
తిరువనంతపురం: నైరుతి రుతుపవనాలు దేశ వ్యవసాయ రంగానికి ఆయువు పట్టు అనే సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 70 శాతం వర్షపాతం, వ్యవసాయం నైరుతి రుతుపవనాల మీద ఆధారపడింది. అయితే ఈ వర్షాల వల్ల ప్రాణ నష్టం కూడా పెద్ద ఎత్తున సంభవిస్తుంది. ఏకధాటిగా కురుస్తున్న వానలతో దక్షిణాది రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర కూడా విలవిల్లాడుతుంది. భారీ వర్షాల కారణంగా దేశ వ్యాప్తంగా 95మంది చనిపోగా.. కేరళలో వరదలతో గత మూడు రోజుల్లో 42 మంది చనిపోయారు. ఇప్పటికే సుమారు లక్ష మందిని కేరళ ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు చేర్చింది. మలప్పురం, వయనాడ్ జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో సుమారు 80మంది శిథిలాల్లో చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో బనసురసాగర్ ఆనకట్ట గేట్లను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ పత్రికా సమావేశంలో తెలిపారు. వరదల నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వరదల కారణంగా కొచ్చి విమానాశ్రయాన్ని ఆదివారం వరకూ మూసి వేస్తున్న ప్రకటించిన సంగతి తెలిసిందే.