తొలి రిమోట్ ‘యుద్ధ’ట్యాంక్.. మంత్ర
చెన్నై: స్వదేశీ పరిజ్ఞానంతో రిమోట్ సాయంతో నడిచే తొలి మానవరహిత ‘యుద్ధ’ ట్యాంకులను రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ( డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది. రిమోట్ ఆదేశాలతో పనిచేసే మూడు ‘మంత్ర ’ సిరీస్ ట్యాంకులను తయారుచేసింది. నిఘా, మందుపాతరల గుర్తింపు, అణుధార్మికత, జీవ ఆయుధాల ప్రమాదమున్న ప్రాంతాల జాడ తెలుసుకునేందుకు ఈ మూడు రకాల ట్యాంకులను రూపొందించింది.
నిఘా కోసం మంత్ర–ఎస్ రకాన్ని, బాంబుల గుర్తింపు కోసం మంత్ర ఎం రకాన్ని అలాగే అణు ధార్మికత, జీవాయుధాల ప్రమాదమున్నప్రాంతాలను గుర్తించేందుకు మంత్ర– ఎన్ రకాన్ని తయారుచేశారు. అవడిలోని ఆర్మీకి చెందిన కంబాట్ వెహికల్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్(సీవీఆర్‌డీఈ)లో వీటిని తయారుచేశారు. సీవీఆర్‌డీఈలో మాజీ రాష్ట్రపతి కలాంకు నివాళిగా ఏర్పాటుచేసిన ప్రదర్శనలో కొత్తగా తయారుచేసిన రెండు మంత్ర సిరీస్ ట్యాంకులను ప్రదర్శించారు. 52 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ఎడారి ప్రాంతమైన రాజస్తాన్ లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో వీటిని పరీక్షించారు.