రాంచీ: జార్ఖండ్ పోలీస్ శాఖలో వంట మాస్టర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఎవరు చికెన్‌ఫ్రై బాగా చేస్తారో, రోటీలు ఎంత వేగంగా ఎవరైతే తయారు చేస్తారో వారికే ఉద్యోగం దక్కుతుందని పోలీసులు తెలిపారు. మొత్తం 4000 మంది అభ్యర్ధులు 78 ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. ఈ రిక్రూట్‌మెంట్‌కు రాంచీలోని పేరున్న పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్ల చెఫ్‌లు కూడా దరఖాస్తు చేసుకుని పోటీపడుతున్నారు. ఉద్యోగానికి ఎంపికయినవారికి నెలకు రూ.15000 నుంచి 18000 వరకు జీతంగా నిర్ణయించారు.
‘‘రాంచీలోనే పేరుపొందిన క్రిష్ణా రెస్టారెంట్లో పనిచేస్తాను. శాకాహార వంటకాలు వండుతాను’’ అని గుప్తా తెలిపారు. ఒకవేళ ఉద్యోగానికి ఎంపికైతే మంచి జీతం ఇస్తారని గుప్తా చెప్పారు.
‘‘నేను అదృష్టాన్ని పరిశీలించుకోవడానికి వచ్చాను. నేను చికెన్‌కర్రీ , రోటీ, వాటితో పాటు సలాడ్, శాకాహార కూరలు చేయగలను'' అని నగరంలోని క్యాపిటల్ గ్రూప్‌లో పనిచేస్తున్న మనీష్ తెలిపారు.
అభ్యర్ధులు ఎక్కువగా వంట చేయడం వృత్తిగా ఉన్నారని పోలీస్ రిక్రూట్‌మెంట్ ఇన్‌ఛార్జ్ , డీఎస్పీ ఆర్.కె.చౌధరి తెలిపారు. కానీ ఎక్కువ మంది అభ్యర్ధులు రోడ్డు పక్కన చిన్న చిన్న హోటళ్లు నడుపుకునేవారని ఆయన అన్నారు.
‘‘చాలామంది పోటీపడుతున్నారు. కానీ అదృష్టం ఉండాలి. ఒకవేళ నేను సెలెక్ట్ కాకపోతే తిరిగి మా గ్రామానికి వెళ్లి చైనీస్ ఫుడ్ అమ్ముకుంటాను’’ అని జంషెడ్‌పూర్ నివాసి శైలేష్‌కుమార్ అంటున్నారు.
రాంచీకి 450 కిలోమీటర్ల దూరంలో ఉండే రానూపూర్ నుంచి వచ్చిన స్వర్గిని మరాండి మాట్లాడుతూ ‘‘స్లోకుక్‌డ్ పేరుతో వంట కాలు చేశాను. ప్రయాణపు ఖర్చులు, వసతి, సరుకులు మెత్తానికి రూ.2500 ఖర్చు చేశాను. అయినా ఫైనల్‌కు వచ్చినందుకు సంతోషంగానే ఉంది'' అని అన్నారు.
జార్ఖండ్‌లోని గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది అభ్యర్ధులు వచ్చారు. వారి వంటల రుచి చూసి ఆశ్చర్యపోయామని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఎంపికయిన వారు నక్సలైట్ల ప్రాబల్యం అధికంగా ఉండే పోలీస్ పికెట్స్, క్యాంపులు, జార్ఖండ్ ఆర్మ్‌డ్ ఫోర్స్, జార్ఖండ్ జాగ్వర్, ఇండియన్ రిజర్వ్ బెటాలియన్, జార్ఖండ్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ల్లో పనిచేయాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఇలా వంటవాళ్లను నోటిఫికేషన్ ద్వారా ఎన్నుకోవటం మొదటిసారని జార్ఖండ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధ్యక్షుడు హరి నారాయణ రామ్ మహలి పేర్కొన్నారు. వంటలు మంచిగా, రుచిగా, ఆరోగ్యకరంగా ఉండటమే ఒక కొలమానంగా పోటీలు నిర్వహిస్తున్నామని ఆయనన్నారు. జనవరి 29 నుంచి ఈ రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తున్నాం. వచ్చే గురువారం తుది ఫలితాలు వెలువరిస్తామని చెప్పారు.
చికెన్‌ఫ్రై చేయడం వస్తే ప్రభుత్వోద్యోగం వచ్చినట్లే
Published Sat, Feb 6 2016 8:22 PM | Last Updated on Sun, Sep 3 2017 5:04 PM
Advertisement