జమ్మూ బస్‌స్టాండ్‌లో రక్తపు మరకలు (వృత్తంలో)
జమ్మూ: జమ్మూలో ఉగ్రవాదులు గురువారం జరిపిన గ్రెనేడ్ దాడిలో మహ్మద్ షరీక్ (17) అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 32 మంది గాయపడ్డారు. జమ్మూ ఆర్టీసీ బస్టాండ్‌లో ఈ దాడి జరిగింది. సీసీటీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు యాసిన్ జావీద్ భట్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. అతనికి హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఆ సంస్థే జమ్మూలో మతసామరస్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడిందన్నారు.
ఘటనపై జమ్మూ ఐజీ ఎంకే సిన్హా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిందితుడిని నగ్రోటా టోల్‌ప్లాజా దగ్గర పట్టుకున్నామనీ, హిజ్బుల్ సంస్థ కుల్గాం జిల్లా కమాండర్ ఫరూఖ్ అహ్మద్ భట్‌తో అతను మాట్లాడినట్లు తేలిందని చెప్పారు. ఫరూఖ్ తనకు గ్రెనేడ్‌ను కుల్గాంలో అందజేశాడనీ, గురువారం ఉదయం జమ్మూ చేరుకున్నానని విచారణలో యాసిన్ చెప్పాడన్నారు. చనిపోయిన మహ్మద్ ఫరీక్ ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాకు చెందిన వాడు. గతేడాది మే నుంచి చూస్తే జమ్మూ ఆర్టీసీ బస్టాండ్‌లో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడటం ఇది మూడోసారి.
ఎన్‌కౌంటర్‌లో జైషే ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్‌కు చెందిన ముష్కరుడు మరణించాడని పోలీసులు చెప్పారు. హంద్వారాలోని క్రల్గుండ్‌లో ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా సమాచారం మేరకు పోలీసులు బుధవారం రాత్రి నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారని తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదిని పాకిస్తాన్ జాతీయుడైన అన్వర్‌గా గుర్తించామనీ, ఇతనికి జైషే మహ్మద్ సంస్థతో సంబంధాలున్నాయని పోలీసులు వెల్లడించారు. ఆయుధాలు, పేలుడు పదార్థాల వంటి నేరారోపక వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు.
యూపీలో కశ్మీరీలపై దాడి
చితక్కొట్టిన బజరంగ్ దళ్ సభ్యులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఉగ్రవాదులనుకుని కశ్మీర్‌కు చెందిన యువకులపై బజరంగ్ దళ్‌కు చెందిన వ్యక్తులు దాడి చేశారు. బుధవారం సాయంత్రం ఆ రాష్ట్రంలోని దాలిగంజ్ బ్రిడ్జిపై డ్రై ఫ్రూట్స్‌ను అమ్ముతున్న కొందరు కశ్మీర్ యువకులపై బజరంగ్ దళ్‌కు చెందిన కొందరు విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ కశ్మీరీ యువకులపైకి రాళ్లతో దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచారు. నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. దాడిలో ప్రధాన నిందితుడు, బజరంగ్‌దళ్ సభ్యుడు, విశ్వ హిందూదళ్ అధ్యక్షుడు సోంకర్, హిమాన్షు గార్గ్, అనిరుధ్, అమర్ కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. బాధితులు డ్రైఫ్రూట్స్ అమ్మేందుకు కశ్మీర్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వచ్చినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment