చికిత్సకు జయలలిత స్పందిస్తున్నారు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వైద్యులు ఆదివారం రాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. లండన్ కు చెందిన డాక్టర్ రిచర్డ్ బాలే నేతృత్వంలో ఆమెకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. బాలే ట్రీట్ మెంట్ తో ఆవిడ కోలుకున్నారని వెల్లడించారు. ఆయన సలహాతో ట్రీట్ మెంట్ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. జయలలిత వైద్య పరీక్షల నివేదికలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి, అపోలో సీనియర్ వైద్యులతో చర్చించి చికిత్స అందిస్తున్నారని వివరించారు.
మెరుగైన వైద్యం కోసం యాంటీ బయోటిక్స్ అందిస్తున్నామని చెప్పారు. ఇన్ఫెక్షన్ నివారణకు మెరుగైన పద్ధతుల్లో చికిత్స చేస్తున్నట్టు తెలిపారు. చికిత్సకు జయలలిత స్పందిస్తున్నారని, మరికొన్ని రోజులు ఆమెను ఆస్పత్రిలోనే ఉంచాల్సివుంటుందని తెలిపారు. ఆరోగ్యం కుదుటపడే వరకు జయలలితను ఆస్పత్రిలోనే ఉంచుతామని స్పష్టం చేశారు. జయలలిత ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ‘అమ్మ’ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.