ పునర్ వ్యవస్థీకరణ రూపం ఇలా..
కేబినెట్ మంత్రులు 1. రాజ్ నాథ్ సింగ్: రక్షణ శాఖ 2. అమిత్ షా: హోం శాఖ, సహకార శాఖ 3. నితిన్ గడ్కరీ: రోడ్డు రవాణా, రహదారులు 4. నిర్మలా సీతారామన్: ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాలు 5. నరేంద్ర సింగ్ తోమర్: వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ 6. జైశంకర్: విదేశాంగ వ్యవహారాలు 7. అర్జున్ ముండా: గిరిజన వ్యవహారాలు 8. స్మృతీ ఇరానీ: మహిళా, శిశు అభివృద్ధి శాఖ 9. పీయూష్ గోయల్: వాణిజ్య, పరిశ్రమల శాఖ, ఆహార ప్రజా పంపిణీ శాఖ, జౌళి శాఖ 10.ధర్మేంద్ర ప్రధాన్ : విద్యాశాఖ మంత్రి; నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత శాఖ 11. ప్రహ్లాద్ జోషి : పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు శాఖ, గనుల శాఖ 12. నారాయణ్ రాణే: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ 13. శర్భానంద సోనోవాల్: ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ, ఆయుష్ శాఖ 14. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ: మైనారిటీ వ్యవహారాలు 15. డాక్టర్ వీరేంద్ర కుమార్ సామాజిక న్యాయం, సాధికారత శాఖ 16. గిరిరాజ్ సింగ్: గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ 17. జ్యోతిరాదిత్య సింధియా: పౌర విమానయాన శాఖ 18. రామ్‌చంద్ర ప్రసాద్ సింగ్: ఉక్కు శాఖ 19. అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ; కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 20. పశుపతి కుమార్ పారస్: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ 21. గజేంద్ర సింగ్ షెఖావత్: జల్ శక్తి 22. కిరెన్ రిజిజు: న్యాయ శాఖ 23. రాజ్ కుమార్ సింగ్: విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ 24. హర్దీప్ సింగ్ పూరి: పెట్రోలియం, సహజ వాయువు, గృహ, పట్టణ వ్యవహారాలు 25. మన్సుఖ్ మాండవియా: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రసాయనాలు, ఎరువుల శాఖ 26. భూపేందర్ యాదవ్: పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ, కార్మిక , ఉపాధి శాఖ 27. మహేంద్ర నాథ్ పాండే: భారీ పరిశ్రమలు 28. పురుషోత్తం రూపాల: మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ 29. జి.కిషన్ రెడ్డి : సాంస్కృతిక శాఖ, పర్యాటకం,ఈశాన్య ప్రాంత అభివృద్ధి 30. అనురాగ్ సింగ్ ఠాకూర్: సమాచార, ప్రసార శాఖ, యువజన వ్యవహారాలు, క్రీడలు సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా) 1. రావు ఇందర్జిత్ సింగ్: గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (స్వతంత్ర హోదా) ; ప్రణాళిక మంత్రిత్వ శాఖ (స్వతంత్ర ఛార్జ్); కార్పొరేట్ వ్యవహారాలు సహాయ మంత్రి 2. డాక్టర్ జితేంద్ర సింగ్: ౖ సెన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఇండిపెండెంట్ ఛార్జ్) భూమి శాస్త్ర మంత్రిత్వ శాఖ (ఇండిపెండెంట్ ఛార్జ్); పీఎంవో, డీవోపీటీ, అణు ఇంధన శాఖ, అంతరిక్ష శాఖలో సహాయ మంత్రి సహాయ మంత్రులు 1. శ్రీపాద యశో నాయక్: ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గ మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ 2. ఫగన్‌సింగ్ కులస్:తే ఉక్కు మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 3. ప్రహ్లాద్æ సింగ్ పటేల్ : జల్ శక్తి, ఫుడ్ ప్రాసెసింగ్, 4. అశ్విని కుమార్ చౌబే: వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ 5. అర్జున్ మేఘవాల్: పార్లమెంటరీ వ్యవహారాలు, 6. వీకే సింగ్ : రహదారులు, పౌర విమానయానం 7. క్రిషన్ పాల్ : విద్యుత్, భారీ పరిశ్రమలు 8. దాన్వే రావ్‌సాహెబ్ : రైల్వే శాఖ, బొగ్గు శాఖ, గనుల శాఖ 9. రామ్‌దాస్ అథవాలే: సామాజిక న్యాయం,సాధికారత మంత్రిత్వ శాఖ 10. సాధ్వీ నిరంజన్ జ్యోతి : వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ, గ్రామీణాభివృద్ధి 11. సంజీవ్ బాల్యాన్: మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ 12. నిత్యానంద్ రాయ్: హోం శాఖ 13. పంకజ్ చౌదరి: ఆర్థిక శాఖ 14. అనుప్రియా సింగ్ పటేల్: వాణిజ్యం, పరిశ్రమలు 15. ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ భగెల్: న్యాయ శాఖ 16. రాజీవ్ చంద్రశేఖర్: నైపుణ్య అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 17. శోభా కరంద్లాజే: వ్యవసాయ, రైతు సంక్షేమం 18. భాను ప్రతాప్: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 19. దర్శన విక్రమ్ జర్దోష్: వస్త్ర మంత్రిత్వ శాఖ, రైల్వే 20. వి. మురళీధరన్: విదేశాంగ శాఖ 21. మీనాక్షి లేఖి : సాంస్కృతిక శాఖ 22. సోమ్ ప్రకాష్: వాణిజ్యం, పరిశ్రమలు 23. రేణుకా సింగ్ సారుత: గిరిజన వ్యవహారాలు 24. రామేశ్వర్ తేలి: పెట్రోలియం, సహజ వాయువు, 25. కైలాష్ చౌదరి వ్యవసాయ, రైతు సంక్షేమం 26. అన్నపూర్ణ దేవి : విద్యా శాఖ 27. ఎ.నారాయణస్వామి సామాజిక న్యాయం, సాధికారత 28. కౌషల్ కిషోర్: గృహ, పట్టణ వ్యవహారాలు 29. అజయ్ భట్ : రక్షణ, పర్యాటకం 30. బీఎల్ వర్మ : ఈశాన్య ప్రాంత అభివృద్ధి 31. అజయ్ కుమార్: హోం శాఖ 32. దేవుసింగ్ చౌహాన్ : కమ్యూనికేషన్స్ 33. భగవంత్ ఖూబా: పునరుత్పాదక ఇంధన శాఖ, 34. కపిల్ మోరేశ్వర్ పాటిల్: పంచాయతీ రాజ్ 35. ప్రతిమా భూమిక్: సామాజిక న్యాయం, సాధికారత 36. సుభాస్ సర్కార్: విద్యా శాఖ 37. భగవత్ కిషన్‌రావు కరా:ద్ ఆర్థిక శాఖ 38. రాజ్‌కుమార్ రంజన్ సింగ్: విదేశాంగ, విద్యా శాఖ 39. భారతి ప్రవీణ్ పవార్ : ఆరోగ్య, కుటుంబ సంక్షేమ 40. బిశ్వేశ్వర్ తూడూ: గిరిజన వ్యవహారాలు, జల్ శక్తి 41. శాంతను ఠాకూర్ : ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గం 42. మహేంద్రభాయి మహిళా, శిశు, ఆయుష్ శాఖలు 43. జాన్ బర్లా : మైనారిటీ వ్యవహారాలు 44. ఎల్. మురుగన్: మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, సమాచార, ప్రసార శాఖ 45. నిశిత్ ప్రామానిక్ : హోం, క్రీడలు -
ఇదేం న్యాయం: యడ్డీకిలేనిది మాకెందుకు?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సీనియర్ మంత్రుల రాజీనామాల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. బీజేపీ నింబంధనల ప్రకారం 75 ఏళ్లు పై బడినవారు బాధ్యతల నుంచి తప్పుకోవాలి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి, సీనియర్ నేత రాజేష్ అగర్వాల్(75), యూపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి స్వతంత్ర సింగ్‌లు తమ పదవులకు రాజీనామా సమర్పించారు. వీరితో పాటు మరో నలుగురు మంత్రులు కూడా వయసు కారణంగా తమ పదవుల నుంచి తప్పుకున్నారు. అయితే అగర్వాల్ రాజీనామాపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. పదవి నుంచి తప్పుకున్న మరుక్షణమే అగర్వాల్ అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వయసు నిబంధనలతో సీనియర్లను పార్టీ పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పార్టీలోని కొందరి కుట్ర కారణంగా అగర్వాల్ పదవి నుంచి తప్పుకున్నారని, రాజీనామా నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ఆయన అనుచరులు హెచ్చరించారు.కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు(76) వర్తించని నిబంధనలు తమకెందుకని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. రాజీనామా చేసిన వారిలో మైనింగ్ శాఖ మంత్రి అర్చనా పాండే, క్రీడాశాఖ మంత్రి చేతన్ చౌహన్, కోపరేటివ్ శాఖ మంత్రి ముకుత్ బిహారీ వర్మ ఉన్నారు. అయితే, వీరి రాజీనామాలకు వయసు నిబంధనే కారణమా లేదా మరేమయినా ఉందా అనేది తెలియరాలేదు. అవినీతి ఆరోపణలు, పనితీరు సరిగా లేకపోవడం వంటి కారణాలు కూడా ఉండచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా మంత్రుల రాజీనామా వ్యవహారం సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. రాజీనామాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు నిరసనలు వ్యక్తమవుతుండగా.. మరోవైపు మంత్రి వర్గ విస్తరణపై ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. ప్రభుత్వ ఏర్పడిన 29 నెలల తరవాత తొలిసారి మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది. 24 మంది కొత్త వారికి మంత్రి వర్గంలో చోటు కల్పించనుండటంతో ఆశావహుల సంఖ్య కూడా బాగానే పెరిగింది. ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీతో జట్టు కట్టిన పార్టీలకు కూడా ఈ మంత్రి వర్గవిస్తరణలో చోటు లభించనున్నట్లు తెలుస్తోంది. ఈ మంత్రి వర్గ విస్తరణ మాత్రం ముఖ్యమంత్రి యోగికి కత్తిమీద సామేనని నేతలు అభిప్రాయపడుతున్నారు. -
ఫిరాయింపుదారులకు మంత్రి పదవులా?
జగ్గయ్యపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన క్యాబినెట్ విస్తరణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టడం అప్రజాస్వామికమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీలో చేరిన ఫిరాయింపుదారులతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లాలన్నారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ టీఆర్ఎస్లో చేరి మంత్రి అయితే కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపించిన చంద్రబాబు నేడు అదే సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారన్నారు. అప్పట్లో గవర్నర్‌ను సైతం దూషించిన చంద్రబాబు ప్రస్తుతం అదే గవర్నర్‌తో టీడీపీలో చేరిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారని దుయ్యబట్టారు. అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు నిలువెత్తు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యంతరం చెప్పాల్సిన గవర్నర్ కూడా మంత్రివర్గ విస్తరణలో పాల్గొని వారితో ప్రమాణస్వీకారం చేయించటం హేయమన్నారు. ఇటీవల విడుదలైన కాగ్ నివేదిక కూడా చంద్రబాబు అవినీతిని తేటతెల్లం చేసిందని గుర్తు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కారు తీరుపై పార్టీ ఆధ్వర్యంలో పోరాడనున్నట్లు తెలిపారు.