'నేను వీఐపీ కాదు.. ఎల్ఐపీ'
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లో వరుసగా రెండో పర్యాయం అధికారం చేజిక్కించుకోవడం పట్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతోషం వ్యక్తం చేశారు. తమ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు ఘన విజయం కట్టబుట్టిన బెంగాల్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెల్లడైన తర్వాత ఆమె 'ఎన్డీటీవీ'తో మాట్లాడారు. తన తర్వాతి లక్ష్యం ఢిల్లీ కాదని, సొంత రాష్ట్రానికి సేవలు చేయడమే తనకు ఇష్టమని తెలిపారు.
2019 సాధారణ ఎన్నికల్లో మీరు ప్రధాని అభ్యర్థిగా నిలబడతారా అని ప్రశ్నించగా... 'నేను సాధారణ మనిషిని. నేను ఏదీ కోరుకోవడం లేదు. మాతృభూమికి నా వంతు సేవ చేయాలని మాత్రమే ఆశిస్తున్నాను. నా దేశం అభివృద్ధి చెందాలను కోరుకుంటున్నాను. ఇందులో భాగంగా చిన్నపాత్ర పోషిస్తున్నాను. రాజకీయాల్లో నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు. వారంతా కలిసి కూర్చుకుని ఎవరిని ప్రధాని అభ్యర్థిగా పెట్టాలో ఆలోచిస్తారు. నాకు అత్యాశ లేద'ని మమత సమాధానమిచ్చారు.
తాను వీఐపీని కాదని, తక్కువ ప్రాధాన్య కలిగిన వ్యక్తి(లెస్ ఇంపార్టెంట్ పర్సన్)ని అని చెప్పారు. 61 ఏళ్ల మమతా బెనర్జీ రెండోసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అవినీతి ఆరోపణలు చుట్టుముట్టినా ఆమె అధికారం నిలబెట్టుకోవడం విశేషం. మిత్రులకు దూరం కావడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. బీజేపీ సిద్ధాంతాలకు తాను పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. సోనియా గాంధీని మీ స్నేహితురాలిగా పరిగణించవచ్చా అన్న ప్రశ్నకు మమతా బెనర్జీ సమాధానం దాటవేశారు.