మోదీ పర్యటనకు వరుణుడు అడ్డు
వారణాసి: ప్రధాని నరేంద్రమోదీ వారణాసి పర్యటన భారీ వర్షం కారణంగా రెండవసారి కూడా రద్దయింది. ఉత్తర ప్రదేశ్లోని టెంపుల్ టౌన్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. దీంతో రెండవసారి కూడా ప్రధాని పర్యటన రద్దు చేయక తప్పనిస్థితి. గురువారం తన నియోజకవర్గంలో ఒక రోజు పర్యటన కోసం ప్రధాని బయలుదేరాల్సి ఉంది. అనంతరం వారణాసిలో భారీ ర్యాలీ, బహిరంగ సభలో మోదీ ప్రసంగించాల్సి ఉంది. దీంతో పాటు కొన్ని సంక్షేమ పథకాలను మోదీ ప్రకటించాల్సి ఉంది.
మోదీ పర్యటన రద్దు కావడంతో ఇంటిగ్రెటేడ్ పవర్ డెవలప్‌మెంట్ స్కీమ్‌తో పాటు వారణాసి - బాబత్‌పూర్ మధ్య నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన, బనారస్ హిందూ యూనివర్సిటీలో ట్రౌమా సెంటర్ ప్రారంభం తదితర కార్యక్రమాలు వాయిదా పడ్డాయి.
ఉత్తరప్రదేశ్లోని తన నియోజకవర్గంలోని ప్రజలను పలకరించేందుకు ప్రయత్నించిన రెండవసారి కూడా ప్రధానికి వరుణుడు అడ్డుపడ్డాడు. దీంతో ఆయన పర్యటన కోసం రాత్రి పగలు శ్రమించిన బీజేపీ శ్రేణులు ఉసూరుమన్నాయి. జూన్28న భారీ వర్షాల కారణంగా మోదీ వారణాసి పర్యటన రద్దయిన సంగతి విదితమే.