'జై శ్రీరాం' అన్నందుకు మంత్రిపై ఫత్వా!
పట్నా: ఇటీవల ప్రమాణం చేసిన బిహార్ మంత్రి, జేడీయూ నేత ఖుర్షీద్ అలియాస్ ఫిరోజ్ అహ్మద్ చిక్కుల్లో పడ్డారు. 'జై శ్రీరాం' అని నినాదాలు చేసినందుకు ఆయనపై ఓ ముస్లిం మతపెద్ద ఫత్వా జారీచేశారు. ఈ 'తప్పిదం' చేసినందుకు ఆయన పెళ్లిని రద్దు చేస్తామని హెచ్చరించారు.
శుక్రవారం బిహార్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో సీఎం నితీశ్‌కుమార్ విజయం సాధించిన అనంతరం సభ బయట బీజేపీ కార్యకర్తలు 'జై శ్రీరాం' అని నినాదాలు చేశారు. పశ్చిమ చంపారన్ జిల్లాలోని సిక్తా ఎమ్మెల్యే అయిన ఖుర్షీద్ సైతం వారితో కలిసి నినాదాలు చేశారు. ఆర్జేడీ-కాంగ్రెస్‌తో పొత్తును తెగదెంపులు చేసుకొని బీజేపీతో కలిసి నితీశ్ మళ్లీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.
బిహార్, జార్ఖండ్, ఒడిశాలలో క్రియాశీలంగా ఉన్న మతసంస్థ ఇమారత్ షరియాకు చెందిన ముఫ్తి సోహైల్ క్వాస్మి మంత్రి ఖుర్షీద్‌కు వ్యతిరేకంగా ఫత్వా జారీచేశారు. అయితే, ఈ ఫత్వాను మంత్రి ఖుర్షీద్ తోసిపుచ్చారు. 'అన్ని మతాలను గౌరవించాలని ఇస్లాం బోధిస్తుంది. జై శ్రీరాం అనడం ద్వారా నేను ముస్లింలకు మంచి చేసే వీలుంటే.. ఇలా గగ్గోలు పెట్టడం దేనికి' అని మైనారిటీ సంక్షేమం, చక్కెర పరిశ్రమల శాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఖుర్షీద్ క్షమాపణలు చెప్పారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయొద్దన్న సీఎం సూచన మేరకు క్షమాపణలు చెప్తున్నట్టు తెలిపారు.