న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇంట బుధవారం అర్ధరాత్రి ఈ సమావేశం జరగ్గా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ సీనియర్ నేతలు కొందరు హాజరయ్యారు.
ప్రధాని మోదీ ఇటీవలె అమెరికా, ఈజిప్ట్ పర్యటన ముగించుకుని వచ్చారు. అప్పటి నుంచి వరుసగా సమావేశాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. తాజాగా బీజేపీ కార్యకర్తలను సైతం ఉద్దేశించి ప్రసంగించారాయన. అదే సమయంలో జులై 17 నుంచి వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కీలక నేతలంతా అర్ధరాత్రి సమావేశమై చర్చించడం గమనార్హం.
బీజేపీ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశంలో.. అభ్యర్థుల జాబితా తయారు, బీజేపీ మేనిఫెస్టో రూపకల్పన గురించి ప్రధానంగా చర్చించినట్లు భోగట్టా. ఎన్నికల అంశంతో పాటు ప్రధానంగా వర్షాకాల సమావేశాల్లోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరపాలని కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అందునా తాజాగా ప్రధాని గళం వినిపించిన యూనిఫామ్ సివిల్‌కోడ్‌ను మేనిఫెస్టోలో కొనసాగించే అంశాన్ని సైతం లేవనెత్తినట్లు ఓ బీజేపీ కీలక నేత చెబుతున్నారు. ఈ భేటీ ఆధారంగా.. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం వీలైనంత త్వరలో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.ఔ
ఐదు రాష్ట్రాలపై మేదోమధనం
సార్వత్రిక ఎన్నికలతో పాటు రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ అగ్రనాయకత్వం మేదో మధనం చేసింది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలలో బిజీగా ఉండడంతో నిర్ణయాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి నుంచి పొద్దు పోయే వరకు ప్రధాని నివాసంలో భేటీలో కీలకంగా చర్చించారు. ప్రధానంగా తెలంగాణ సహా పలు ఎన్నికల రాష్ట్రాలలో పార్టీ నాయకత్వంలో సంస్థాగత మార్పులకు సంబంధించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గత నెల రోజుల నుంచి కొనసాగుతున్న కసరత్తు ఓ కొలిక్కిరాగా.. ఏ క్షణమైనా కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. పార్టీలో, క్యాబినెట్లో మార్పుల చేర్పులపై, విపక్ష కూటమి బలపడుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన కార్యాచరణ పై చర్చించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment