లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సీనియర్ మంత్రుల రాజీనామాల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. బీజేపీ నింబంధనల ప్రకారం 75 ఏళ్లు పై బడినవారు బాధ్యతల నుంచి తప్పుకోవాలి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి, సీనియర్ నేత రాజేష్ అగర్వాల్(75), యూపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి స్వతంత్ర సింగ్‌లు తమ పదవులకు రాజీనామా సమర్పించారు. వీరితో పాటు మరో నలుగురు మంత్రులు కూడా వయసు కారణంగా తమ పదవుల నుంచి తప్పుకున్నారు. అయితే అగర్వాల్ రాజీనామాపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. పదవి నుంచి తప్పుకున్న మరుక్షణమే అగర్వాల్ అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వయసు నిబంధనలతో సీనియర్లను పార్టీ పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే పార్టీలోని కొందరి కుట్ర కారణంగా అగర్వాల్ పదవి నుంచి తప్పుకున్నారని, రాజీనామా నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ఆయన అనుచరులు హెచ్చరించారు.కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు(76) వర్తించని నిబంధనలు తమకెందుకని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. రాజీనామా చేసిన వారిలో మైనింగ్ శాఖ మంత్రి అర్చనా పాండే, క్రీడాశాఖ మంత్రి చేతన్ చౌహన్, కోపరేటివ్ శాఖ మంత్రి ముకుత్ బిహారీ వర్మ ఉన్నారు. అయితే, వీరి రాజీనామాలకు వయసు నిబంధనే కారణమా లేదా మరేమయినా ఉందా అనేది తెలియరాలేదు.
అవినీతి ఆరోపణలు, పనితీరు సరిగా లేకపోవడం వంటి కారణాలు కూడా ఉండచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా మంత్రుల రాజీనామా వ్యవహారం సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. రాజీనామాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు నిరసనలు వ్యక్తమవుతుండగా.. మరోవైపు మంత్రి వర్గ విస్తరణపై ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. ప్రభుత్వ ఏర్పడిన 29 నెలల తరవాత తొలిసారి మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది. 24 మంది కొత్త వారికి మంత్రి వర్గంలో చోటు కల్పించనుండటంతో ఆశావహుల సంఖ్య కూడా బాగానే పెరిగింది. ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీతో జట్టు కట్టిన పార్టీలకు కూడా ఈ మంత్రి వర్గవిస్తరణలో చోటు లభించనున్నట్లు తెలుస్తోంది. ఈ మంత్రి వర్గ విస్తరణ మాత్రం ముఖ్యమంత్రి యోగికి కత్తిమీద సామేనని నేతలు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment