గ్యాస్, కిరోసిన్ రేట్లు పెరగవు
* అలాంటి ప్రతిపాదనేమీ లేదు
* ధరల పెంపు కథనాలను ఖండించిన కేంద్రం
న్యూఢిల్లీ: వంటగ్యాస్, కిరోసిన్ ధరలను పెంచే యోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 250, లీటర్ కిరోసిన్‌పై 4 రూపాయలు పెంచడానికి చమురు శాఖ కసరత్తు చేస్తోందన్న కథనాలను పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖండించారు. ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదనలేవీ లేవని తోసిపుచ్చారు. చమురు ఉత్పత్తుల రేట్లు పెంచాలని కిరీట్ పారిఖ్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల మేరకు చమురు శాఖ ఓ నోట్ సిద్ధం చేసిందని, రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) అనుమతి కోసం ప్రయత్నిస్తోందని మీడియా కథనాలు వెలువడటంతో కేంద్ర మంత్రి స్పందించారు.
గ్యాస్, కిరోసిన్ ధరలు పెంచే యోచన కానీ, డీజిల్ ధరల విధానాన్ని మార్చే ప్రతిపాదన కానీ పెట్రోలియం శాఖ వద్ద లేదని స్పష్టం చేశారు. చమురు ఉత్పత్తుల ధరలు పెంచి రూ. 72 వేల కోట్ల సబ్సిడీని తగ్గించుకోవాలని పారిఖ్ కమిటీ గత అక్టోబర్‌లో నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. రేట్లను పెంచకపోతే ఈ ఆర్థిక సంవత్సరంలో చమురు సంస్థలు దాదాపు రూ. 1.07 లక్షల కోట్ల మేర నష్టాలను మూటగట్టుకుంటాయని, దీన్ని కేంద్రమే భరించాల్సి వస్తుందని కమిటీ తన నివేదికలో హెచ్చరించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు సబ్సిడీ భాగం పెరగడంతో మూడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెందిన దాదాపు వందకుపైగా ఉద్యోగులు తమ ఎల్‌పీజీ సబ్సిడీ మొత్తాలను వదులుకున్నారని పెట్రోలియం మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదలచేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.