మథుర : సీనియర్ నటి, పార్లమెంట్ సభ్యురాలు హేమమాలినికి తృటిలో ప్రమాదం తప్పింది. బుధవారం సాయంత్రం మథుర రైల్వే స్టేషన్ లో ఆమె ఆకస్మిక తనిఖీలకు వెళ్లారు. ఆ సమయంలో ఓ ఎద్దు ఆమె వైపుగా దూసుకొచ్చింది. అయితే భద్రతా సిబ్బంది అప్రమత్తతో అంతా సురక్షితంగా బయటపడ్డారు.
జాతీయ మీడియా ద్వారా వైరల్ అయిన ఆ వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఆమె స్టేషన్ లో నడిచి వస్తుండగా, ఓ ఎద్దు అదుపు తప్పి స్టేషన్ లోకి దూసుకొచ్చింది. అదుపు చేసే యత్నంలో అది ముందుకు పరుగు తీసింది. ఆమెతో ఉన్న పోలీస్ అధికారులు ఆమె చుట్టూ నిలబడి, ఆమెను పక్కకు తప్పించారు. ఇక ఎద్దు కూడా పక్కనుంచి వెళ్లిపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
రైల్వే స్టేషన్ లో పశువులు తిరగడంపై హేమమాలిని అధికారులపై మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకోబోనని హెచ్చరించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ముంబై ఎల్‌పిన్‌స్టోన్ బ్రిడ్జి ఘటన అనంతరం ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లోని రైల్వే స్టేషన్ల ను దర్శించి సౌకర్యాలను, పరిస్థితులను సమీక్షించాలని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హేమామాలిన మధుర స్టేషన్‌ను దర్శించారు.
హేమమాలిని వైపుగా దూసుకొచ్చిన ఎద్దు
Comments
Please login to add a commentAdd a comment