మహిళలపై వేధింపులు, అత్యాచారాలు, హత్యలు.. తరచూ ఇవే వార్తలే. ఆడపిల్ల కనిపిస్తే రెచ్చిపోయే కామాంధులకు షాకిచ్చేలా అసెంబ్లీ స్థాయీసమితి నివేదిక రూపొందించింది. కామాంధుల ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు పంపిణీ చేయడం, ఇతరత్రా కఠిన చర్యలే ఉపయుక్తమని పేర్కొంది.
సాక్షి, బనశంకరి: మహిళలు, అమ్మాయిలపై లైంగిక దాడులకు పాల్పడే నేరగాళ్లకు ప్రభుత్వ సౌలభ్యాలను తొలగించి ఓటుహక్కును రద్దుచేయాలి. ఆస్తిని స్వాధీనం చేసుకుని బాధితులకు పరిహారం అందించాలి, ఈ మేరకు చట్టం రూపొందించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని శాసనసభ అత్యాచారాల నియంత్రణ అధ్యయన స్థాయీ సమితి నిర్ణయించింది. కొంతకాలంగా రాష్ట్రంలో అత్యాచారాలు, లైంగిక వేధింపుల ఘటనలు మితిమీరడంతో బెంగళూరు ప్రతిష్ట మసకబారింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2014లో మహిళలు, బాలికలపై దౌర్జన్యాలు, అత్యాచారాలను నియంత్రించడమెలా అనే అంశంపై అధ్యయనానికి నిపుణుల కమిటీని నియమించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉగ్రప్పను దీనికి అధ్యక్షునికిగా నియమించారు. బుధవారం నివేదిక సిద్ధం చేసింది.
100 సిఫార్సులు
ఉగ్రప్ప మాట్లాడుతూ 1500 పేజీలతో కూడిన సమగ్ర నివేదికను పూర్తి చేశామన్నారు. ప్రభుత్వానికి కనీసం 100 సిఫార్సులు చేశామని, నివేదికను త్వరలోనే ముఖ్యమంత్రికి అందజేస్తామని చెప్పారు. గతంలో ఈ సమితికి నాణయ్య అధ్యక్షునిగా ఉండగా 39 సమావేశాలు, తాను అధ్యక్షుడైన తరువాత 134 సమావేశాలు నిర్వహించి సమగ్ర నివేదికను రూపొందించామని తెలిపారు. దేవదాసీలు, ఎయిడ్స్ బాధితులు, హిజ్రాల సంరక్షణ చర్యలనూ నివేదికలో చేర్చామని ఉగ్రప్ప చెప్పారు.
స్థాయీ సమితి చేసిన ముఖ్య సిఫార్సులు కొన్ని..
- లైంగిక నేరగాళ్ల ఆస్తిని స్వాధీనం చేసుకుని బాధితులకు పరిహారం అందించాలి. దోషులకు ప్రభుత్వ సౌలభ్యాలు, ఓటుహక్కు ను రద్దుచేయాలి.
- కేసు నమోదైన 24 గంటల్లోగా బాధితులకు వైద్య పరిహారం అందించడం.
- కేసుల తీవ్రతను బట్టి పరిహారాన్ని నిర్ధారించాలి.
- కేసుల విచారణ పూర్తికి స్పష్టమైన గడువును నిర్ధారించాలి. కేసుల్లో జాప్యాన్ని తప్పించడానికి జాతీయచట్టాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి.
- శిక్షల తీవ్రతను పెంచితే అకృత్యాలు తగ్గుతాయి. ఈ విషయంలో ఎస్పీ, స్పెషల్ ప్రాసిక్యూటర్లకు బాధ్యతలు అప్పగించాలి.
- పరిహారం వస్తుంది కదా అని అబద్ధపు కేసులు పెట్టేవారి నుంచి వడ్డీ సమేతంగా పరిహారం వెనక్కి తీసుకునేలా చట్టం ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment