14 మంది గజ ఈతగాళ్లతో గాలింపు
మండి : బియాస్ నదిలో గల్లంతు అయిన విద్యార్థుల మృతదేహాల కోసం అయిదో రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నేవీ సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. 14మంది గత ఈతగాళ్లు, రెండు అండర్ వాటర్ కెమెరాలతో గాలిస్తున్నారు. మానవరహిత విమానంతో ఉపరితలం నుంచి ఫొటోలు తీయడంతో పాటు నీటి అడుగున పని చేసే కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు.
సోమవారం నలుగురు, మంగళవారం ఒక విద్యార్థి మృతదేహాలను వెలికి తీయడం తెలిసిందే. దీంతో ఇప్పటిదాకా ఆరుగురు విద్యార్థుల శవాలు దొరికాయి. మరో 18 మంది విద్యార్థులతో పాటు టూర్ ఆపరేటర్ ఆచూకీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. వారందరి కుటుంబీకులూ బియాస్ నది వద్ద కంటిపై కునుకు కూడా లేకుండా నిస్సహాయంగా ఎదురుతెన్నులతో క్షణమొక యుగంగా గడుపుతున్నారు. మరోవైపు బుధవారం మధ్యాహ్నం నుంచీ ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో ప్రయత్నాలను తాత్కాలికంగా ఆపేశారు.