రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరుగుతున్న సమయంలో గుజరాత్ ఎన్నికలు జరిగాయి. దీంతో వీటిపై కాంగ్రెస్ భారీగా ఆశలు పెట్టుకుంది. అయితే గుజరాత్‌ను వదిలేసి రాహుల్ ఇంకెక్కడో యాత్రలు చేశారు. కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఖర్గే.. ఢిల్లీని వదలలేదు. ఫలితంగా గుజరాత్‌లో దశదిశ లేక బొక్కాబొర్లా పడింది హస్తం పార్టీ.
హస్తానికి ఏమైంది?
2014 నుంచి ప్రతిపక్షంలో ఉంటోన్న కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. గుజరాత్‌లో ప్రభుత్వ వ్యతిరేకత రావొచ్చని ముందుగా అంచనాలు వచ్చినా.. కాంగ్రెస్‌లో ఆ జోషే కనిపించడం లేదు. స్టార్ క్యాంపెయినర్లు అడ్రస్ లేరు. రాహుల్ ఒకరోజు అలా కనిపించి ఇలా వెళ్లిపోయారు. కొత్త అధ్యక్షుడు ఖర్గే నాకేం సంబంధం అన్నట్టుగా వ్యవహరించారు.
అహ్మద్ పటేల్ లేకుంటే అనాథే..
గత అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్‌లో బీజేపీని దాదాపు ఓడించినంత పని చేసింది కాంగ్రెస్. 41.44 ఓట్ షేర్‌తో 77 సీట్లు గెలుచుకుంది. 1998 తర్వాత తొలిసారి బీజేపీని డబుల్ డిజిట్‌కు పరిమితం చేసింది. కానీ, ఇప్పుడు నీరుగారి పోయింది. సీనియర్ నేత అహ్మద్ పటేల్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే అహ్మద్ పటేల్ లేని గుజరాత్ కాంగ్రెస్ అనాథలా మారింది. ఎలక్షనీరింగ్ లేదు.. ప్రచార వ్యూహాల్లేవు.. నేతల హంగామా అసలే లేదు.. అంతా మిస్సింగ్.
అంతా చేయిచ్చారు!
2017 నుంచి దాదాపు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. పాటిదార్ నేత హార్దిక్ పటేల్ కూడా ఎన్నికల ముందు బీజేపీలో చేరిపోయారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, హైకమాండ్ నిర్ణయరాహిత్యం కలిసి ఒక రకమైన నైరాశ్యంలో కూరుకుపోయింది గుజరాత్ కాంగ్రెస్. 27 ఏళ్లుగా పాలిస్తున్న బీజేపీపై పాటిదార్లు సహా అనేక వర్గాల్లో అసంతృప్తి ఉందని ప్రచారం జరిగినా.. దానిని ఓట్లుగా మార్చుకునే వ్యూహాలు మాత్రం కాంగ్రెస్ క్యాంప్‌లో కనిపించలేదు.
రాజస్థాన్ మోడల్ అట్టర్ ఫ్లాప్
అహ్మద్ పటేల్ లేకపోవడంతో.. గుజరాత్ కాంగ్రెస్ ఎలక్షన్ బాధ్యతను రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు అప్పగించింది అధిష్టానం. కేజ్రీవాల్ ఢిల్లీ మోడల్ అంటుంటే.. రాజస్థాన్ మోడల్ అన్నారు గెహ్లాట్. అధికారంలోకి వస్తే రాజస్థాన్ ప్రజలకు అందుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను గుజరాత్‌లోనూ అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. అయినా కాంగ్రెస్ పరువు కాపాడుకోలేకపోయింది. ఈ లెక్కన రాజస్థాన్ మోడల్ హస్తానికి ఏ రకంగాను చెప్పుకోదగ్గ క్రెడిట్‌లోకి రాలేదు.
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment