సాక్షి,న్యూఢిల్లీ: అత్యాచారం కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడనేది వెల్లడైంది. ఆర్‌టీఐ సమాచారం కింద వెలుగులోకి వచ్చిన ఈ అంశాలు నివ్వెరపరిచేలా ఉన్నాయి. డేరా బాబా వ్యాపార కార్యకలాపాల విస్తరణకు అనుచరులు, డేరా మద్దతుదారులు అందించిన విరాళాలను వాడుకున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గుర్మీత్ వ్యాపార వ్యూహాలు, సినీ, ఈవెంట్ రంగాల్లో ప్రవేశానికి హనీప్రీత్ సూచనలే కారణమని తెలిసింది. మత విశ్వాసాలు, ఆథ్యాత్మిక కార్యక్రమాల పేరిట డేరా బాబా ఏటా కోట్ల రూపాయలు విరాళాల రూపంలో దేశవిదేశాల నుంచి వసూలు చేసేవారు.
ఈ నిధులను వ్యాపార కార్యక్రమాల విస్తరణకు వినియోగించడంతో డేరా సచ్చా సౌథా కాస్తా అనతికాలంలోనే కార్పొరేట్ సామ్రాజ్యంగా విస్తరించింది. మరోవైపు సామాజిక, ఆథ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంస్థ కావడంతో డేరా ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందింది. సంస్థ ఆర్థిక లావాదేవీల వివరాలను ఇచ్చేందుకు ఆదాయ పన్ను శాఖ నిరాకరించినా ఆర్‌టీఐ కింద సమాచారం కోరడంతో బాబా విన్యాసాలు వెలుగుచూశాయి. 2010-11లో డేరా రూ 50 కోట్ల పైగా నికర లాభం ఆర్జించింది. అంటే సంస్థ టర్నోవర్ ఏ రేంజ్‌లో ఉందో సులభంగా అర్ధం చేసుకోవచ్చు. ఇందులో డేరా నికర లాభం 30 కోట్లు కాగా, అనుబంధ సంస్థ షా సత్నం జీ రీసెర్చి ఫౌండేషన్ 16.5 కోట్లు నికర లాభం సాధించింది.హనీప్రీత్ సింగ్ తన నెట్‌వర్కింగ్ నైపుణ్యాలతో సంస్థకు నిధులు, విరాళాలు సమకూర్చేదని చెబుతున్నారు.
హనీప్రీత్ పాత్ర ఏంటి..
హనీప్రీత్ సలహా మేరకే గుర్మీత్ మ్యూజికల్ నైట్స్ ప్రారంభించారని డేరా వర్గాలు పేర్కొన్నాయి. ఈ మ్యూజికల్ నైట్స్ డేరా అనుచరుల్లో క్రేజ్‌ను సంతరించుకున్నాయి. ఇవి ఎంతలా ఆదరణ పొందాయంటే ఒక్కో రాత్రికి కోట్ల రూపాయలు డేరాకు వచ్చిపడేవని తెలుస్తోంది. ఈ షోల్లో గుర్మీత్ సింగ్ తన గానకళకు పదునుపెట్టి తన పాపులర్ సాంగ్స్ లవ్ చార్జర్‌ను ఆలపిస్తూ భారీ మొత్తాలను షోలకు రాబట్టేవాడు. డేరా సినిమాలు కూడా హనీప్రీత్ ఆలోచనల్లోంచే పుట్టాయి. వీటిలో కొన్ని సినిమాలు 100 కోట్ల క్లబ్‌లోకి చేరాయి.
ఆ డబ్బు ఎక్కడ..?
డేరా ఆదాయంలో విరాళాలతో పాటు మ్యూజిక్ షోలు, సినిమాలు ప్రధాన వనరులుగా చెబుతారు. నగదు విరాళాల ద్వారా ప్రధాన ఆదాయం డేరాకు సమకూరుతోంది. అయితే డేరా ప్రాంగణంలో పోలీసుల సోదాల్లో కొద్దిపాటి నగదు మాత్రమే లభ్యం కావడం పలు సందేహాలకు తావిస్తోంది. అక్రమంగా దాచిన నగదు నిల్వలను గుర్మీత్ అనుచరులు డేరా నుంచి బయటకు పంపారని భావిస్తున్నారు. హర్యానాలోని సిర్సాలో డేరా ప్రధాన కార్యాలయం నుంచి ఆగస్టు 28 రాత్రి హనీప్రీత్ రెండు పెద్ద సైజ్ ట్రావెల్ బ్యాగ్‌లతో అదృశ‍్యమయ్యారనే ప్రచారం సాగింది. హనీప్రీత్ ఈ సొమ్మును ఎక్కడికి తరలించారనే దానిపై పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు.డేరాలో సాగుతున్న దర్యాప్తులో మనీల్యాండరింగ్ ఆరోపణలనూ విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment