గురుగ్రామ్: శరీర భంగిమలను సరిచేయడానికి దోహదపడే ఓ పరికరాన్ని గురుగ్రామ్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థులు కనుగొన్నారు. ఇది కృతిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా పనిచేస్తుందని తెలిపారు. ఈ పరికరం వినియోగదారుడికి సౌకర్యవంతంగా ఉండటంతో పాటు సులువుగా ఉపయోగించడం, తక్కువ ఖర్చుతో కూడుకున్నదని వెల్లడించారు. ‘టెక్ట్స్ నెక్’తో బాధపడుతున్న వారు ఈ పరికరాన్ని ఉపయోగించి శరీర భంగిమలను సరిచేయొచ్చు. అదే పనిగా మెడను వంచి మొబైల్ ఫోన్‌లో వీడియోలు చూడటం, చాటింగ్ చేయడం ద్వారా మెడపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుండటాన్ని ‘టెక్ట్స్ నెక్’అంటారు. ఈ పోస్చ ర్ పర్ఫెక్ట్ డివైస్‌ను గురుగ్రామ్‌లోని శివ్ నాడర్ పాఠశాల విద్యార్థులు తనిష్కా షహయ్, నవ్య సచ్‌దేవ్, ఆర్యన్ వర్మ, తేజస్వ్ రాస్తోంగిలు కనుగొన్నారు.
ఈ పరికరం ఒక మౌంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు శరీర భంగిమలను వీడియో రూపంలో సంగ్రహిస్తుంది. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ ద్వారా ప్రాసెస్ చేయబడుతుంది. కూర్చున్నప్పుడు లేదా నిలబడ్డప్పుడు ముక్కు, మెడ, కుడి, ఎడమ భుజాల మధ్య దూరాన్ని, కోణాలని ఇది గుర్తిస్తుంది. ఇలా గుర్తించిన డేటాను ప్రతి 30 నిమిషాలకోసారి సగటున లెక్కించి వినియోగదారుడికి పంపుతుంది. దీంతో అతడు తన శరీరాన్ని సరిగా ఉంచుకునేలా తోడ్పడుతుందని వారు తెలిపారు. దీన్ని పాఠశాల విద్యార్థులు, గృహిణులు కూడా ఉపయోగించుకోవచ్చని వర్మ వెల్లడించారు. ఈ పరికరం విలువ దాదాపు రూ.3500 ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment