పెరిగిన నగదు రహిత లావాదేవీలు
Published Wed, Dec 7 2016 5:12 PM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM
ముంబై : పాత పెద్ద నోట్ల రద్దు వల్ల నగరంలోని 250 పెట్రోల్ బంక్‌ల వద్ద నగదు రహిత లావాదేవీలు జోరుగా కొనసాగుతున్నాయి. గతంలో 16 నుంచి 18 శాతం వరకు నగదు రహిత లావాదేవీలు జరిగేవి. కానీ ఇప్పుడు వీటి సంఖ్య 60 శాతానికి చేరుకుంది. పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సగటు విక్రయ చార్ట్ లో పొందుపర్చిన వివరాల మేరకు.. పాత పెద్ద నోట్లు రద్దుకు ముందు ప్రతి పెట్రోల్ బంక్ వద్ద 652 నుంచి 700 మంది వినియోగదారులు నగదు రహిత పేమెంట్‌ను చెల్లించేవారు. సదరు వినియోగదారుల సంఖ్య ప్రస్తుతం రోజుకు ప్రతి పెట్రోల్ బంక్‌లో 2,400కు పెరిగిందని పేర్కొన్నారు.
పెట్రోల్ బంక్‌ల వద్ద నగదు రహిత లావాదేవీలు ఒక్కసారిగా పెరగడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని అసోసియేషన్ అధ్యక్షులు రవి శిండే చెప్పారు. పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం నగర వాసులను క్రెడిట్, డెబిడ్ కార్డులను ఎక్కువగా ఉపయోగించే విధంగా ప్రేరేపించిందని తెలిపారు. అంతేకాకుండా పాత పెద్ద నోట్లను రద్దు చేసిన మొదటి వారంలో వినియోగదారుల సంఖ్య కూడా పెరిగిందని శిండే తెలిపారు. ఈ సమయంలో తమ విక్రయాలు కూడా 70 శాతం పెరిగాయన్నారు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీ, ఇతర వాహనాలు తమ వద్దకు రూ.500, రూ.1,000 నోట్లతో వచ్చేవారని తెలిపారు. నగర వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంక్‌లకు మొదటి రెండు మూడురోజుల్లోనే రూ.63 కోట్లు అదనంగా విక్రయం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఓ పెట్రోల్ బంక్ యజమాని ఒకరు మాట్లాడుతూ.. ఈ-వాలెట్ కంపెనీలతో కూడా సంబంధాలు ఏర్పర్చుకోవాలనే ఉత్సాహంతో ఉన్నామన్నారు.
Advertisement
Advertisement