
అప్పట్లో మిడతలను పారద్రోలేందుకు, పట్టుకునేందుకు పలు పద్ధతులు అమల్లో ఉండేవి.
సాక్షి, న్యూఢిల్లీ : ‘హెవెన్–సెంట్ విసిటేషన్ (స్వర్గం పంపించిన పర్యవేక్షకులు)’ అని పంటలపైకి దాడికి వచ్చిన మిడతల దండును భారతీయులు ఒకప్పుడు భావించేవారట. అందుకని మిడతలను పట్టుకుంటే డబ్బులిస్తామంటూ బ్రిటీష్ పాలకులు ఎంత పిలిచినా వెళ్లేవారు కాదట. మిడతల వల్ల పంటలు దెబ్బతిని దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుందని, వ్యవసాయ రైతులు పన్నులు చెల్లించే పరిస్థితుల్లో ఉండరనే ఉద్దేశంతో బ్రిటిష్ పాలకలు మిడతలను కూలీ ఇచ్చి పట్టించే వారు.
(చదవండి: మిడతలు మిక్సీ.. కోడికి మస్తీ!)
అప్పట్లో మిడతలను పారద్రోలేందుకు, పట్టుకునేందుకు పలు పద్ధతులు అమల్లో ఉండేవి. మిడతలను పారద్రోలేందుకు అవి ఆశించిన పంట పొలాల్లోకి వెళ్లి తపాలాను కర్రలతో మోగించేవారు. ఆ శబ్దాలకు అవి పారిపోయేవి. శబ్దాలు వినిపించని చోటుకు వెళ్లేవి. అక్కడ కూడా అలాంటి శబ్దాలనే వినిపించినట్లయితే అక్కడి నుంచి మరోచోటుకు వెళ్లేవి. కానీ నశించేవి కావు. నూనెలో తడిపిన తెరలను పొలాల వద్ద గాలివాటున కట్టే వారు. గాలి వాటున వచ్చే మిడతలు నూనెలో తడిపిన తెరకు అంటుకొనేవి. వాటిలో కొన్ని చనిపోయేవి.
సైప్రస్ దేశంలో ఆ తెరల విధానాన్ని ఎక్కువగా ఉపయేగించేవారట. అందుకనే ఆ నూనెలో తడిపిన తెరలను ‘సైప్రస్ స్క్రీన్’ అని పిలిచేవారు. ఆ తెరల విధానం ఆశించిన ఫలితాలు ఇవ్వక పోవడంతో మిడతలను పట్టేందుకు బుట్టలాంటి సంచులను గిరిగిరా తిప్పుతూ పొలాల్లో తిరిగేవారు. మిడతలు వాలిన మొక్కలపైకి బ్లాంకెట్లు వలల్లా విసిరి, వాటి కింద చిక్కిన మిడతలను పట్టుకునేవారు. ఈ పద్ధతులను ఉపయోగించి మిడతలను పట్టేందుకు బ్రిటీష్ పాలకులు కూలీలను నియమించేవారు. మిడతలను స్వర్గ పర్యవేక్షకులని భావించిన భారతీయులు మాత్రం కూలీకి వెళ్లేవారు కాదట.
(చదవండి: మిడతలపై ఎదురుదాడికి ‘ఎల్‌డబ్లూఓ’)