మంత్రం అన్నది ఎంతో పవిత్రమైనది, గురువుల ఉపదేశంతో కేవలం మరొకరు వినకుండా ఎంతో గుహ్యంగా బోధిస్తారే, మరి అటువంటిది తమ గురువుల మాటను ధిక్కరించి దేవాలయం పైకెక్కి అంతమందికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించడం ఎంతవరకు సబబు అని నాస్తికులే కాక ఆస్తికులు కూడా అడిగే ప్రశ్న. గురువులు ఏమి చేసినా లోకకళ్యాణం కొరకు చేస్తారు.
రామానుజులు తమ గురువుల వద్ద ఎంతో కష్టపడి తెలుసుకున్న శ్రీమన్నారాయణ దివ్య మంత్రాన్ని అక్కడున్న తిరుక్కోటియర్ వైష్ణవ మందిరాన్ని అధిష్టించి అక్కడ గ్రామప్రజలను ఉద్దేశించి అందరికీ ఉపదేశం చేశాడు. ఈ చర్యను గర్హించిన గురువుల పాదాలు పట్టి తాను నరకానికి పోయినా ఫరవాలేదు కానీ ఇన్ని వందలమంది బాగు పడాలి అని కోరి ఇలా చేసానని చెప్పి, ఆయన ప్రశంసలు అందుకున్నారు.
ఇక ఇందులోని సామంజస్యం విషయానికి వస్తే,ఎవరెవరికి మంత్రాన్ని ఉపదేశం తీసుకునే అర్హత ఉన్నదో, ఎవరెవరికి కైవల్య ప్రాప్తికి కర్మసిద్ధి ఉన్నదో వారు మాత్రమే ఆ సమయానికి ఆ ఊళ్ళో, అందునా ఆ ఆలయ సమీపంలో ఆయన వద్దకు వెళ్లి నేరుగా ఉపదేశం పొందగలిగారు. ఎవరికి కర్మ పరిపక్వమై మంత్రరాజాన్ని అందుకోగలిగారో వారు గురువులు రామానుజుల వద్దనుండి ఆ మంత్రాన్ని గ్రహించారు. ఎవరికి కైవల్యప్రాప్తి ఉన్నదో వారు ఆ మంత్రాన్ని అనుష్టించి ఊర్ధ్వలోకాలకు అర్హులయ్యారు.
ఇవన్నీ తెలియనివారు కారు రామానుజులు. తనకేమి వద్దు కేవలం కైవల్యం కావాలని కోరిన ఆవిడకు కైవల్యం ప్రసాదించిన ఆయన ఎవరికి పడితే వారికి మంత్రాన్ని ఇచ్చారనుకోవడం మన అజ్ఞానం. అక్కడ ఎందరు ఎంత తపస్సు సాధన చేసి వున్నారో, ఏ ఏ వర్ణాలలో జన్మించి ఉన్నారో వారికి వారి కర్మానుసారం ఆయన మంత్రోపదేశం చేసారు భగవద్రామానుజులు.
Comments
Please login to add a commentAdd a comment