తప్పు మార్కర్ పెన్నుదా? పార్టీ సభ్యులదా?
న్యూఢిల్లీ: భారత పార్లమెంట్లో ప్రజాస్వామ్యం ఓ బూటకమని, రాజకీయ పార్టీలు ఆడే నాటకమని తెల్సిందే. ఈ బూటకపు నాటకంలో పార్టీ అధిష్టానం చేతుల్లో పార్లమెంట్ సభ్యులు జవసత్వాలు లేని పాత్రలుగా వ్యవహరించడం మనం ఇంతకాలం చూశాం. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికే షాకిచ్చిన పార్టీలోని ఓ వర్గం ఆడిన సరికొత్త నాటకం ఇప్పుడు తెరపైకి వచ్చింది.
హర్యానాలోని రెండు సీట్లతో సహా దేశవ్యాప్తంగా 27 రాజ్యసభ సీట్లకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఈ రెండు సీట్లను బీజేపీ కైవసం చేసుకున్నాయి. అసెంబ్లీలో ఆ పార్టీకున్న బలం ప్రకారం ఒక్క సీటు మాత్రమే బీజేపీకి దక్కాలి. మరోసీటు కాంగ్రెస్-ఇండియన్ నేషనల్ లోక్దళ్ కూటమికి వెళ్లాలి. బీజేపీ అధికార అభ్యర్థిగా కేంద్ర మంత్రి వీరేందర్ సింగ్తోపాటు బీజేపీ మద్దతిచ్చిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఈస్ట్ గ్రూప్, జీ మీడియా చైర్మన్ సుబాస్ చంద్ర అనూహ్యంగా విజయం సాధించారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన 13 ఓట్లు చెల్లకుండా పోవడమే కాంగ్రెస్ కూటమి బలపర్చిన స్వతంత్య్ర అభ్యర్థి ఆర్కే ఆనంద్ ఓటమికి కారణమని రిటర్నింగ్ అధికారితోపాటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాదిస్తోంది. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే తన బ్యాలెట్ పత్రాన్ని తోటి సభ్యుడికి బహిరంగంగా చూపించినందుకు ఒక ఓటు, ఎన్నికల నిబంధనల ప్రకారం రిటర్నింగ్ అధికారి సూచించిన వయలెట్ మార్కర్ పెన్నును ఉపయోగించక పోవడం వల్ల 12 ఓట్లు చెల్లకుండా పోయాయి. మరో ఓటరు ఎవరికి ఓటు వేయకుండా ఖాళీగా వదిలేశారు. దీంతో కాంగ్రెస్ కూటమి బలపర్చిన ఆనంద్కు దక్కాల్సిన 14 ఓట్లు రాకుండా పోయాయి.
దీనికి రిటర్నింగ్ అధికారి బీజేపీ పార్టీతో అక్రమాలకు కుమ్మక్కు అవడం వల్లనే ఇలా జరిగిందని, సూచించిన మార్కర్ పెన్నుకు బదులుగా ఓటేసేటప్పుడు మరో పెన్నును ఎలా పెడతారని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాదిస్తోంది. ఈ విషయమై ఎన్నికల కమిషన్కు కూడా ఫిర్యాదు చేసింది. వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా వర్గానికి చెందిన 14 మంది శాసనసభ్యుల ఓట్లే చెల్లకుండా పోయాయని, వారే ఇందులో కుట్రపన్ని తప్పుడు పెన్నుతో ఓటేశారని ఓడిపోయిన స్వతంత్య్ర అభ్యర్థి ఆనంద్ ఆరోపిస్తున్నారు.
ఆయన వాదనలో వాస్తవం లేకపోలేదు. బీజేపీతో అంటకాగే ఇండియన్ నేషనల్ లోక్దళ్తో పొత్తు పెట్టుకోవడం భూపేందర్ సింగ్ హూడాకు ఏమాత్రం ఇష్టం లేదు. పార్టీ అధిష్టానంకు ఆయన ఓ షాక్ ఇవ్వాలనుకున్నారు. ఇచ్చారు. పార్టీ అంతర్గత కుమ్ములాటల గురించి, అవిధేయత గురించి బహిరంగంగా మాట్లాడడం ఇష్టంలేని కాంగ్రెస్ అధిష్టానం నెపాన్ని రిటర్నింగ్ అధికారిపైకి నెట్టేస్తోంది. ఇందులో పూర్తిగా రిటర్నింగ్ అధికారి తప్పిదమేననుకుంటే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సరైన మార్కర్తోనే ఓట్లు ఎలావేశారన్న ప్రశ్న వస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో రిటర్నింగ్ అధికారి హస్తం ఉన్నా, లేకున్నా హూడా వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కుమ్మక్కు కాకపోతే ఇలా జరగదనే విషయం సుస్పష్టం.
ఎమ్మెల్యేలు డబ్బులకు అమ్ముడుపోయి పార్టీ అధిష్టానం ఆదేశాలకు విరుద్ధంగా క్రాస్ ఓటింగ్కు పాల్పడరాదనే ఉద్దేశంతో రాజ్యసభ ఎన్నికల్లో 2003 నుంచి ఏజెంట్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ పద్ధతి ప్రకారం పార్టీ నియమించిన ఏజెంట్కు చూపించి పార్టీ సభ్యులు ఓటు వేయాల్సి ఉంటుంది. హర్యానా నుంచి జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెంట్గా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బీకే హరిప్రసాద్ వ్యవహరించారు. ఓట్లు చెల్లకుండా పోయిన 13 మంది శాసన సభ్యులు సహా పార్టీ సభ్యులంతా తనకు చూపించే ఓటు వేశారని హరిప్రసాద్ ఓటింగ్ అనంతరం మీడియా సమక్షంలో ప్రకటించారు. అందరు కూడా ఆనంద్కే ఓటేశారని చెప్పారు.
ఎవరికి ఓటు వేశారన్న విషయాన్ని గ్రహించిన ఆయన ఏ పెన్నుతో ఓటు వేశారన్న విషయాన్ని గమనించలేకపోయారు. ఎన్ని కొత్త పద్ధతులు తీసుకొచ్చిన క్రాస్ ఓటింగ్ జరుగుతోందన్నది నిర్వివాదాంశం. ఏదేమైతేనేం! మరో పారిశ్రామికవేత్త, ధనవంతుడు రాజ్యసభకు ఎన్నికయ్యారు.