ప్రధాని మోదీ ఇలాకాలో బీజేపీకి షాక్
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ సొంతరాష్ట్రం గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీకి షాక్ తగిలింది. గత అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీకి ఈ సారి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. ప్రధాని మోదీ సొంత జిల్లా మెహ్సనాలో జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాగా పట్టణ ప్రాంతాల్లో బీజేపీ తన పట్టును నిలబెట్టుకోగా, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది.
గుజరాత్లో వరుస ఓటములతో ఢీలాపడ్డ కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ పుంజుకుంది. ఆ రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ 21 వాటిలో గెలిచినట్టు కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వి చెప్పారు. గత ఎన్నికల్లో బీజేపీ 30 జిల్లా పరిషత్ లను గెలవడం గమనార్హం. ఇక 4800 బ్లాక్, పంచాయతీ సమితిలలో 2200 వాటిలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్టు సింఘ్వి చెప్పారు. గుజరాత్ సీఎం ఆనందిబెన్ పటేల్ సొంత తాలుకాలో కాంగ్రెస్ విజయం సాధించినట్టు తెలిపారు.
కాగా ఆ రాష్ట్రంలోని మొత్తం ఆరు మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ దక్కించుకుంది. మున్సిపాల్టిల్లోనూ బీజేపీ హవా కొనసాగుతున్నా కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురైంది. రిజర్వేషన్లు కల్పించాలని గుజరాత్లో పటేళ్లు ఆందోళన బాటపట్టడం, అధికార బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉండటంతో.. గుజరాత్ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి ఓటమి ఎదురైందని విశ్లేషకులు భావిస్తున్నారు.