లక్నో: దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగిపోర్లుతున్నాయి. దిగువ రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఈ ప్రభావం అధికంగా కనబడుతోంది. వరదల్లో చిక్కుకుని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ ఆయిల్ ట్యాంకర్ వరదల్లో కొట్టుకుపోయిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీచేశారు. అయితే వీటిని సరిగా అంచనా వేయని ఓ ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ బిజ్నూర్ నుంచి ఉత్తరాఖండ్ వెళ్లేందుకు తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
మధ్యలో గాగ్రా నదిలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో ఆ వాహనం అందులో పడి కొట్టుకుపోయింది. ఆయిల్ ట్యాంకర్‌లో ప్రయాణిస్తున్న వ్యక్తులు తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. దీనిని నది ఒడ్డున ఉన్న కొందరు వ్యక్తులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఉత్తరాఖండ్‌లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. బిజ్నూర్, ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలో వరద ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్టు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment