* హిందీ మాట్లాడే రాష్ట్రాలకే పరిమితమని స్పష్టీకరణ
* బలవంతంగా రుద్దేది లేదన్న వెంకయ్యనాయుడు
న్యూఢిల్లీ/చెన్నై/బెంగళూరు: సామాజిక మాధ్యమాల్లో, అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల్లో హిందీ వినియోగాన్ని ప్రోత్సహించాలన్న నిర్ణయంపై విమర్శలు చెలరేగడంతో కేంద్రప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ జారీ చేసిన రెండు సర్క్యులర్లు కేవలం ఆ భాష మాట్లాడే రాష్ట్రాలకు మాత్రమే పరిమితమని శుక్రవారం వివరణ ఇచ్చింది. హిందీ భాషేతరులపై హిందీని బలవంతంగా రుద్దేది లేదని స్పష్టం చేసింది. మరోవైపు ఈ సర్క్యులర్లపై డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేయగా.. తాజాగా తమిళనాడు సీఎం జయలలితతోపాటు బీజేపీ మిత్రపక్షాలు సైతం మండిపడ్డాయి.
జయలలిత దీనిపై ప్రధాని నరేంద్ర మోడీకి శుక్రవారం లేఖ రాశారు. హోం శాఖ ప్రతిపాదన అధికార భాషాచట్టాలు, 1963 స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. మాతృభాషకు అత్యంత ప్రాధాన్యమిచ్చే తమిళనాడు ప్రజలకు ఇది తీవ్ర కలవరాన్ని కలిగిస్తోందన్నారు. సామాజిక మాధ్యమాల్లో అధికారులు హిందీకి బదులుగా ఆంగ్లాన్ని వాడేలా సూచించాలని ప్రధానికి ఆమె విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న పీఎంకే, ఎండీఎంకేలు సైతం కేంద్రం చర్యను తప్పుపట్టాయి. కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు బెంగళూరులో మాట్లాడుతూ.. ఏ ఒక్కరిపైనా హిందీని బలవంతంగా రుద్దే ప్రసక్తి లేదన్నారు.
‘హిందీ’పై వెనక్కు తగ్గిన కేంద్రం
Published Sat, Jun 21 2014 2:40 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM
Advertisement
Advertisement