సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ నుంచి రాజ్యసభకు ఉత్కంఠభరితంగా జరిగిన ఎన్నికల్లో సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ విజయం సాధించడం పట్ల కాంగ్రెస్ వర్గాలు పండుగ చేసుకుంటున్నాయి. 16 ఏళ్లపాటు తెరవెనక నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను నడిపించిన అహ్మద్ పటేల్ విజయం పార్టీ కార్యకలాపాల్లో ఓ మలుపు కాబోతున్నదని ఆయన అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు. వరుస పరాజయాలతో కునారిల్లిపోతున్న కాంగ్రెస్ పార్టీకి మళ్లీ జవసత్వాలు తెచ్చేందుకు పటేల్ విజయం ఎంతో దోహదపడుతుందని వారంటున్నారు. ఆయన మళ్లీ పార్టీపై మునుపటి పట్టును సాధించగలరని వారు ఆశిస్తున్నారు.
సోనియా గాంధీ కుమారుడిగా, రాజకీయ వారసుడిగా పార్టీ వ్యవహారాల్లో ప్రత్యక్ష పాత్ర వహిస్తున్న రాహుల్ గాంధీకి అహ్మద్ పటేల్ ఎప్పటికీ సమానుడు కాలేరు. రాహుల్ గాంధీ పార్టీలో క్రియాశీలక పాత్ర నిర్వహిస్తున్న నాటి నుంచి అహ్మద్ పటేల్ పార్టీ వ్యవహారాలకు కాస్త దూరం జరిగిన మాట కూడా వాస్తవమే. కాంగ్రెస్‌లో పార్టీ పునర్ వ్యవస్థీకరణ అంత సులభం కాదు. ఈ విషయంలో రాహుల్ గాంధీ తీసుకుంటున్న చొరవకు పలు చోట్ల పార్టీ పెద్దలు అడ్డు తగులుతూ వచ్చారు. అందుకని ఇంతవరకు సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలను పూర్తిగా రాహుల్ గాంధీకి అప్పగించలేక పోయారు.
అయినప్పటికీ రాహుల్ గాంధీ తన విధేయుడైన మాజీ రాజ్యసభ సభ్యుడు అవినాశ్ పాండేకు పార్టీలో పదోన్నతి కల్పించి ప్రధాన కార్యదర్శి హోదాలో రాజస్థాన్ పార్టీ వ్యవహారాలను అప్పగించడంలో విజయం సాధించారు. అలాగే పిఎల్ పునియా, ఆర్పీఎన్ సింగ్, ఆశా కుమారి, ఏ చల్లా కుమార్‌లకు రాష్ట్ర పార్టీల బాధ్యతలను అప్పగించడంలోనూ రాహుల్ గాంధీ తన పంథా నెగ్గించుకున్నారు. అలాగే పార్టీ సీనియర్ నేతలైన కమల్ నాథ్, గులామ్ నబీ ఆజాద్, అంబికా సోని లాంటి వారిని పార్టీ ప్రధాన కార్యదర్శులుగా మళ్లీ తీసుకున్నారు.
అలాగే అహ్మద్ పటేల్ విధేయులైన మాజీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండేలకు కూడా ప్రధాన కార్యదర్శులుగా తిరిగి తీసుకోవడమే కాకుండా ఎన్నికలు జరుగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ పార్టీ వ్యవహారాలను అప్పగించారు. దిగ్విజయ్ సింగ్ లాంటి సీనియర్ నేతల బాధ్యతలను కుదించారు. గోవాలో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైన నేపథ్యంలో దిగ్విజయ్‌ను గోవా, కర్ణాటక, తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన ప్రస్తుతం ఏపీ ఇంచార్జిగా మాత్రమే కొనసాగుతున్నారు.
పార్టీ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నికవడం పార్టీ విజయంగా కంటే వ్యక్తిగతంగా ఇది పటేల్‌కు విజయమని చెప్పవచ్చు. ఇక ఆయన తన విజయాన్ని పార్టీ విజయంగా మల్చాల్సిన అవసరం ఉంది. రానున్న గుజరాత్ ఎన్నికల్లో అహ్మద్ నిర్వహించే పాత్రపై ఇటు ఆయన వ్యక్తిగత ప్రతిష్ట, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
కాంగ్రెస్ రాత మారేనా?
Published Fri, Aug 11 2017 2:11 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement