సాక్షి, హైదరాబాద్ : మాంసాహారంలో ప్రత్యేకంగా నిలిచే రొయ్యలను ఇకపై ముస్లింలెవరూ తినకూడదంటూ ప్రఖ్యాత ఇస్లామిక్ విద్యాసంస్థ జామియా నిజామియా ఫత్వా జారీచేసింది. ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన రొయ్యలు.. చేపజాతికి చెందినవి కావని, తేళ్లు, సాలెపురుగుల వంటి కీటకాలని ఫత్వాలో పేర్కొన్నారు. అవి అతిదుష్టమైనవి కాబట్టే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆహారంగా తీసుకోరాదని ఆదేశించారు.
జామియా నిజామియా ప్రధాన గురువు ముఫ్తీ మహమ్మద్ అజీముద్దీన్ ఈ మేరకు జనవరి 1న జారీచేసిన ఫత్వా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 142 ఏళ్లుగా హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతోన్న జామియా నిజామియా.. దేశంలో సుదీర్ఘకాలంగా నడుస్తోన్న ఇస్లామిక్ డీమ్డ్ యూనివర్సిటీల్లో ఒకటన్న సంగతి తెలిసిందే.
ముక్రూ తహరీమ్ అంటే.. : ఇస్లామిక్ ధర్మశాస్త్రం ప్రకారం ఆహారాన్ని మూడు విధాలుగా పేర్కొంటారు. సమ్మతించిన(హలాల్), నిషేధించిన(హరామ్), హేయమైన(ముక్రూ) ఆహారం. మూడో విభాగమైన ముక్రూలో ఇంకోరెండు అంతర్విభాగాలుంటాయి. ముక్రూ(హేయమైనదే కానీ తినొచ్చు), ముక్రూ తహరీమ్(దుష్టమైనది, తినకూడదు). జామియా నిజామియా ఇచ్చిన ఫత్వాలో రొయ్యలను ముక్రూ తహరీమ్‌గా పేర్కొంది. కాగా, సంస్థ ఇచ్చిన ఆదేశాలపై ముస్లిం వర్గాల నుంచే వ్యతిరేకత వస్తుండటం గమనార్హం. రొయ్యలను నిషేధిత ఆహారంగా పేర్కొనడాన్ని పలువురు ముస్లిం విద్యావేత్తలు నిరసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment