నల్లధనం వెల్లడిలో హైదరాబాద్ టాప్!
13 వేల కోట్ల అక్రమాదాయం ప్రకటించిన నగర కుబేరులు
- ముగిసిన ఆదాయ వెల్లడి పథకం గడువు
- దేశవ్యాప్తంగా మొత్తం రూ. 65,250 కోట్ల నల్లధనం బహిర్గతం
- ప్రభుత్వానికి రూ. 29,362కోట్ల ఆదాయం
- పథకం వివరాలను వెల్లడించిన కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ
న్యూఢిల్లీ: దేశంలో నల్లధనాన్ని వెలికి తీసే క్రమంలో మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ఆదాయ వెల్లడి పథకానికి(ఐడీఎస్) భారీ స్పందన లభించింది. పన్ను చెల్లించని ఆదాయాన్ని స్వచ్ఛందంగా చెప్పేందుకు ప్రభుత్వం విధించిన గడువు సెప్టెంబర్ 30 నాటికి భారీగా రూ. 65,250 కోట్ల నల్లధనం వెలుగు చూసింది. ఇందులో రూ. 29,362 కోట్లు పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరనున్నాయి. ఈ మొత్తంలో రూ. 14,700 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో సమకూరుతాయి. ఈ పథకంలో 64, 275 మంది తమ అక్రమాదాయాన్ని బయటపెట్టారు. సగటున ఒక్కొక్కరు రూ. కోటి ఆదాయాన్ని వెల్లడించారు.
ఈ వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శనివారం మీడియాకు వెల్లడించారు. అయితే, ఈ మొత్తంలో అత్యధిక వాటా హైదరాబాద్‌దే కావడం విశేషం. శుక్రవారం సాయంత్రం నాటికి హైదరాబాద్ నుంచి దాదాపు రూ. 13 వేల కోట్ల అప్రకటిత ఆదాయం వెల్లడైందని ఐటీ వర్గాల సమాచారం. మిగతా స్థానాల్లో ముంబై(రూ. 8,500 కోట్లు), ఢిల్లీ(రూ. 6 వేల కోట్లు), కోల్‌కతా(రూ. 4 వేల కోట్లు) ఉన్నాయి. ఇప్పటివరకు ప్రకటించిన ఆదాయ వెల్లడి పథకాల్లో అత్యంత విజయవంతమైన పథకం ఇదేనని, ఈ ఘనత ప్రధాని మోదీకి చెందుతుందని జైట్లీ పేర్కొన్నారు. గణాంకాల నమోదు కొనసాగుతోందని, వెల్లడైన ఆదాయానికి సంబంధించిన కచ్చితమైన సమాచారం ఆ ప్రక్రియ ముగిశాక తెలుస్తుందని చెప్పారు.
‘ప్రభుత్వానికి పన్నులు, జరిమానాలుగా రూ. 29,362.5 కోట్లు రానున్నాయి. ఈ మొత్తాన్ని భారత సంచిత నిధిలోకి చేర్చి ప్రజా సంక్షేమానికి వినియోగిస్తాం. ఈ పథకం ద్వారా ఆదాయాన్ని ప్రకటించినవారు తమ పన్నులు, జరిమానాలను సెప్టెంబర్ 30, 2017లోపు రెండు విడతల్లో చెల్లించే అవకాశముంది’ అని వివరించారు. ఆదాయాన్ని ప్రకటించినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఐడీఎస్‌లో కూడా నల్ల ధనం వివరాలు వెల్లడించనివారిపై చర్యలేమైనా తీసుకొంటారా అన్న ప్రశ్నకు.. ఎప్పటిలానే సోదాలు కొనసాగుతాయన్నారు.
పన్నులు కట్టని ఆదాయ వివరాలు వెల్లడించేందుకు కేంద్రం ఈ సంవత్సరం జూన్ 1న ఐడీఎస్ తీసుకొచ్చింది. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద 45 శాతం పన్ను, పెనాల్టీ చెల్లించే వీలు కల్పించింది. విదేశాల్లో దాచిన భారతీయుల నల్లధనానికి సంబంధించి గత ఏడాది ప్రకటించిన ఇదే తరహ పథకం ద్వారా రూ. 2,428 కోట్లు పన్ను రూపేణా ఖజానాకు జమ అయ్యాయి. 644 మందే దీనికి స్పందించారు. 1997లో నాటి ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించిన స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం(వీఐడీఎస్) ద్వారా ప్రభుత్వానికి రూ. 9,760 కోట్లు పన్ను ఆదాయం లభించింది. అయితే, తాము ప్రకటించిన ఐడీఎస్, చిదంబరం ప్రకటించిన వీఐడీఎస్ వేరువేరు పథకాలని జైట్లీ తెలిపారు. వీఐడీఎస్ మాదిరిగా తమది పూర్తిస్థాయి క్షమాభిక్ష పథకం కాదన్నారు. ఆ పథకంలో పన్నుశాతం చాలా తక్కువన్నారు.
1951 నుంచి 1997 మధ్య పది ఈ తరహా పథకాలను ప్రకటించారు. వీటిలో 1985/86 నాటి పథకం(రూ. 10,778 కోట్లు), 1997 నాటి వీఐడీఎస్ మాత్రమే విజయవంతమయ్యాయి.
సత్ఫలితాలనిచ్చిన ప్రచారం...
ఐదు వేలకు పైగా బహిరంగ సభలు, సామాజిక మాధ్యమాలు, పత్రికల్లో ప్రకటనలు, టాకథాన్‌లు, అవగాహనా సదస్సులు... వీటికి తోడు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం... నాలుగు నెలలుగా భారీ స్థాయిలో సాగిన ఐడీఎస్ క్యాంపెయిన్ ధాటికి 64 వేల మందికి పైగా తమ నల్లధనం వివరాలు బహిర్గతం చేశారు. మరోవైపు ఆదాయపు పన్ను విభాగం కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎగవేత దారుల నుంచి వివరాలు రాబట్టగలిగింది.
వివరాలు వెల్లడించినవారికి ప్రధాని ప్రశంస
ఐడీఎస్ కింద నల్లధనం వివరాలు వెల్లడించిన వారిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. పన్ను కట్టేందుకు ముందుకు రావడం అభినందనీయమని... పారదర్శకత, దేశ ఆర్థికాభివృద్ధికి ఇది గొప్ప తోడ్పాటని మోదీ ట్వీట్ చేశారు. అలాగే నల్ల ధనం వెలికితీయడంలో ఆర్థిక శాఖ విజయం సాధించినందుకు అరుణ్ జైట్లీ బృందాన్ని మోదీ అభినందించారు. రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అదియా, సీబీడీటీ చైర్‌పర్సన్ రాణి నాయర్ బృందం కృషిని కొనియాడారు.
రూ.56,378 కోట్ల అక్రమాస్తుల స్వాధీనం
ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆదాయ పన్ను శాఖ గత రెండేళ్లలో జరిపిన సోదాల్లో రూ.56,378 కోట్ల అక్రమాస్తులు బయటపడ్డట్టు జైట్లీ చెప్పారు.‘ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని మరో రూ.16 వేల కోట్లు గుర్తించాం. రూ.2వేల కోట్ల నగదు సీజ్ చేశాం. పనామా కేసునిందితులు, హెచ్‌ఎస్‌బీసీ జాబితాలోని వారిపైనా చర్యలు తీసుకుంటాం. హెచ్‌ఎస్‌బీసీ జా బితాకు సంబధించి రూ.8వేల కోట్ల లెక్కలు తేలాయి. 164 కేసులు నమోదయ్యాయి’అని చెప్పారు.