సాక్షి, ముంబై/పుణె: గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముంబై మహా నగరం అతలాకుతలం అవుతోంది. మంగళవారం ఉదయం కూడా భారీ వర్షం కురుస్తుండటంతో జనజీవనం అతలకుతలమవుతోంది. భారీ వర్షాలకు రోడ్డు, రైలు, విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. ముంబైతోపాటు, కళ్యాణ్, పుణెలలో సంరక్షణ గోడలు కూలడంతో సుమారు 22మంది మరణించారు.
ముంబయి నగరంలోని మలాడ్ ఈస్ట్ ప్రాంతంలో గోడకూలి 13 మంది మృతిచెందారు. ఇంకో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వెంటనే.. సంఘటన జరిగిన పింపరీపాడ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే స్థానికులు స్పందించి పలువురినని శిథిలాల నుంచి బయటకు తీసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
అంబేగావ్‌లోనూ..
పుణెలోని అంబెగావ్‌లోనూ విషాదం చోటుచేసుకుంది. భారీగా కురుస్తున్న వర్షాలకు అంబేగావ్‌లోని సిన్గాడ్ కళాశాల గోడ కూలి ఆరుగురు మంది మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ దుర్ఘటన తెల్లవారుఝామున జరిగింది. ఘటన సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసే చర్యలు చేపట్టారు. భారీ వర్షానికి తడిచిన గోడ ఒక్కసారిగా కూలిపోయింది.
మరోవైపు ముంబైకి 40 కిలోమీటర్ల దూరంలోని కల్యాణ్ ప్రాంతంలో అర్ధరాత్రి గోడ కూలడంతో ముగ్గురు మృతి చెందారు. ఒక వ్యక్తి గాయపడ్డారు. పశ్చిమ కల్యాణ్ ప్రాంతంలోని దుర్గ ఆలయానికి అభిముఖంగా ఉన్న జాతీయ ఉర్దూ పాఠశాల గోడ కూలడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment