ఐడీఎస్ జరిమానాను పాత నోట్లతోనే కట్టొచ్చు
నిరాకరించొద్దంటూ బ్యాంకులకు ఐబీఏ సూచన
న్యూఢిల్లీ: నల్లధనానికి సంబంధించి ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్) కింద ప్రకటించిన సొమ్ముపై డిక్లరెంట్‌లు తొలి విడతగా కట్టే పన్నులు, జరిమానాలను పాత రూ.500 నోట్ల రూపంలోనూ స్వీకరించవచ్చని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సోమవారం బ్యాంకులకు సూచించింది. అలా చెల్లించిన నిధులకు సంబంధించిన మూలాల గురించి ప్రశ్నించరాదని పేర్కొంది. డిక్లరెంట్‌లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చెల్లింపుల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని బ్యాంకులకు రాసిన లేఖలో సూచించింది. ఐడీఎస్ కింద ప్రకటించిన ఆదాయంపై పన్ను, పెనాల్టీలను పాత నోట్ల రూపంలో తీసుకునేందుకు బెంగళూరులోని ఓ బ్యాంకు శాఖ నిరాకరించిందంటూ ఒక డిక్లరెంటు చేసిన ఫిర్యాదును రిజర్వ్ బ్యాంక్ దృష్టికి సీబీడీటీ తీసుకొచ్చిన అంశాన్ని ఐబీఏ ప్రస్తావిం చింది.
కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నిబంధనల ప్రకారం ఐడీఎస్ 2016కు సంబంధించి నిర్దేశించిన పన్ను, సర్‌చార్జి, పెనాల్టీలో కనీసం 25 శాతాన్ని తొలి విడతగా నవంబర్ 30లోగా కట్టాల్సి ఉంటుంది. తదనుగుణంగానే నిధుల మూలం గురించి ప్రశ్నించకుండా ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం పాత రూ.500 నోట్లతో జరిపే చెల్లింపులను బ్యాంకులు స్వీకరించవచ్చునని ఐబీఏ పేర్కొంది.
బ్లాక్‌మనీని వెలికితీసేందుకు ప్రభుత్వం జూన్‌లో ఐడీఎస్‌ను తెరపైకి తెచ్చింది. 45% పన్ను లు, పెనాల్టీలు కట్టడం ద్వారా నల్లధనాన్ని మార్చుకునేందుకు వన్ టైమ్ విండో కింద వెసులుబాటు కల్పించింది. అధికారిక గణాంకాల ప్రకారం 64,275 మంది ఐడీఎస్ కింద రూ.65,250 కోట్ల మేర లెక్కల్లో చూపని ఆదాయాన్ని ప్రకటించారు. దీనిపై ప్రభుత్వానికి రూ.30,000 కోట్లు పన్నుల రూపంలో దఖలు పడనున్నారుు. నిబంధనల ప్రకారం పన్నులు, పెనాల్టీలను తొలి విడతగా నవంబర్ 30లోగా, రెండో విడతగా వచ్చే ఏడాది మార్చి 31లోగా పాతిక శాతం చొప్పున కట్టాల్సి ఉంటుంది. మిగతాది వచ్చే ఏడాది సెప్టెంబర్ 30లోగా చెల్లించాలి.