ఉప ఎన్నికల్లో బీజేపీ జోరు
పదింటిలో ఐదు స్థానాల్లో విజయం
► ఢిల్లీలో ఆప్ డిపాజిట్ గల్లంతు
► అస్సాం, రాజస్తాన్, హిమాచల్ సీట్లు బీజేపీ ఖాతాలోకి
► కర్ణాటక హస్తానిదే.. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ హవా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ జయభేరి మోగించింది. గురువారం వెల్లడైన ఫలితాల్లో పది స్థానాలకుగానూ ఐదింటిని గెలుచుకుంది. మధ్యప్రదేశ్, రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, కర్ణాటక, ఢిల్లీ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు స్థానాల్లో గెలుపొందగా.. తృణమూల్ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఒక్కోస్థానంలో విజయం సాధిం చాయి. కర్ణాటకలో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ రెండు స్థానాలను కైవసం చేసుకోగా, పశ్చిమ బెంగాల్‌లో మమత నాయకత్వానికే ప్రజలు జై కొట్టారు. జార్ఖండ్‌లో ఏకైక స్థానం లో జేఎంఎం విజయం సాధించింది.
ఆప్‌కు షాక్
త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరగనున్న ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ స్థానంలో ఎన్డీయేకి భారీ విజయం దక్కింది. బీజేపీ–శిరోమణి అకాలీదళ్ సభ్యుడిగా బరిలో దిగిన మన్‌జిందర్ సింగ్ సిర్సా 50 శాతానికిపైగా ఓట్లు సంపాదించి ఘన విజయం సాధించారు. అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ మూడోస్థానానికే పరిమితమై.. డిపాజిట్ కోల్పోయింది. ఇక్కడ కాంగ్రెస్ రెండోస్థానంలో నిలిచింది. తాజా విజయంతో బీజేపీ రెట్టించిన ఉత్సాహంతో మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోనుందని పార్టీ నాయకులంటున్నారు.
మధ్యప్రదేశ్‌లో చెరొకటి: మధ్యప్రదేశ్‌లో రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కోస్థానాన్ని కైవసం చేసుకున్నాయి. బాంధవ్‌గఢ్ స్థానంలో బీజేపీ అభ్యర్థి శివనారాయణ్ సింగ్ 25,476 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచారు. అటేర్ నియోజకవర్గంలో చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి హేమంత్ కటారే బీజేపీ అభ్యర్థి అరవింద్ సింగ్ భదోరియాపై 857 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని భోరంజ్ (ఎస్సీ) స్థానంలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ అనిల్ ధిమాన్ 8,290 మెజారిటీతో గెలుపొందారు.
అస్సాంలోని ధేమాజీ స్థానంలో బీజేపీకి చెందిన రానోజ్ పెగు 9,285 ఓట్ల తేడాతో గెలిచారు. కర్ణాటకలో పోలింగ్ జరిగిన రెండు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నంజనగుడ స్థానంలో 21వేలకు పైగా మెజారిటీతో, గుండ్లుపేటలో పదివేలకు పైచిలుకు తేడాతో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. రాజస్తాన్‌లోని ఢోల్‌పూర్ అసెంబ్లీ స్థానంలో అధికార బీజేపీ 22,602 ఓట్ల తేడాతో మొదటిస్థానంలో నిలిచింది. జార్ఖండ్‌లోని లిట్టిపారా స్థానానికి జరిగిన పోలింగ్‌లో జేఎంఎం అభ్యర్థి సిమోన్ మరాండి 12,900 ఓట్లతో గెలిచారు. పశ్చిమబెంగాల్‌లోని కాంతి దక్షిణ్ అసెంబ్లీ స్థానంలో.. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి చంద్రిమా భట్టాచార్య 42,527 ఓట్ల (56శాతం) భారీ మెజారిటీతో విజయం సాధించారు.
బీజేపీ ప్రదర్శన భేష్: ప్రధాని
ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శనపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. బీజేపీపై విశ్వాసం కనబరుస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘అభివృద్ధి రాజకీయాలు, సుపరిపాలనపై ప్రజలు మరోసారి విశ్వాసం కనబరిచారు. ప్రజలకు కృతజ్ఞతలు. కార్యకర్తలకు శుభాకాంక్షలు’ అని ట్వీటర్‌లో పేర్కొన్నారు.
శ్రీనగర్‌లో రీపోలింగ్ 2 శాతమే!
శ్రీనగర్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల రీపోలింగ్‌లో కేవలం 2శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. మొత్తం 38 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన రీపోలింగ్‌లో 709 మంది (మొత్తం 34,169 ఓట్లలో) మాత్రమే ఓటుహక్కును వినియోగించుకున్నారని ఎన్నికల అధికారులు వెల్లడించారు. బుద్గాంలో ఓ రాళ్లురువ్విన ఘటన మినహా మిగిలిన చోట్ల ప్రశాంతంగానే పోలింగ్ జరిగిందని తెలిపారు. ఈ ఉప ఎన్నికల కౌంటింగ్ శనివారం (ఏప్రిల్ 15న) జరగనుంది. ఏప్రిల్ 9న జరిగిన ఎన్నికల్లో 7.14 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.