భారత్‌లో ‘జికా వైరస్’ ఎప్పుడో ఉందట!
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇటీవల ముగ్గురు రోగులకు సోకిన ‘జికా’ వైరస్ బ్రెజిల్, మెక్సికో లాంటి వైరస్ బాధిత దేశాల నుంచి సంక్రమించిందా ? లేదా దేశంలోనే ఎప్పుడో పుట్టి ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వచ్చిందా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరికినట్లే. జికా వైరస్ సోకిన ముగ్గురు రోగులు గతంలో విదేశాల్లో ఎన్నడూ పర్యటించిన వాళ్లు కాదని తేలడంతో విదేశాల నుంచి ఆ వైరస్ వచ్చిందనడానికి వీల్లేదని ‘నేషనల్ సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్’ డైరెక్టర్ డాక్టర్ ఏసీ ధనివాల్ స్పష్టం చేశారు. భారత్‌లో ఎప్పుడో జికా వైరస్ ఉందని 1954 నాటి వైద్య పర్యవేక్షణా నివేదికను విశ్లేషిస్తే అర్థం అవుతుంది.
న్యూయార్క్‌లోని రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్‌కు చెందిన కేసీ స్మిత్‌బర్న్, పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలోజీ నాటి డైరెక్టర్ జేఏ కెర్, బాంబే మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసిన పీబీ గాట్నే ఈ నివేదికను రూపొందించారు. ప్రస్తుతం గుజరాత్‌లోని బారుచ్, నాగపూర్ నుంచి సేకరించిన శాంపిల్స్‌లో జికా వైరస్ ఉందని తేలింది. అది అంతగా విస్తరించకపోవడంతో దాన్ని ఎదుర్కొనే శక్తి భారతీయ ప్రజల్లో పెరిగిందని వైద్యులు భావించారు. భారత్, పాకిస్తాన్, ఇండోనేసియా, ఆసియా దేశాల్లో జికా వైరస్ ఒకప్పుడు ఉండేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావించినప్పటికీ 2016లో విడుదల చేసిన జికా వైరస్ విజంభించిన దేశాల జాబితాలో భారత్‌ను చేర్చక పోవడం విశేషం.
జికా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి భారతీయుల్లో పెరిగి ఉండే వాటి యాంటీ బాడీస్ కనిపించాలి. వాటి ఆనవాళ్లు లేవు. భారత్‌లో ఎప్పుడో అంతరించి పోయిన ఈ వైరస్ తిరిగి దేశంలో బయల పడడం కాస్త ఆందోళనకరమే. అయితే మొన్న గుజరాత్‌లో బయట పడి జికా వైరస్ జాతి ఎక్కువగా బ్రెజిల్‌లో, సింగపూర్‌లో కనిపించే జాతని, ఇది పెద్ద ప్రమాదరకమైనది కాదని డాక్టర్ ధనివాల్ చెబుతున్నారు.