
గుజరాత్‌లో వేడెక్కిన రాజకీయం
అహ్మదాబాద్: గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పదిరోజుల తర్వాత సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. కర్ణాటకలోని ఒక ప్రైవేటు రిసార్ట్‌లో బస చేసిన వీరిని సోమవారం ఉదయం గుజరాత్‌కు తీసుకొచ్చారు. వీరిని ఆనంద్ జిల్లాలోని నిజానంద్ రిసార్ట్‌కు తరలించారు. రేపు జరగనున్న రాజ్యసభ ఎన్నిక నేపథ్యంలో 44 మంది ఎమ్మెల్యేల్ని గత నెల 29న బెంగళూరుకు తరలించిన సంగతి తెలిసిందే.
కాగా, తామంతా కలిసికట్టుగా ఉన్నామని.. తమను బీజేపీ భయపెట్టలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే శక్తి సిన్హ్ గోహిల్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల బేరసారాలకు అవకాశమే లేదని అన్నారు. ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని, తాను విజయం సాధించడం ఖాయమని కాంగ్రెస్ నుంచి రాజ్యసభ ఎన్నిక బరిలో ఉన్న అహ్మద్ పటేల్ వ్యాఖ్యానించారు.
కాగా, 44 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లి పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమవుతారని అంతకుముందు వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యేలు నేరుగా గుజరాత్ చేరుకోవడం ఊహాగానాలకు తెరపడింది. రేపు జరగనున్న రాజ్యసభ ఎన్నిక పోలింగ్‌లో తమ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడకుండా చూసేందుకు కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రాజ్యసభ ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో గుజరాత్‌లో రాజకీయం మరోసారి వేడెక్కింది.