ముంబై : కరోనా కారణంగా గత మూడు నెలల నుంచి మూసి ఉన్న సెలూన్లలకు అనుమతిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్షౌరశాలలు తెరిచేందుకు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గురువారం జరిగిన సమీక్షలో కేబినెట్ దీనికి ఆమోదముద్ర వేసిందని మంత్రి విజయ్ తివార్ తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా సెలూన్ ఆపరేటర్లు ఆర్థికంగా చితికిపోయారని, ఇప్పటికే 12 మంది బార్బర్లు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో పరిస్థితి ఇంకా దిగజారకముందే వాళ్లకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం తాజా చర్యలు చేపట్టిందని విజయ్ పేర్కొన్నారు. (రెండు వారాల పాటు సంపూర్ణ లాక్‌డౌన్)
గత వారం రోజుల నుంచి దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే జిమ్ సెంటర్లకు కూడా అనుమతిస్తామని దీనికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందిస్తామని తెలిపారు. అయితే తమ వ్యాపారాలను పునరుద్దరించడానికి అనుమతించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర నభీక్ మహామండల్, రాష్ట్రస్థాయి బార్బర్ సంఘాలు గత కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వెంటనే దుకాణాలు తెరిచేందుకు అనుమతించాలని, లేని పక్షంలో ఆర్థిక ప్యాకేజీ అయినా ప్రకటించాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సెలూనల్లోమాస్క్, శానిటైజర్ల వాడకం లాంటి వ్యక్తిగత శుభ్రతా ప్రమాణాలు పాటించాలని మంత్రి విజయ్ ఆదేశించారు. ఒక కస్టమర్ కోసం ఉపయోగించిన తువాలు లేదా వస్త్రాన్ని ఇతరులకు ఉపయోగించరాదన్నారు. భారత్‌లో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 142,900కి చేరగా 6,739 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. (భూటాన్-అస్సాం నీటి వివాదం అవాస్తం: భారత్)
Comments
Please login to add a commentAdd a comment