నితిన్కు నిరాశ
గాంధీనగర్: ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందని ఆశించిన నితిన్ భాయ్ పటేల్కు కొంత నిరాశ కలిగింది. ఆయన డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి ప్రస్తుతం గుజరాత్ నాయకుల్లో.. మంత్రుల్లో నితిన్ భాయ్ పటేల్ మాత్రమే సీనియర్. మొత్తం నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన మొన్న ఆనందీ బెన్ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ నిర్వహించారు. కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. ఈయనకు ఉన్న బలహీనత ఒక్కటే అది కూడా ఈయనకు పటేల్ సామాజిక వర్గం కొంత దూరంగా ఉంటుంది.
ఉద్యోగాల విషయంలో రిజర్వేషన్లను ఇప్పించాలనే డిమాండ్ తోనే పటేళ్ల ఉద్యమం వచ్చిన విషయం తెలిసిందే. సీఎం పీఠం మార్పునకు కూడా ఈ ఉద్యమం, దళితుల ఉద్యమం ఓ కారణమైంది. ఇలాంటి సమయంలో తిరిగి పటేళ్లకు పడని వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తే వివాదంగా మారుతుందేమోనని భావించిన బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా ఈ పదవిని విజయ్ రూపానికి అప్పగించినట్లు తెలుస్తోంది.
కొత్త సీఎం అభ్యర్థిని ప్రకటించడానికి ముందు నితిన్ భాయ్ నే సీఎం అభ్యర్థి అని ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో ఆయన కూడా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పటేళ్ల ఆందోళన సమస్యను అదిగమిస్తామన్నారు. 'పటేళ్ల వర్గం నాయకులతో మాట్లాడతాం. హర్థిక్ పటేల్, లాల్జీ, ఇతర నేతలందరితో సమస్యపై చర్చిస్తాం. దళితుల ఆందోళనను గుజరాత్ ప్రభుత్వం నియంత్రించలేక పోయిందనడం సరికాదు. ఆనందీ బెన్ పటేల్ ఆమె పనిచేసిన 26 నెలలు ఎంతో కష్టపడి పనిచేశారు' అని చెప్పారు. కానీ అనూహ్యంగా సీఎం అభ్యర్థి మారిపోయారు. నితిన్ భాయ్ డిప్యూటీ సీఎం అయ్యారు.