
'మన హృదయ స్పందన ఒకేలా ఉంటుంది'
భారత్, ఆఫ్రికా దేశాల సమావేశంతో ప్రపంచంలో మూడోవంతు జనాభా ఒకచోటుకు చేరుకున్నట్లయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇండియా-ఆఫ్రికా ఫోరం సదస్సులో మాట్లాడుతూ ఆయిలా చెప్పారు. 125 కోట్ల భారతీయులు, 125 కోట్ల ఆఫ్రికన్ల హృదయ స్పందన తీరు ఒకేలా ఉంటుందని ఆయన తెలిపారు. ఇది కేవలం ఇండియా, ఆఫ్రికాల మధ్య సమావేశం మాత్రమే కాదని, ప్రపంచంలో మూడోవంతు ప్రజల ఆశలు, ఆకాంక్షలు అన్నీ ఇక్కడ కనపడుతున్నాయని అన్నారు.
ప్రపంచంలో మనది ఒకే గొంతుగా మాట్లాడామని, మన భాగస్వామ్యం బలోపేతం అయ్యిందని నరేంద్ర మోదీ చెప్పారు. భారత్, ఆఫ్రికా దేశాల మధ్య సంబంధాలు కేవలం వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలే కాక అంతకంటే ఎక్కువగానే ఉన్నాయన్నారు. ఆఫ్రికాలో మౌలిక సదుపాయాల కోసం తాము సాయం చేస్తామని, అక్కడ రోడ్లు, విద్యుత్ సదుపాయాలను అభివృద్ధి చేస్తామని, మీ వనరులకు విలువను జోడిస్తామని ఆఫ్రికా ప్రతినిధులకు హామీ ఇచ్చారు.