నీట్ ఫస్ట్ ర్యాంకర్ హెట్ షా
వైద్య విద్య ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ఫలితాలను సీబీఎస్ఈ విడుదల చేసింది. వాస్తవానికి ఈ ఫలితాలను బుధవారం విడుదల చేస్తారనుకున్నా.. ఒకరోజు ముందుగానే సీబీఐఎస్‌ఈ విడుదల చేసింది. గుజరాత్‌కు చెందిన హెట్ షా (18) ఈ పరీక్షలలో మొత్తం 720 మార్కులకు గాను 685 మార్కులు సాధించి ఆలిండియా మొదటి ర్యాంకు పొందాడు. ఇతడు రాజస్థాన్‌లోని కోటలోని అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందాడు.
ఒడిషాకు చెందిన ఏకాంశ్ గోయల్, రాజస్థాన్‌కు చెందిన నిఖిల్ బజియాలకు రెండు, మూడో ర్యాంకులు వచ్చాయి. వీళ్లు కూడా అదే సంస్థలో కోచింగ్ తీసుకున్నారు. మే 1వ తేదీన నిర్వహించిన నీట్ పరీక్షకు మొత్తం 6 లక్షల మంది హాజరయ్యారు. అయితే తొలిదశ పరీక్షకు చాలామంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోకపోవడంతో జూలై 24న రెండోదశ పరీక్ష నిర్వహించగా, మరో 4 లక్షల మంది పరీక్ష రాశారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం విద్యార్థులు ఇంకా దానికి సిద్ధం కాలేదన్న కారణంతో సుప్రీంకోర్టు అనుమతితో విడివిడిగా ఎంసెట్‌లు నిర్వహించారు.