
మాదక ద్రవ్యాలు కూడా ‘ఉగ్ర’ భూతాలు
యువతకు ప్రధాన మంత్రి మోదీ పిలుపు
ఇదొక జాతీయ సమస్య.. ప్రభుత్వం, సమాజం కలసి నిరోధించాలి
డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక కార్యక్రమాలు.. టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు
న్యూఢిల్లీ: మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతకు పిలుపునిచ్చారు. వాటి కోసం వెచ్చించే సొమ్ము ఉగ్రవాదులకు చేరుతుందన్న విషయాన్ని గుర్తించాలని.. అది దేశ భద్రతకు ప్రమాదకరమని అన్నారు. వాటి వినియోగం జాతీయ సమస్య అని, ఈ బెడదను అరికట్టేందుకు ప్రభుత్వం, సమాజం కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టేందుకు తోడ్పడేలా టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వినూత్నంగా రేడియో ద్వారా ఆకాశవాణి ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని చేపట్టిన మోదీ.. ఆదివారం మూడో సారి ఆ కార్యక్రమంలో ప్రసంగించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా వాటిని పూర్తిస్థాయిలో నియంత్రించాల్సి ఉందన్నారు.
‘‘ఈ దురలవాటు చీకటి, విధ్వంసం, వినాశనమనే మూడింటితో కలసి వస్తుంది. ఇది విధ్వంసానికి, వినాశనానికి కారణమయ్యే చీకటి స్నేహాలకు దారితీస్తుంది. ఈ బెడదను అరికట్టి దేశాన్ని రక్షించే ప్రక్రియను చేపట్టాల్సి ఉంది..’’ అని మోదీ వ్యాఖ్యానించారు. దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు, ఈ దురలవాటుకు దూరంగా ఉండేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపడతామని ప్రధాని తెలిపారు. మాదక ద్రవ్యాల బెడదను అరికట్టడానికి ప్రభుత్వం, సమాజం, చట్టం, కుటుంబం, స్నేహితులు అంతా కలసి పనిచేయాల న్నారు.
ఇందుకోసం ఒక టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. వాటికి వెచ్చించే సొమ్ము ఉగ్రవాదులకు చేరుతుందన్న విషయాన్ని గుర్తించాలని యువతకు సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలతో గడపడానికి కొంత సమయం కేటాయించాలన్నారు. అలా చేసినప్పుడు పిల్లలు చెడు మార్గం పట్టకుండా ఉంటారని వ్యాఖ్యానించారు.