గాంధీనగర్/న్యూఢిల్లీ: ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే గుజరాత్ రాజకీయం వేడెక్కింది. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు అమల్లోకి తెచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. జీఎస్టీని ‘గబ్బర్ సింగ్ టాక్స్’గా ఆయన అభివర్ణించగా.. కాంగ్రెస్ నాటకాల పార్టీగా మారిందని కేంద్ర మంత్రి రవిశంకర్ విమర్శించారు. వరుస ఓటముల పాలవుతున్న కాంగ్రెస్‌కు ఏం చేయాలో తోచక ఇష్టమొచ్చిన విమర్శ చేస్తోందన్నారు.
కాగా, ఆదివారం బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన పటేల్ వర్గం నేత నరేంద్ర పటేల్ మాట మార్చారు. తనకు బీజేపీ డబ్బులు ఆశచూపించిందని విమర్శించారు. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. కాగా, పటేల్ ఆందోళనకు నేతృత్వం వహించిన హార్దిక్ పటేల్ గాంధీనగర్‌లోని ఒక హోటల్‌లో రాహుల్‌తో 20 నిమిషాలసేపు సమావేశమైనట్లు విడుదలైన సీసీటీవీ ఫుటేజీ ఆసక్తి రేపుతోంది. మరోవైపు, ఓబీసీ నేత అల్పేశ్ ఠాకూర్ రాహుల్ సమక్షంలో పార్టీలో చేరారు.
ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు
గాంధీనగర్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ బీజేపీ, మోదీలపై నిప్పులు చెరిగారు. జీఎస్టీని గబ్బర్ సింగ్ టాక్స్‌గా మార్చి దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతం చేశారని ఘాటుగా విమర్శించారు. ‘నవంబర్ 8న ఏం జరిగింది? టీవీ ముందుకొచ్చిన మోదీ.. రూ.500, రూ.1,000 నోట్లు నాకు నచ్చవు. అందుకే ఈ అర్ధరాత్రి నుంచి ఈ నోట్లను రద్దుచేస్తున్నానన్నారు. ఈ దెబ్బతో దేశం మొత్తంపై దాడిచేశారు. మళ్లీ కొన్ని రోజులకు టీవీ ముందుకొచ్చి నల్లధనాన్ని అదుపులోకి తీసుకురాలేకపోతే నన్ను ఉరితీయండన్నారు’ అని పేర్కొన్నారు. నోట్లరద్దుతోనే ఆగకుండా.. జీఎస్టీని తీసుకొచ్చారని విమర్శించారు.
‘జీఎస్టీ మా ఆలోచన. దేశమంతా అన్ని వస్తువులకు 18 శాతం పన్నుండాలని మేం భావించాం. కానీ దీన్ని కాస్త మార్చి బీజేపీ అమల్లోకి తీసుకురావటంతోనే ఈ సమస్యలు ఎదురవుతున్నాయి’ అని విమర్శించారు. ఇప్పుడు జీఎస్టీ 28 శాతం చేశారని అరుణ్‌జైట్లీని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. ‘మోదీజీ మేకిన్ ఇండియా అంటారు. గుజరాత్‌లోనే 30 లక్షలమంది నిరుద్యోగులున్నారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘తినను, తిననివ్వను అనే మోదీజీ .. అమిత్ షా కుమారుడు భారీగా తింటుంటే నోరెందుకు మెదపటం లేద’ని ప్రశ్నించారు. వెలకట్టలేని గుజరాత్ ఓట్లను కొనేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు.
కాంగ్రెస్ నాటకాల పార్టీ: రవిశంకర్
గుజరాత్ ఓబీసీ నేత అల్పేశ్ ఠాకూర్ మొదట్నుంచీ కాంగ్రెస్‌తోనే ఉన్నారని.. అతన్ని పార్టీలోకి చేర్చుకుంటున్నట్లుగా సభ పెట్టి ఆర్భాటం చేయటం కాంగ్రెస్ ఆడుతున్న నాటకమని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. వరుసగా 22 ఏళ్లు గుజరాత్‌లో అధికారం దక్కకపోవటంతో నాటకాలు ఆడటం ద్వారానైనా అధికారంలోకి రావాలని రాహుల్ ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ ‘నంబర్ 1 నాటకాల పార్టీ’. పెద్ద నాయకుడు పార్టీలో చేరినట్లు హంగామా చేస్తున్నారు. ఠాకూర్ ఎన్‌ఎస్‌యూఐ సభ్యుడు. ఆయన తండ్రి జిల్లా కాంగ్రెస్ నాయకుడుగా ఉన్నారు’ అని మంత్రి విమర్శించారు.
భారీగా కార్పొరేషన్లలో నియామకాలు
గుజరాత్‌లోని 17 ప్రభుత్వ ఆధ్వర్యంలోని బోర్డులు, కార్పొరేషన్ల చైర్మన్లను నియమిస్తూ ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బల్వంత్ సింగ్ రాజ్‌పుత్‌ను గుజరాత్ పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. వీటితోపాటుగా పౌర సరఫరాల కార్పొరేషన్, పోలీస్ గృహనిర్మాణ కార్పొరేషన్ తదితర కార్పొరేషన్లకూ చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment