సాక్షి, అహ్మదాబాద్: సెక్స్ సీడీలు బహిర్గతం కావడం వెనుక భారతీయ జనతా పార్టీ హస్తం ఉందని పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి అధినేత హార్థిక్ పటేల్ ఆరోపించారు. తన వ్యక్తిగత జీవితాన్ని బీజేపీ పబ్లిక్ చేయడంపై ఆయన మండిపడ్డారు. వ్యక్తిగత గోప్యతా ఉల్లంఘన కింద ఆ పార్టీపై న్యాయ పోరాటాన్ని చేస్తున్నట్లు హార్ధిక్ బుధవారం ప్రకటించారు.
గుజరాత్ రాజకీయాలు అత్యంత దారుణంగా ఉన్నాయని, ఇంకా చెప్పాలంటే నీచస్థాయికి దిగజారాయని హార్ధిక్ పటేల్ వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు అత్యంత అథమస్థాయిలో ఉన్నాయి. నన్ను ఎంత దిగజార్చాలని ప్రయత్నాలు చేసినా.. వాటిని ఎవరూ నమ్మొద్దు’ అని హార్ధిక్ ట్వీట్ చేశారు.
భారతీయ జనతా పార్టీ నీచ రాజకీయాలకు పరాకాష్టగా మారిందని చెప్పిన హార్ధిక్.. ఆ పార్టీపై న్యాయపోరాటం చేస్తానని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రముఖ న్యాయవాదులను సంప్రదించానని.. కేసు నమోదు చేసే ప్రక్రియలో ఉన్నట్లు ఆయన తెలిపారు. పటేల్ రిజర్వేషన్ ఉద్యమంపై సెక్స్ సీడీల ప్రభావం ఏ మాత్రం ఉండదని ఆయన చెప్పారు.
కాగా హార్ధిక్ పటేల్..రాసలీలల వీడియో టేప్ రెండు రోజలు నుంచి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి సీడీలో హార్థిక్, ఒక మహిళ దగ్గరగా ఉండటం, ఆల్కహాల్ తీసుకోవడం వంటివి ఉండగా.. రెండో సీడీలో ఇద్దరు ముగ్గురు యువకులు, ఒక స్త్రీ సన్నిహితంగా ఉన్న వీడియో వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment