ప్రతీకాత్మక చిత్రం
సాక్షి ప్రతినిధి, చెన్నై: విరుదునగర్ జిల్లాకు చెందిన ఒక గర్భిణికి ప్రభుత్వ సిబ్బంది హెచ్‌ఐవీ రక్తం ఎక్కించిన వేడి వాతావరణం ఇంకా చల్లారక ముందే ఇలాంటి మరో దారుణం తమిళనాడులో బైటపడింది. చెన్నైలోని ప్రభుత్వ కీల్పాక్ ఆస్పత్రిలో ఒక మహిళకు హెచ్‌ఐవీ రక్తం ఎక్కించిన వైనం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. చెన్నై మాంగాడుకు చెందిన 27 ఏళ్ల వివాహిత రెండోసారి గర్భం దాల్చి అక్కడికి సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం (పీహెచ్‌సీ)లో తరచూ పరీక్షలు చేయించుకునేది. రక్తం తక్కువగా ఉన్నందున కీల్పాక్ ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా పీహెచ్‌సీ సిబ్బంది సూచించారు. దీంతో ఏప్రిల్ 5న కీల్పాక్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా ఆమెకు రెండు యూనిట్ల రక్తం ఎక్కించారు. ఆ తరువాత యథాప్రకారం పీహెచ్‌సీలో పరీక్షలు చేయించుకునేది. ఎనిమిదో నెల గర్భంతో ఉన్నప్పుడు ఆగస్టు 18న ఆమెకు పరీక్షలు చేసినపుడు హెచ్‌ఐవీ బైటపడింది. అయితే ఈ విషయాన్ని గర్బిణి వద్ద దాచిపెట్టి హెచ్‌ఐవీ నిరోధక చికిత్సను ప్రారంభించారు.
ఈ మందులు ఎందుకని గర్భిణి ప్రశ్నించగా రక్తం ఎక్కించినపుడు అంటువ్యాధి సోకి ఉండొచ్చనే అనుమానంతో వైద్యంచేస్తున్నట్లు చెప్పిపంపివేశారు. అయితే పీహెచ్‌సీ సిబ్బంది ఇచ్చిన వివరణను అనుమానించిన ఆమె ప్రయివేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా హెచ్‌ఐవీ వ్యాధి సోకినట్లు చెప్పారు. దీంతో హతాశురాలైన ఆమె తమిళనాడు వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి విజయభాస్కర్, కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్‌లకు లేఖ రాశారు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందనరానట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, సదరు గర్భిణి సెప్టెంబరు 19న మగబిడ్డను ప్రసవించింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను దూరం పెట్టడంతో దిక్కుతోచక అల్లాడిపోయింది. ఈ దశలో విరుదనగర్ జిల్లా గర్భిణి ఉదంతం రచ్చకెక్కగా మాంగాడు మహిళ సైతం ఇరుగూ పొరుగుకు తనగోడు వెళ్లబోసుకోవడంతో బైటపడింది. ప్రభుత్వ సిబ్బంది నిర్లక్ష్యానికి తన జీవితం కూడా నాశనమైందని ఆమె ఆవేదన చెందగా, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పలువురు సామాజిక కార్యకర్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment