రూ.65,250 కోట్ల బ్లాక్మనీ గుట్టురట్టు
నాలుగు నెలల నల్లధన వెల్లడి కార్యక్రమం ఐడీఎస్(ఆదాయం వెల్లడి పథకం) కింద రూ.65,250 కోట్ల విలువైన బ్లాక్మనీ వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం గడువు సెప్టెంబర్ 30తో ముగియడంతో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ శనివారం సమావేశం ఏర్పాటుచేసి నల్లధన వివరాలను ప్రకటించారు. గత రెండేళ్ల పాలనలో పన్ను ఎగవేతలను నిరోధించేందుకు ప్రభుత్వం తగిన చర్యలను తీసుకుందని జైట్లీ తెలిపారు. మొత్తం 64,275 దగ్గర్నుంచి రూ.65,250 కోట్లు సేకరించినట్టు వెల్లడించారు.
రూ.8,000 కోట్లను హెచ్ఎస్బీసీ జాబితా ద్వారా గుర్తించినట్టు చెప్పారు.పన్ను ఎగవేతదారుల నుంచి రూ.16వేల కోట్లను ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకుందని తెలిపారు.ఆదాయ పన్ను లెక్కల్లో చూపకుండా పోగేసిన అక్రమాస్తుల వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించాలని ఆదాయపు వెల్లడి పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. స్వచ్ఛందంగా ఆస్తుల వివరాలను వెల్లడించి చట్టపరమైన చర్యల నుంచి బయటపడేందుకు అవకాశం కల్పించింది. ఒకవేళ ఈ పథకం కింద కూడా లెక్కల్లో ఆస్తులను చూపకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పలుమార్లు హెచ్చరించింది.