IDs
-
వర్చువల్ ఐడీలతో ఇక మొబైల్ కనెక్షన్
న్యూఢిల్లీ: కస్టమర్ల ఆధార్ నంబర్ స్థానంలో వర్చువల్ ఐడీల స్వీకరణకు వీలుగా తమ వ్యవస్థలను మెరుగుపరచుకోవాలని ప్రభుత్వం టెలికం కంపెనీలకు సూచించింది. అలాగే, పరిమిత కేవైసీ యంత్రాంగానికి మళ్లాలని కోరింది. జూలై 1 నుంచి నూతన వర్చువల్ ఐడీ విధానాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీచేసింది. ఆధార్ నంబర్‌కు బదులు ఆధార్‌కు సంబంధించిన వర్చువల్ ఐడీలను కస్టమర్లు చెబితే సరిపోతుంది. ఓ వ్యక్తి ఆధార్ నంబర్‌కు 16 అంకెల ర్యాండమ్ నంబర్‌ను కేటాయిస్తారు. ఆధార్ రూపంలో వ్యక్తిగత డేటా దుర్వినియోగం అవుతుందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రం దీన్ని ఆచరణలోకి తెస్తోంది. ఈ నేపథ్యంలో టెల్కోలు ఆధార్ ఈకేవైసీ ధ్రువీకరణ స్థానంలో నూతన వర్చువల్ ఐడీ, పరిమిత ఈ–కేవైసీ ఆధారంగా కొత్త కనెక్షన్ల జారీ, చందాదారుల రీవెరిఫికేషన్‌కు అనువైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. -
మీడియాకు చిక్కిన మహేష్ షా డైరీ
కమీషన్ల కోసం కక్కుర్తి పడి కటకటాల పాలైన అహ్మదాబాద్ వ్యాపారి మహేష్ షా డైరీ మీడియాకు చిక్కింది. ఈ డైరీలో ఐడీఎస్ స్కీమ్ కింద మహేష్ షా ప్రకటించిన ఆస్తులు గుజరాత్, మహారాష్ట్ర వ్యాపారులకు చెందినవిగా గుర్తించారు. ఒక శాతం లంచం ఇస్తామనడంతో రూ.13,860 కోట్ల బ్లాక్‌మనీని కేంద్రప్రభుత్వం ఆదాయ డిక్లరేషన్ పథకం కింద తనదిగా మహేష్ షా ప్రకటించాడు. అయితే ఆ బడాబాబులు చివరి నిమిషంలో చేతులెత్తేయడంతో రూల్స్ ప్రకారం కట్టాల్సిన 45 శాతం పన్నులో తొలి వాయిదా రూ. 1,560 కోట్లను చెల్లించలేక పారిపోయాడు. దీంతో షాపై అనుమానంతో ఐటీ అధికారులు అతని వెతుకులాట ప్రారంభించారు. ఇటీవలే అతన్ని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఐటీ అధికారుల విచారణలో ఆ నగదు అతనిది కాదని గుర్తించారు. ఐడీసీ కింద బయటపెట్టిన బ్లాక్‌మనీ అంతా తనది కాదని, అది కొందరు రాజకీయనేతలు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలది షా ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అది ఎవరిదో కూడా త్వరలోనే బయటపెడతానని షా పేర్కొన్నాడు. ఈ పరిణామాల అనంతరం షా డైరీ మీడియాకు కంట పడింది. -
బోగస్ ’ఐడీఎస్’ లక్ష్మణరావు మోసపోయాడట!
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకంలో (ఐడీఎస్) రూ.10 వేల కోట్లు నల్లధనం తన వద్ద ఉన్నట్లు డిక్లేర్ చేసి, పన్ను చెల్లింపు దగ్గరకు వచ్చేసరికి ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారుల్ని ముప్పతిప్పలు పెట్టిన బాణాపురం లక్ష్మణరావు వెనుక ఉన్న బడాబాబులు’ వెలుగులోకి రానట్లేనా..? ఔననే అనుమానాలు కలుగుతున్నాయి. సాక్షాత్తు ఐటీ అధికారులే ఇతడు మోసపోయినట్లు’ నిర్థారించడమే దీనికి కారణం. ఈ మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు (సీసీఎస్) గురువారం లేఖ రాసిన ఐటీ విభాగం.. లక్ష్మణరావును మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. ఈ లేఖను అనధికారంగా తిరస్కరించిన సీసీఎస్ పోలీసులు బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు. ఐటీ అధికారుల నుంచి తమకు లేఖ అందిందని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి సాక్షి’కి తెలిపారు. (ఆ 10 వేల కోట్లు బోగస్!) ఐడీఎస్ పథకం కింద సెప్టెంబర్ ఆఖరు వరకు దేశ వ్యాప్తంగా ప్రకటించిన భారీ మొత్తాల్లో నగరం నుంచి డిక్లేర్ చేసిన రూ.10 వేల కోట్లు కూడా ఉంది. దీనిపై అప్పట్లో కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాయి. అయినప్పటికీ రెండు నెలల వరకు రూ.10 వేల కోట్లు డిక్లేర్ చేసింది ఎవరనేది ఐటీ అధికారులు బయటకు చెప్పలేదు. సెప్టెంబర్ 30 వరకు డిక్లేర్ చేసిన మొత్తానికి సంబంధించి నల్లబాబులు’ పన్ను/సర్‌చార్జ్‌ల్ని మూడు విడతల్లో 2017 మార్చి నాటికి చెల్లించాల్సి ఉంది. మొదటి వాయిదా అయిన రూ.1125 కోట్లు చెల్లించలేక చేతులెత్తేయడంతోనే లక్ష్మణరావు పేరు వెలుగులోకి వచ్చింది. ఫిల్మ్‌నగర్‌లోని అతడి ఇంటితో పాటు మరో ఇద్దరి ఇళ్ళపై దాడులు చేసి ఐటీ అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టారు’. మోసపోయినట్లు అనధికారిక నిర్థారణ... సోదాల నేపథ్యంలో ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయిన ఐటీ అధికారులు లక్ష్మణరావును విచారించారు. (బాణాపురం లక్ష్మణ్‌రావు ఇంట్లో చిల్లి గవ్వ కూడా దొరకలేదు) ఈ నేపథ్యంలోనే ఇతడు తాను ఓ బాబాతో పాటు మరికొందరి మాటలు నమ్మానంటూ ఐటీ అధికారులకు సినిమా చూపించాడు. రైల్ పుల్లింగ్ కాయిన్స్/బౌల్స్‌ను సేకరించి ఇస్తానని చెప్పిన ఓ బాబా మాటలు నమ్మానంటూ చెప్పుకొచ్చాడు. వాటిని అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించడం ద్వారా రూ.10 వేల కోట్లు సంపాదించవచ్చంటూ వారు చెప్పిన నేపథ్యంలోనే ఆ మేరకు డిక్లేర్ చేశానంటూ ఐటీ అధికారులకు తెలిపాడు. దీన్ని గుడ్డిగా నమ్మిన ఐటీ అధికారులు సదరు బాబా ఎవరు? వీరికి దళారులుగా వ్యవహరించింది ఎవరు? తదితర అంశాలను గుర్తించేందుకు పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేయలేదు. ఆర్థిక చట్ట ప్రకారం ఇలాంటి బోగస్ డిక్లరేషన్ చేసిన వారిపై కేసు నమోదు చేసి, ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉన్నా... ఇప్పటి వరకు అలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కేవలం లక్ష్మణరావు చెప్పిన మాటల్నే పరిగణలోకి తీసుకున్న ఐటీ అధికారులు అతడు మోసపోయినట్లు అనధికారంగా నిర్థారించేశారు. సీసీఎస్‌లు లేఖ రాసిన ఐటీ... లక్ష్మణరావు వ్యవహారాన్ని లోతుగా దర్యాప్తు చేయడం, అతడిపై ఆర్థిక చట్టం కింద కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయడాన్ని పక్కన పెట్టిన ఐటీ అధికారులు అతడి పైనే సానుభూతి చూపడం ప్రారంభించారు. రైస్ పుల్లింగ్ సహా ఇతర పేర్లతో లక్ష్మణరావును మోసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏకంగా సీసీఎస్ పోలీసులకు లేఖ రాశారు. ఈ లేఖను చూసి అవాక్కైన అధికారులు బాధితుడు కాకుండా మూడో వ్యక్తి/సంస్థ రాసిన లేఖను ఫిర్యాదుగా స్వీకరించలేమని ఐటీ అధికారులకు స్పష్టం చేశారు. లక్ష్మణరావు మోసం చేశాడని భావిస్తే అతడిపై ఫిర్యాదు చేయాలని, మోసపోయాడనే అభిప్రాయం ఉంటే నేరుగా వచ్చి ఫిర్యాదు చేసేలా సూచించాలని స్పష్టం చేశారు. బాధితుడే వచ్చి ఫిర్యాదు చేయడంతో పాటు ప్రాథమిక ఆధారాలు సమర్పిస్తేనే తదుపరి చర్యలు తీసుకోగలమని ఐటీ అధికారులకు చెప్పారు. దీంతో చేసేది లేక ఐటీ అధికారులు తిరిగి వెళ్ళినట్లు సమాచారం. ‘బడాబాబులకు’ బినామీ..! ఐడీఎస్ లక్ష్మణరావు పేరు వెలుగులోకి వచ్చిన తొలి రోజునే అనేక కథనాలు బయటకు వచ్చాయి. కొందరు ‘బడాబాబులకు’ ఇతడు బినామీ అని, వారి నల్లధనాన్నే మార్చేందుకు తనకు చెందినదిగా డిక్లేర్ చేశారని వినిపించింది. అయితే సెప్టెంబర్ 30తో ఐడీఎస్ స్కీమ్ ముగియగా... నవంబర్ 8న డీమానిటైజేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో సదరు బడాబాబుల’ అంచనాలు తారుమారైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పన్ను కట్టలేక లక్ష్మణరావును చేతులెత్తేయమని చెప్పారని తెలిసింది. అతడికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సహకరిస్తామంటూ హామీ సైతం ఇచ్చినట్లు సమాచారం. లక్ష్మణరావుకు సంబంధించి వినిపిస్తున్న కథనాలు, అతడి గత చరిత్రను పరిగణలోకి తీసుకోని ఐటీ అధికారులు కొత్త పల్లవి అందుకున్నారు. ఓ బాబాతో పాటు కొందరి చేతిలో లక్ష్మణరావు మోసపోయాడని, వారి మాటలు నమ్మి రూ.లక్షల్లో పోగొట్టుకున్నాడటం సానుభూతి చూపించడం ప్రారంభించారు. లక్ష్మణరావు కథలో ఐటీ విభాగం నుంచి ఈ ట్విస్ట్ రావడానికి బడాబాబులు’ తీసుకువచ్చిన ఒత్తిడే కారణమని తెలుస్తోంది. నిందితుడిగా చేర్చాల్సిన వ్యక్తిని బాధితుడిగా మార్చడం వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
లక్ష్మణ్‌రావు ఇంట్లో రెండోరోజూ సోదాలు
► ‘రూ.10 వేల కోట్ల’ వెల్లడికి కారణాలపై ఆరా ►48 డాక్యుమెంట్ల స్వాధీనం ►కంపెనీలన్నీ బోగస్ అని వెల్లడి హైదరాబాద్: ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్) కింద తన వద్ద సుమారు రూ.10 వేల కోట్ల సంపద ఉన్నట్లు వెల్లడించిన బాణపురం లక్ష్మణ్‌రావు ఇంట్లో ఐటీ అధికారులు బుధవారం రెండోరోజూ విసృ్తతంగా సోదాలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకే ఫిలిం నగర్‌లోని ఆయన నివాసానికి రెండు బృందా లుగా వచ్చిన అధికారులు తొలుత లక్ష్మణ్‌రావు తోపాటు ఆయన భార్య రమాదేవిని విచారిం చారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మళ్లీ వచ్చి ఆయన కుమారులను విచారించారు. రూ.10 వేల కోట్లు వెల్లడించడానికి గల కార ణాలపై లక్ష్మణ్‌రావును ప్రశ్నించారు. ఇంట్లో ప్రతి అంగుళం సోదా చేశారు. సుమారు 48 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో తాండూరుకు చెందిన ఓ పరిశ్రమ డాక్యుమెంట్లు, బీబీనగర్‌లో బీఎల్ఆర్ వెంచ ర్స్ డాక్యుమెంట్లు, తార్నాకలో రెండు భవనా ల పత్రాలు వెలుగు చూశాయి. లక్ష్మణ్‌రావు స్థాపించిన కంపెనీలన్నీ 2014లోనే ప్రారంభం కావడం, ఇప్పటి వరకు చెల్లించిన ఆదాయ పన్ను వివరాలపై ప్రశ్నించారు. ఆయన భార్య రమాదేవి, కొడుకులు ప్రమోద్, వెంకట సతీశ్‌లతో పాటు, ఇంట్లో పని మనుషులు, డ్రైవర్లను కూడా వివిధ అంశాలపై విచారించారు. అయితే ఈ విచారణలో అధికారులకు కావాల్సిన సమాచారం లభించలేదని తెలిసింది. లక్ష్మణ్‌రావు వెనక ఎవరైనా పెద్ద మనిషి ఉన్నారా అన్న అంశంపై అధికారులు దృష్టి సారించారు. పలు కంపెనీలకు సంబంధించి ఆయన వెల్లడించిన అడ్రస్‌లన్నీ బోగస్‌వేనని తేలిపోయింది. ఆయనెవరో స్థానికులకే తెలియదు ఐటీ సోదాలతో వెలుగులోకి వచ్చిన లక్ష్మణ్‌రావు ఇప్పటి వరకు స్థానికులకు కూడా తెలియకపోవడం గమనార్హం. గతంలో రామంతపూర్ విశాల్ మెగా మార్కెట్ వెనుక ఉన్న అపార్ట్మెంట్ యమున బ్లాక్‌లోని 410 ఫ్లాట్‌లో లక్ష్మణ్‌రావు కొన్నాళ్లు అద్దెకున్నారు. అనంతరం బంజారాహిల్స్‌కు మకాం మార్చారు. గత అక్టోబర్‌లో ఫిలింనగర్లో ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటిని కొనుగోలు చేశారు. చార్మినార్ బ్యాంకు చైర్మన్ మీర్ ఆగా పేరిట ఈ ఇల్లు ఉంది. ఆగా గతంలోనే దుండగుల కాల్పుల్లో మృతి చెందగా ఆయన భార్య షమీమ్ ఆగా మరో ముగ్గురు కుటుంబ సభ్యులు ఈ ఇంటిని లక్ష్మణ్‌రావుకు విక్రయించారు. ఈ ఇల్లు లక్ష్మణ్‌రావుతో పాటు భార్య రమాదేవి, ఇద్దరి కొడుకుల పేరిట రిజిస్టర్ అయి ఉంది. -
ఐడీఎస్ జరిమానాను పాత నోట్లతోనే కట్టొచ్చు
నిరాకరించొద్దంటూ బ్యాంకులకు ఐబీఏ సూచన న్యూఢిల్లీ: నల్లధనానికి సంబంధించి ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్) కింద ప్రకటించిన సొమ్ముపై డిక్లరెంట్లు తొలి విడతగా కట్టే పన్నులు, జరిమానాలను పాత రూ.500 నోట్ల రూపంలోనూ స్వీకరించవచ్చని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సోమవారం బ్యాంకులకు సూచించింది. అలా చెల్లించిన నిధులకు సంబంధించిన మూలాల గురించి ప్రశ్నించరాదని పేర్కొంది. డిక్లరెంట్లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చెల్లింపుల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని బ్యాంకులకు రాసిన లేఖలో సూచించింది. ఐడీఎస్ కింద ప్రకటించిన ఆదాయంపై పన్ను, పెనాల్టీలను పాత నోట్ల రూపంలో తీసుకునేందుకు బెంగళూరులోని ఓ బ్యాంకు శాఖ నిరాకరించిందంటూ ఒక డిక్లరెంటు చేసిన ఫిర్యాదును రిజర్వ్ బ్యాంక్ దృష్టికి సీబీడీటీ తీసుకొచ్చిన అంశాన్ని ఐబీఏ ప్రస్తావిం చింది. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నిబంధనల ప్రకారం ఐడీఎస్ 2016కు సంబంధించి నిర్దేశించిన పన్ను, సర్‌చార్జి, పెనాల్టీలో కనీసం 25 శాతాన్ని తొలి విడతగా నవంబర్ 30లోగా కట్టాల్సి ఉంటుంది. తదనుగుణంగానే నిధుల మూలం గురించి ప్రశ్నించకుండా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం పాత రూ.500 నోట్లతో జరిపే చెల్లింపులను బ్యాంకులు స్వీకరించవచ్చునని ఐబీఏ పేర్కొంది. బ్లాక్‌మనీని వెలికితీసేందుకు ప్రభుత్వం జూన్‌లో ఐడీఎస్ను తెరపైకి తెచ్చింది. 45% పన్ను లు, పెనాల్టీలు కట్టడం ద్వారా నల్లధనాన్ని మార్చుకునేందుకు వన్ టైమ్ విండో కింద వెసులుబాటు కల్పించింది. అధికారిక గణాంకాల ప్రకారం 64,275 మంది ఐడీఎస్ కింద రూ.65,250 కోట్ల మేర లెక్కల్లో చూపని ఆదాయాన్ని ప్రకటించారు. దీనిపై ప్రభుత్వానికి రూ.30,000 కోట్లు పన్నుల రూపంలో దఖలు పడనున్నారుు. నిబంధనల ప్రకారం పన్నులు, పెనాల్టీలను తొలి విడతగా నవంబర్ 30లోగా, రెండో విడతగా వచ్చే ఏడాది మార్చి 31లోగా పాతిక శాతం చొప్పున కట్టాల్సి ఉంటుంది. మిగతాది వచ్చే ఏడాది సెప్టెంబర్ 30లోగా చెల్లించాలి. -
ఆ నల్లధనం 75 వేల కోట్ల పైనే..
న్యూఢిల్లీ: ఆదాయ వెల్లడి పథకం(ఐడీఎస్) కింద బయటపడ్డ నల్లధనం మరో రూ.10 వేల కోట్లు పెరిగే అవకాశం ఉందని ఆదాయ పన్ను శాఖ అంచనా. ఐడీఎస్ కింద దేశవ్యాప్తంగా వెలికివచ్చిన నల్లధనం రూ. 65,250 కోట్లని ఈ నెల ఒకటిన మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడం తెలిసిందే. దీనికి మరో రూ. 10 వేల కోట్లు కలుస్తాయని.. ఐటీ శాఖ రికార్డులన్నీ పరిశీలించి వ చ్చే వారానికి ఈ మేరకు నివేదికను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)కి అందించనుందని అధికారులు తెలిపారు. దీంతో ఐడీఎస్ కింద రూ. 75 వేల కోట్లకు పైగానే లెక్క తేలనుందని వారు తెలిపారు. అక్రమాస్తులు, నగదును 45 శాతం పన్ను కట్టి సక్రమంగా మార్చుకోవచ్చంటూ ప్రభుత్వం ఐడీఎస్ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ఈ ఏడాది జూన్ 1న ప్రారంభమై సెప్టెంబర్ 30తో ముగిసింది. -
నల్లధనం వెల్లడిలో హైదరాబాద్ టాప్!
13 వేల కోట్ల అక్రమాదాయం ప్రకటించిన నగర కుబేరులు - ముగిసిన ఆదాయ వెల్లడి పథకం గడువు - దేశవ్యాప్తంగా మొత్తం రూ. 65,250 కోట్ల నల్లధనం బహిర్గతం - ప్రభుత్వానికి రూ. 29,362కోట్ల ఆదాయం - పథకం వివరాలను వెల్లడించిన కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ న్యూఢిల్లీ: దేశంలో నల్లధనాన్ని వెలికి తీసే క్రమంలో మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ఆదాయ వెల్లడి పథకానికి(ఐడీఎస్) భారీ స్పందన లభించింది. పన్ను చెల్లించని ఆదాయాన్ని స్వచ్ఛందంగా చెప్పేందుకు ప్రభుత్వం విధించిన గడువు సెప్టెంబర్ 30 నాటికి భారీగా రూ. 65,250 కోట్ల నల్లధనం వెలుగు చూసింది. ఇందులో రూ. 29,362 కోట్లు పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరనున్నాయి. ఈ మొత్తంలో రూ. 14,700 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో సమకూరుతాయి. ఈ పథకంలో 64, 275 మంది తమ అక్రమాదాయాన్ని బయటపెట్టారు. సగటున ఒక్కొక్కరు రూ. కోటి ఆదాయాన్ని వెల్లడించారు. ఈ వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శనివారం మీడియాకు వెల్లడించారు. అయితే, ఈ మొత్తంలో అత్యధిక వాటా హైదరాబాద్‌దే కావడం విశేషం. శుక్రవారం సాయంత్రం నాటికి హైదరాబాద్ నుంచి దాదాపు రూ. 13 వేల కోట్ల అప్రకటిత ఆదాయం వెల్లడైందని ఐటీ వర్గాల సమాచారం. మిగతా స్థానాల్లో ముంబై(రూ. 8,500 కోట్లు), ఢిల్లీ(రూ. 6 వేల కోట్లు), కోల్‌కతా(రూ. 4 వేల కోట్లు) ఉన్నాయి. ఇప్పటివరకు ప్రకటించిన ఆదాయ వెల్లడి పథకాల్లో అత్యంత విజయవంతమైన పథకం ఇదేనని, ఈ ఘనత ప్రధాని మోదీకి చెందుతుందని జైట్లీ పేర్కొన్నారు. గణాంకాల నమోదు కొనసాగుతోందని, వెల్లడైన ఆదాయానికి సంబంధించిన కచ్చితమైన సమాచారం ఆ ప్రక్రియ ముగిశాక తెలుస్తుందని చెప్పారు. ‘ప్రభుత్వానికి పన్నులు, జరిమానాలుగా రూ. 29,362.5 కోట్లు రానున్నాయి. ఈ మొత్తాన్ని భారత సంచిత నిధిలోకి చేర్చి ప్రజా సంక్షేమానికి వినియోగిస్తాం. ఈ పథకం ద్వారా ఆదాయాన్ని ప్రకటించినవారు తమ పన్నులు, జరిమానాలను సెప్టెంబర్ 30, 2017లోపు రెండు విడతల్లో చెల్లించే అవకాశముంది’ అని వివరించారు. ఆదాయాన్ని ప్రకటించినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఐడీఎస్‌లో కూడా నల్ల ధనం వివరాలు వెల్లడించనివారిపై చర్యలేమైనా తీసుకొంటారా అన్న ప్రశ్నకు.. ఎప్పటిలానే సోదాలు కొనసాగుతాయన్నారు. పన్నులు కట్టని ఆదాయ వివరాలు వెల్లడించేందుకు కేంద్రం ఈ సంవత్సరం జూన్ 1న ఐడీఎస్ తీసుకొచ్చింది. వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద 45 శాతం పన్ను, పెనాల్టీ చెల్లించే వీలు కల్పించింది. విదేశాల్లో దాచిన భారతీయుల నల్లధనానికి సంబంధించి గత ఏడాది ప్రకటించిన ఇదే తరహ పథకం ద్వారా రూ. 2,428 కోట్లు పన్ను రూపేణా ఖజానాకు జమ అయ్యాయి. 644 మందే దీనికి స్పందించారు. 1997లో నాటి ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించిన స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం(వీఐడీఎస్) ద్వారా ప్రభుత్వానికి రూ. 9,760 కోట్లు పన్ను ఆదాయం లభించింది. అయితే, తాము ప్రకటించిన ఐడీఎస్, చిదంబరం ప్రకటించిన వీఐడీఎస్ వేరువేరు పథకాలని జైట్లీ తెలిపారు. వీఐడీఎస్ మాదిరిగా తమది పూర్తిస్థాయి క్షమాభిక్ష పథకం కాదన్నారు. ఆ పథకంలో పన్నుశాతం చాలా తక్కువన్నారు. 1951 నుంచి 1997 మధ్య పది ఈ తరహా పథకాలను ప్రకటించారు. వీటిలో 1985/86 నాటి పథకం(రూ. 10,778 కోట్లు), 1997 నాటి వీఐడీఎస్ మాత్రమే విజయవంతమయ్యాయి. సత్ఫలితాలనిచ్చిన ప్రచారం... ఐదు వేలకు పైగా బహిరంగ సభలు, సామాజిక మాధ్యమాలు, పత్రికల్లో ప్రకటనలు, టాకథాన్లు, అవగాహనా సదస్సులు... వీటికి తోడు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం... నాలుగు నెలలుగా భారీ స్థాయిలో సాగిన ఐడీఎస్ క్యాంపెయిన్ ధాటికి 64 వేల మందికి పైగా తమ నల్లధనం వివరాలు బహిర్గతం చేశారు. మరోవైపు ఆదాయపు పన్ను విభాగం కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎగవేత దారుల నుంచి వివరాలు రాబట్టగలిగింది. వివరాలు వెల్లడించినవారికి ప్రధాని ప్రశంస ఐడీఎస్ కింద నల్లధనం వివరాలు వెల్లడించిన వారిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. పన్ను కట్టేందుకు ముందుకు రావడం అభినందనీయమని... పారదర్శకత, దేశ ఆర్థికాభివృద్ధికి ఇది గొప్ప తోడ్పాటని మోదీ ట్వీట్ చేశారు. అలాగే నల్ల ధనం వెలికితీయడంలో ఆర్థిక శాఖ విజయం సాధించినందుకు అరుణ్ జైట్లీ బృందాన్ని మోదీ అభినందించారు. రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అదియా, సీబీడీటీ చైర్పర్సన్ రాణి నాయర్ బృందం కృషిని కొనియాడారు. రూ.56,378 కోట్ల అక్రమాస్తుల స్వాధీనం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆదాయ పన్ను శాఖ గత రెండేళ్లలో జరిపిన సోదాల్లో రూ.56,378 కోట్ల అక్రమాస్తులు బయటపడ్డట్టు జైట్లీ చెప్పారు.‘ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని మరో రూ.16 వేల కోట్లు గుర్తించాం. రూ.2వేల కోట్ల నగదు సీజ్ చేశాం. పనామా కేసునిందితులు, హెచ్ఎస్బీసీ జాబితాలోని వారిపైనా చర్యలు తీసుకుంటాం. హెచ్ఎస్బీసీ జా బితాకు సంబధించి రూ.8వేల కోట్ల లెక్కలు తేలాయి. 164 కేసులు నమోదయ్యాయి’అని చెప్పారు. -
రూ.65,250 కోట్ల బ్లాక్‌మనీ గుట్టురట్టు
నాలుగు నెలల నల్లధన వెల్లడి కార్యక్రమం ఐడీఎస్(ఆదాయం వెల్లడి పథకం) కింద రూ.65,250 కోట్ల విలువైన బ్లాక్‌మనీ వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం గడువు సెప్టెంబర్ 30తో ముగియడంతో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ శనివారం సమావేశం ఏర్పాటుచేసి నల్లధన వివరాలను ప్రకటించారు. గత రెండేళ్ల పాలనలో పన్ను ఎగవేతలను నిరోధించేందుకు ప్రభుత్వం తగిన చర్యలను తీసుకుందని జైట్లీ తెలిపారు. మొత్తం 64,275 దగ్గర్నుంచి రూ.65,250 కోట్లు సేకరించినట్టు వెల్లడించారు. రూ.8,000 కోట్లను హెచ్ఎస్బీసీ జాబితా ద్వారా గుర్తించినట్టు చెప్పారు.పన్ను ఎగవేతదారుల నుంచి రూ.16వేల కోట్లను ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకుందని తెలిపారు.ఆదాయ పన్ను లెక్కల్లో చూపకుండా పోగేసిన అక్రమాస్తుల వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించాలని ఆదాయపు వెల్లడి పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. స్వచ్ఛందంగా ఆస్తుల వివరాలను వెల్లడించి చట్టపరమైన చర్యల నుంచి బయటపడేందుకు అవకాశం కల్పించింది. ఒకవేళ ఈ పథకం కింద కూడా లెక్కల్లో ఆస్తులను చూపకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పలుమార్లు హెచ్చరించింది. -
68 మిలియన్ల యూజర్ ఐడీలు చోరీ
వాషింగ్టన్ : యూజర్ అకౌంట్ల చోరీ, లీకేజీల లొల్లితో కంపెనీలు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. తాజాగా మరో క్లౌడ్ ఆధారిత డేటా స్టోరేజ్ కంపెనీ డ్రాప్‌బాక్స్ తన యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు లీకైనట్టు వెల్లడించింది. దాదాపు 68 మిలియన్ క్లయింట్ల ఐడీలు, పాస్వర్డ్లు నాలుగేళ్ల క్రితం చోరీకి గురయ్యాయని, తాజాగా అవి ఇంటర్నెట్లో లీకైనట్టు డ్రాప్‌బాక్స్ తెలిపింది. అయితే ఏ యూజర్ అకౌంట్లు హ్యక్ అయ్యాయో తెలుపలేదు. అకౌంట్ల పాస్‌వర్డ్‌ల రీసెట్ చేసుకోవాలని కంపెనీ యూజర్లకు సూచించింది. రెండు వారాల క్రితమే కంపెనీ 68 మిలియన్ యూజర్ల ఆధారాలు ఆన్లైన్లో పోస్టు అయినట్టు కనుగొంది. అయితే ఈ పని ఎవరు చేసిందన్నది ఇంకా వెల్లడించలేదు. యూజర్ ఐడీల, పాస్‌వర్డ్‌ల చోరీపై చింతిస్తున్నామని, ఈ ఘటనకు తాము యూజర్లకు క్షమాపణ చెప్పుకుంటున్నట్టు కంపెనీ ఈ-మెయిల్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని తెలిపింది. 2012లో ఈ అకౌంట్ల చోరీ జరిగిందని, అప్పటి ఈమెయిల్ యూజర్లు ఈ బారీన పడినట్టు తాము విశ్వసిస్తున్నట్టు పేర్కొంది. 2012 నుంచి పాస్‌వర్డ్‌లను అప్డేట్ చేసుకోని వారు వెంటనే రీసెట్ చేసుకోవాలని సూచించింది. 2012 ముందునుంచి తమ సర్వీసులను వినియోగించుకుంటూ, ఒకే పాస్వర్డ్ వాడుతున్న యూజర్లను డ్రాప్‌బాక్స్ హెచ్చరించింది. వెంటనే తమ అకౌంట్ రక్షణ కోసం పాస్వర్డ్ మార్చుకోవాలని తెలిపింది.