జైపూర్: రాజస్ధాన్‌లో రాజకీయ హైడ్రామా ఉత్కంఠభరితంగా సాగుతోంది. తనతో పాటు 18 మంది రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ జారీచేసిన అనర్హత నోటీసులను సవాల్ చేస్తూ సచిన్ పైలట్ రాజస్ధాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే తదుపరి విచారణను శుక్రవారానికి కోర్టు వాయిదా వేసింది. అనర్హత నోటీసులపై సచిన్ పైలట్ తరపు న్యాయవాది హరీష్ సాల్వే తన వాదనలు వినిపించారు. కాగా, సచిన్ పైలట్‌ను తిరిగి కాంగ్రెస్ గూటికి చేర్చేందుకు ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారు. రాజస్ధాన్ ముఖ్యమంత్రిపై పైలట్ తిరుగుబాటుతో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ సహా పార్టీ సీనియర్ నేతలు పైలట్‌ను బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ప్రియాంక ఎంట్రీ ఇచ్చారు. చిట్టచివరి ప్రయత్నంగా పార్టీ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్‌లతో మంతనాలు ప్రారంభించారు.
పైలట్‌తో తక్షణమే మాట్లాడి ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలను తిరిగి పార్టీ గూటికి చేర్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు సచిన్ పైలట్‌కు పార్టీ ద్వారాలు ఎప్పుడూ తెరిచేఉంటాయని, ఆయన వాదనలు వినేందుకు పార్టీ సిద్ధంగా ఉందని రాహుల్ ఇప్పటికే సందేశం పంపారు. ఇక బీజేపీలో చేరబోనని పైలట్ చేసిన ప్రకటన ఒక్కటే కాంగ్రెస్ శిబిరంలో ఆశలు రేకెత్తిస్తోంది. పైలట్ లేవనెత్తిన డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తామనే సంకేతాలు పంపుతోంది. పార్టీలో కాకరేపిన రాజస్ధాన్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రియాంక రాయబారం ఎంతమేరకు ఫలిస్తుందనే ఆసక్తి నెలకొంది. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న బీజేపీ సమయానుకూలంగా పావులు కదిపేందుకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ వేదికగా గహ్లోత్ సర్కార్ బలపరీక్షకు సంసిద్ధం కావాలని కాషాయ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment